నల్గొండ కుర్రాడి.. చైనీస్‌ సినిమా..

Published: Sun, 21 Feb 2021 13:18:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్గొండ కుర్రాడి.. చైనీస్‌ సినిమా..

నల్గొండ నుంచి హాంకాంగ్‌ వెళ్లి, అక్కడి పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించి... నాలుగు పైసలు మిగిల్చుకుని ఇంటికి వద్దామనుకున్నాడు శ్రీకిషోర్‌. కానీ ఏకంగా చైనీస్‌ సినిమానే తీసి... అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.. 


‘‘నా సొంతూరు నల్గొండ. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. బళ్లారిలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశా. నల్గొండ దగ్గరే ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఏదో అసంతృప్తి. ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌ వర్మ ‘సత్య’ చూశాక సినిమాలపైకి మనసు మళ్లింది. ఎప్పటికైనా దర్శకుడినవ్వాలని తీర్మానించు కున్నా. ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌ చేరుకున్నా. మల్టీమీడియాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని దగ్గర ఎడిటింగ్‌ నేర్చుకున్నా. లఘు చిత్రాలు తీసేవాళ్లం. కృష్ణానగర్‌లోని ఒక ఫిల్మ్‌ స్కూల్‌లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాను. ఖాళీగా ఉండలేక ఒక టీవీ ఛానల్‌లో ఆర్నెళ్లు పనిచేశా కానీ జీతం సరిగా ఇచ్చేవాళ్లు కాదు. సెలవులకి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలకి డ్యాన్సు క్లాసులు చెబుతూ కాలం గడిపేవాణ్ణి.


డ్యాన్స్‌తో నిలదొక్కుకుని...

హాంకాంగ్‌లో డ్యాన్స్‌ మాస్టర్‌గా ఉద్యోగం ఉందని తెలిసిన మిత్రుడు చెప్పాడు. కాస్త డబ్బులు వెనకేసుకుని తిరిగి వచ్చేద్దామన్న ఆలోచనతోనే హాంకాంగ్‌కు 2008లో వెళ్లాను. అదో మహా నగరం. రెండు బాత్రూమ్‌ల సైజున్న చిన్న గదికి రూ.65 వేల అద్దె. అందులో దిగిపోయా. మన బాలీవుడ్‌ పాటలంటే హాంకాంగ్‌ పిల్లలకు భలే క్రేజ్‌. వాళ్లకు డ్యాన్స్‌ క్లాసులు తీసుకునేవాణ్ణి. సాంకేతికంగా హాంకాంగ్‌ సినిమా మనకంటే ఎంతో ముందుంది. ఒకవైపు డ్యాన్స్‌ క్లాసులతో ఉపాధి పొందుతూనే మరోవైపు సినిమా మెళకువలు నేర్చుకున్నాను. హైదరాబాద్‌లోని స్నేహితులతో కలిసి ‘సశేషం’, ‘బూ’, ‘దేవిశ్రీప్రసాద్‌’ అనే సినిమాలు తీశాను. అయితే హాంకాంగ్‌లోనే ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా కదా.. చైనీస్‌ సినిమా ఎందుకు తీయకూడదన్న ఆలోచన కలిగింది. 

నల్గొండ కుర్రాడి.. చైనీస్‌ సినిమా..

అక్కడి అమ్మాయిని ప్రేమించి..

హాంకాంగ్‌లో ఇప్పటి వరకు నా దగ్గర రెండు వేల మంది డ్యాన్స్‌ నేర్చుకున్నారు. డ్యాన్స్‌ నేర్చుకునేందుకు వచ్చిన హాంకాంగ్‌ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అక్కడి వారికి ఏ దేశ సంస్కృతైనా ఎంతో అభిమానం. మన సినిమాల్లో హీరోయిన్ల కట్టుబొట్టుపై ప్రత్యేక ఆసక్తి చూపేవారు. అందుకే ఇండియన్‌ కుర్రాడు, చైనీస్‌ అమ్మాయి నేపథ్యంలో ‘మై ఇండియన్‌ బాయ్‌ఫ్రెండ్‌’ (ఎంఐబి) అని స్ర్కిప్ట్‌ రాసుకున్నా. కానీ నిర్మాతలను వెతకడం కష్టమయింది. చాలామందికి కథ చెప్పాను. డబ్బులు తీసుకుని పారిపోతానేమోనని భయపడ్డారు. నా భార్య చైనీస్‌ అమ్మాయేనని చెప్పినా నమ్మలేదు. హైదరాబాద్‌లో కూడా ఎవరూ ముందుకు రాలేదు.


నా భార్య శానీ. తను చైనీస్‌. మా అమ్మ ఆమె పేరును సుమానసదేవిగా మార్చింది. ఇంట్లో సుమా అని పిలుస్తాం. హాంకాంగ్‌లో తను నా మొదటి బ్యాచ్‌ స్టూడెంట్‌. ఇండియాకి వచ్చినప్పుడు శానీ ఎక్కువగా చాట్‌ చేసేది. కొన్ని రోజులకే అర్థమయింది మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని. హాంకాంగ్‌ తిరిగి వెళ్లాక ఇద్దరం అనుకున్నాం పెళ్లి చేసుకోవాలని. భిన్నమైన సంస్కృతుల మధ్య పెళ్లి కష్టమవుతుందేమోనని మా తల్లిదండ్రులు భయపడ్డారు. వారికి నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇప్పుడు అయిదేళ్ల బాబు.. విశ్వ విరాట్‌. 

నల్గొండ కుర్రాడి.. చైనీస్‌ సినిమా..

రోమ్‌ చిత్రోత్సవంలో...

గత మూడేళ్లుగా నన్ను గమనిస్తోన్న ఇద్దరు చైనీస్‌ మిత్రులు ముందుకొచ్చారు. అయితే నటులను ఎంచుకోవడం ప్రహసనంగా మారింది. నేను చేసిన తెలుగు సినిమాలన్నీ తక్కువ బడ్జెట్‌వి. వాటిని చూపిస్తే అలాంటి సినిమాలే తీస్తానేమోనని భావించి సారీ అంటూ తప్పుకున్నారు. ప్రయత్నాలు ఆపకుండా చేస్తే... అప్పుడు ఒక మంచి టీమ్‌ కుదిరింది. అందరికీ అడ్వాన్స్‌లు ఇచ్చాక కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. ఆఖరికి కష్టపడి ఆగస్టులో సినిమాను పూర్తిచేశాం. ఇందులో ఏడు పాటలు ఉంటాయి. చైనీస్‌కు పాటలనేవి కొత్త అనుభవం. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నాం. ఇందులో పది శాతమే హిందీ ఉంటుంది. ఇండియా, తైవాన్‌, కొరియా, జపాన్‌లలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోమ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ‘ఎంఐబి ఎంపికవ్వడం సంతోషకరం. మన భారతీయులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’  -డి.పి.అనురాధFollow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఓవర్సీస్ సినిమాLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.