ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2022-06-30T03:49:47+05:30 IST

మండలంలోని వేంపాడు సమీపంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న నక్కలగండి రిజర్వాయరులో ఈతకు వెళ్లి ఓయువకుడు గల్లంతయ్యాడు.

ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
గల్లంతైన యువకుడు సునీల్‌ (ఫైల్‌)

వరికుంటపాడు, జూన్‌ 29: మండలంలోని వేంపాడు సమీపంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న నక్కలగండి రిజర్వాయరులో ఈతకు వెళ్లి ఓయువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని వేంపాడు ఎస్సీ కాలనీకి చెందిన గద్దె సునీల్‌(24)తో సహా తాతపూడి పెదబాబు, పోతల సంతుకుమార్‌, అజయ్‌కుమార్‌ సోదరులు తెలంగాణ, బెంగళూరు ప్రాంతాల్లో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగాస్తున్నారు. ఇటీవల దుత్తలూరు మండలం నర్రవాడలో జరిగిన వెంగమంబ పేరంటాల మహాత్సవాలకు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం సరదాగా ఈత కొట్టేందుకు ఆ నలుగురు రిజర్వాయరు వద్దకు చేరుకున్నారు. తొలుత పోతల సంతుకుమార్‌, తాతపూడి పెదబాబు రిజర్వాయరులోకి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం పోతల అజయ్‌కుమార్‌ ఒడ్డుపైనే ఉండగా గద్దె సునీల్‌ రిజర్వాయర్‌లోకి దూకి నీటిలో కూరుకుపోయాడు. గమనించిన సహచరులు ఒడ్డుకులాగే ప్రయత్నం చేసిన్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మిగిలిన యువకులు కాలనీలోకి పరుగులు తీసి గ్రామస్థులకు సమాచారం అందజేశారు. తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపే చీకటి పడటంతో వెనుదిరిగారు. కుమారుడు గల్లంతవ్వడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందితే గురువారం రిజర్వాయరులో గాలింపు చర్యలు చేపడుతామని ఎస్సై బాలమహేంద్రనాయక్‌ తెలిపారు.

Updated Date - 2022-06-30T03:49:47+05:30 IST