
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): చిన్న పట్టణాల మధ్య ఎయిర్ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్ఏఎల్) ‘సరస్ ఎంకే 2’ పేరుతో లైట్ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో 19 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు, రక్షణ బలగాలు, వీఐపీల రవాణా, ఎయిర్ అంబులెన్స్ సేవలకు దీన్ని వినియోగించవచ్చని ఎన్ఏఎల్ డైరెక్టర్ జితేంద్ర జాదవ్ తెలిపారు.
‘వింగ్స్ ఇండియా 2022’లో దీన్ని ప్రదర్శించారు. ఉడాన్ పథకం కింద చిన్న పట్టణాల్లో విమాన సేవలు అందించడానికి వీలుగా దీన్ని రూపొందించామని చెప్పారు. ఈ విమానం 29 వేల అడుగుల ఎత్తులో ఎగరటంతో పాటు గంటకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు. 15 సరస్ ఎంకే 2 విమానాల కొనుగోలుకు రక్షణ బలగాలు ముందుకు వచ్చాయి. రెండు విమానాల ను సొంతం చేసుకోవడానికి ఐకాట్ ఎయిర్ అంబులెన్స్.. లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చిందని జాదవ్ వివరించారు.