డెడ్ సీ వద్ద నగ్నంగా 300 మంది

ABN , First Publish Date - 2021-10-19T21:04:55+05:30 IST

ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ క్షీణిస్తుండటంపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు

డెడ్ సీ వద్ద నగ్నంగా 300 మంది

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ క్షీణిస్తుండటంపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ వినూత్న ప్రయత్నం చేశారు. 300 మంది స్త్రీ, పురుష వాలంటీర్ల శరీరాలకు తెల్లని రంగు వేసి, ఈ సముద్రం వద్ద ఆదివారం నగ్నంగా నిల్చోబెట్టి, ఫొటోలు తీశారు. స్పెన్సర్ గతంలో ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించారు. మూడు గంటలపాటు సాగిన ఫొటోషూట్‌ను ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేసింది. 


ఈ వాలంటీర్లంతా ఆదివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ నగరం ఆరద్‌కు చేరుకున్నారు. వీరిని నగ్నంగా చేసి, శరీరాలకు తెల్లని రంగు వేశారు. స్పెన్సర్ టునిక్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌ సందర్శన తనకు గొప్ప అనుభవమని చెప్పారు. ఇటువంటి కళను అనుమతించే ఏకైక దేశం మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ మాత్రమేనని, ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషకరమని చెప్పారు. 


ఈ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ డెడ్ సీని పరిరక్షించుకోవలసిన అవసరంపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫొటో షూట్ చాలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, దాని పొరుగు దేశాలు ఈ సముద్ర జలాలను వ్యవసాయానికి మళ్ళించాయి. భూమి అత్యంత లోతైన స్థాయిలో ఉన్న ఈ సముద్రం క్రమంగా క్షీణిస్తోంది. 


Updated Date - 2021-10-19T21:04:55+05:30 IST