నకిలీ సృష్టికర్తలు దొరికారు!

ABN , First Publish Date - 2022-01-23T04:55:19+05:30 IST

నకిలీ పత్రాలతో ట్యాంకర్లు, లారీలకు అక్రమ రిజిసే్ట్రషన్లు చేసిన వారి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

నకిలీ సృష్టికర్తలు దొరికారు!
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి (వెనుక అరెస్టు అయిన నిందితులు)

కొలిక్కి వస్తున్న ట్యాంకర్ల, లారీల అక్రమ రిజిసే్ట్రషన్ల కేసు

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

‘రవాణా’లో ఇంటి దొంగల కోసం వేట

ఇప్పటికే పోలీసుల అదుపులో సూళ్లూరుపేట ఎంవీఐ, కారు డ్రైవర్‌


నెల్లూరు/గూడూరు, జనవరి 22 : నకిలీ పత్రాలతో ట్యాంకర్లు, లారీలకు అక్రమ రిజిసే్ట్రషన్లు చేసిన వారి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకున్న రవాణా శాఖ ఉన్నతాధికారులు దూకుడు ప్రదర్శించగా పోలీసులు అరెస్టులతో అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. దీంతో ఖంగుతిన్న అక్రమార్కులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. 

విజయవాడ కేంద్రంగా జరిగిన 103 ట్యాంకర్లు, లారీల  అక్రమ రిజిసే్ట్రషన్ల వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన రవాణా శాఖ ఉన్నతాధికారులు గూడూరు ఆర్టీవో మల్లికార్జునరెడ్డి,  సూళ్లూరుపేట ఎంవీఐ గోపీనాయక్‌లతోపాటు విజయవాడ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షనవేటు వేశారు. రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాలతో  ఈ నెల 8వ తేదీన నెల్లూరు డీటీసీ చందర్‌ గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారిస్తున్న పోలీసులు ప్రధాన ముద్దాయిలుగా భావించే ముగ్గురు ముఠా సభ్యులను శుక్రవారం అరెస్టు చేశారు. వీరితోపాటు గూడూరు ఆర్టీవో మల్లికార్జునరెడ్డి, సూళ్లూరుపేట ఎంవీఐ గోపీనాయక్‌, మరో ఐదుగురు సిబ్బంది, ఐదుగురు ప్రైవేట్‌ వ్యక్తులు ఈ గోల్‌మాల్‌లో కీలకంగా వ్యవహరించినట్లుగా  పోలీసులు గుర్తించారు. అందులో  సూళ్లూరుపేటకు చెందిన అస్లాం అనే ప్రైవేట్‌ వ్యక్తి అధికార పార్టీకి చెందిన ఓ నేత నీడలో ఉన్నట్లుగా  తెలుస్తోంది. కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అస్లామే కీలక వ్యక్తిగా రవాణా శాఖ అధికారులు గుర్తించారు. 


ముందస్తు బెయిల్‌ కోసం


ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న రవాణా శాఖ కమిషనర్‌ తదుపరి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకున్న సస్పెన్షనకు గురైన అధికారులు ముందస్తు బెయిల్‌ కోసం  హైకోర్టులో ముమ్మరంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఆ ప్రయత్నాలు విఫలమవడంతో చేసేదిలేక ఆ అధికారులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసు కేసు నమోదు కాకముందు వరకు వీరంతా విజయవాడలోనే మకాంవేసి ఇందులోనుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు కేసు నమోదుకావడంతో న్యాయనిపుణుల సలహామేరకు కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఇటీవల సూళ్లూరుపేట ఎంవీఐ గోపీనాయక్‌ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంవీఐ గోపీనాయక్‌ను శుక్రవారం చిత్తూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏదీఏమైనా అటు రవాణా శాఖ ఉన్నతాధికారుల చర్యలు ఇటు పోలీసుల అరెస్టులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణం ఎవరిని అరెస్టు చేస్తారోనంటూ రవాణా శాఖ కార్యాలయాలలో గుసగుసలు వినబడుతున్నాయి. 


సూత్రధారుల కోసం ముమ్మర గాలింపు : డీఎస్పీ


వాహనాల అక్రమ రిజిసే్ట్రషన్ల కేసులో సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నల్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం గూడూరు రూరల్‌ పోలీ్‌సస్టేషనలో అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది డిసెంబరులో  గూడూరు ఆర్టీవో కార్యాలయంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాహనాలకు నకిలీ ఆర్‌సీలు, డాక్యుమెంట్లు సృష్టించి, వాహనాలు చూడకనే  103 వాహనాలకు ఆనలైనలో రిజిసే్ట్రషన్లు చేసినట్లు చెప్పారు. విజయవాడలోని ఆర్టీవో కార్యాలయంలో ఏజెంటుగా పని చేస్తూ బ్రోకర్‌ కార్యాలయం నిర్వహిస్తున్న ముద్ర వెంకటసుబ్బారావు, ఈయన కుమారుడు లీలాశ్రీధర్‌తోపాటు ముసినిపల్లి సత్యనారాయణలను అరెస్టు చేసినట్లు చెప్పారు. 2021, ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 109 వాహనాలకు రీ రిజిసే్ట్రషన్లు చేయించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. వైజాగ్‌, రాజమండ్రి, విజయవాడ తదితర పట్టణాలలోని వాహనదారులకు వారి పేర్ల మీద బదిలీ చేయించి వారి నుంచి ఒక్కో వాహనానికి రూ.2 లక్షల నుంచి 2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలకు రిజిసే్ట్రషన సర్టిఫికెట్ల సాయంతో రుణాలు తీసుకోవడం, స్ర్కాప్‌ వాహనాలకు ఈ నెంబర్లను తగలించి, ఐవోసీ ఆయిల్‌కంపెనీలలో టెండర్లలో పాల్గొని పాత వాహనాలనే తిప్పి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగజేసినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితులైన ఆర్టీవో మల్లికార్జున రెడ్డి, ఎంవీఐ గోపీనాయక్‌, ఏవోలు సునీల్‌కుమార్‌, అశోక్‌ప్రతాప్‌, సీనియర్‌ అసిస్టెంట్లు శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రశాంతల కోసం  ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అలాగే పరారీలో ఉన్న సూళ్లూరుపేటకు చెందిన అస్లాం పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది రాజు, వెంకటేశ్వర్లు, రహీం, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T04:55:19+05:30 IST