
నల్గొండ జిల్లా: వరుణుడి ప్రతాపానికి నల్గొండ జిల్లా అతలాకుతలమవుతోంది. నాంపల్లి మండలం, నరసింహులు గూడెం దగ్గర వాగు దాటుతుండగా బైక్‌తో సహా ఇద్దరు కొట్టుకుపోయారు. వెంటనే అక్కడున్న స్థానికులు తాడు సాయంతో వారిని కాపాడారు. వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇద్దరు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా చండూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొరటికల్ వాగు, శేషిలేటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జంగల కాలనీ, పెద్ద బజారు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతికి చండూరు నుంచి హైదరాబాద్, నల్గొండ, మునుగోడు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణం ప్రమాదంగా మారింది.