‘నల్లమల’ మూవీ రివ్యూ

Published: Fri, 18 Mar 2022 19:18:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్లమల మూవీ రివ్యూ

మూవీ నేమ్: ‘నల్లమల’

విడుదల తేదీ: 18-03-2022

నటీనటులు: అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ తదితరులు,

సినిమాటోగ్రఫి: వేణు మురళి,

సంగీతం: పీఆర్,

ఎడిటర్: శివ సర్వాణి,

ఆర్ట్: యాదగిరి,

నిర్మాత: ఆర్ఎమ్,

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి చరణ్.


ఈ మధ్య కాలంలో ‘ఏమున్నావే పిల్ల ఏమున్నావే’ అనే పాట సృష్టించిన సంచలనం గురించి తెలియంది కాదు. సిధ్ శ్రీరామ్ తన జోనర్ మార్చి పాడిన ఈ పాట.. ఆయనకే కాదు.. ప్రేక్షకులకి కూడా బాగా నచ్చేసింది. ఈ పాట ఏ సినిమాలోది అనే ఉత్సుకత ‘నల్లమల’ సినిమాని వార్తలలో ఉంచుతూ వస్తుంది. విలన్ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న అమిత్ తివారి ఈ చిత్రంలో హీరోగా నటించడం, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ అతనికి జంటగా నటించడంతో పాటు.. సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్.. అలాగే ఇటీవల వచ్చిన ‘పుష్ప’ మాదిరిగా.. ఇది కూడా అడవి నేపథ్యం కావడంతో  సినిమాపై సహజంగానే ఆసక్తి రేకెత్తింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. నేడు(శుక్రవారం) థియేటర్లలో విడుదలై ఎటువంటి రిజల్ట్ అందుకుందీ అనేది రివ్యూలో చూద్దాం. 

కథ:

నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే వ్యక్తి నల్లమల(అమిత్ తివారి). తనతో పాటు గూడెంలో నివాసం ఉంటున్న వారికి సాయం చేస్తుంటాడు. అతని దగ్గర మేలు జాతి రకం ఆవులు ఉంటాయి. అవంటే అతనికి పంచప్రాణాలు. అదే గూడెంలో ఉన్న వనమాలి(భానుశ్రీ), నల్లమల ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ అడవిలో పోలీస్ అధికారి(కాలకేయ ప్రభాకర్), అక్రమ వ్యాపారి(అజయ్ ఘోష్)తో కలిసి చేసి అనైతిక పనులకు నల్లమల ఎదురు తిరుగుతాడు. అదే ప్రాంతంలో పరిశోధనలు చేసే సైంటిస్ట్ (నాజర్).. అక్కడి ఆవుల గురించి ఓ విషయం తెలుసుకుంటాడు. అదేమిటి? తన పంచప్రాణాలైన ఆవులను నల్లమల ఎలా రక్షించుకున్నాడు? అనైతిక పనులు చేస్తున్న వారిని ఎలా ఎదిరించాడు? ఈ పోరాటంలో నల్లమలకు వనమాలి ఎలాంటి సహకారం అందించింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘నల్లమల’ సినిమా.

విశ్లేషణ:

ఇప్పటి వరకు విలన్‌గా కనిపించిన అమిత్ తివారి.. హీరోగానూ తనదైన తరహాలో.. అన్ని రకాల భావోద్వేగాలు పండించాడు. ఆయన గెటప్, హావభావాలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. అయితే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా అతనికి బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు. వనమాలిగా భానుశ్రీ ఒదిగిపోయింది. గ్లామర్ పరంగానూ, డ్యాన్సుల పరంగానూ, నటనపరంగానూ భానుశ్రీ ఎక్కడా తగ్గలేదు. ‘పుష్ప’లో పవర్ ఫుల్ పాత్రలో మెరిసిన అజయ్ ఘోష్‌, పోలీస్ అధికారిగా ప్రభాకర్‌కు మంచి పాత్రలే లభించాయి. సైంటిస్ట్‌గా నాజర్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించారు. ఇంకా తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ వంటి వారు వారి పాత్రల పరిధిమేర నటించారు.


సాంకేతిక అంశాలకు వస్తే.. ముందుగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన హైలెట్. అడవి అందాలను బహు చక్కగా చూపించారు. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ, సంగీత దర్శకుడు పిఆర్ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ‘ఏమున్నావే పిల్ల’ ప్రకృతి అందాల మధ్య మరింత అందంగా కనిపించింది. ఎడిటింగ్ పరంగా ఇంకా కొన్ని కత్తెర పడే సన్నివేశాలున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది కానీ, ఎగ్జిక్యూట్ చేసే విధానంలో తడబాటు కనిపించింది. బహుశా ఇది అతనికి మొదటి చిత్రం కావడం వల్లే అయిఉండొచ్చు. కానీ మొదటి చిత్రానికే అడవి నేపథ్యంలో చిత్రం అంటే సాహసం అనే చెప్పుకోవచ్చు. శాస్త్రవేత్తగా చేసిన నాజర్‌ను గిరిజనలు వెంటాడుతుండగా.. ఓ ఎమోషనల్ నోట్‌తో ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత స్కూల్ పిల్లల పాఠ్యాంశం నేపథ్యంలో కథని నడుపుతూ.. మాజీ నక్సలైట్ (ఛత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్‌తో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లాడు. అయితే దీనికే చాలా సమయం తీసుకున్నాడు. అలాగే అడివిలో ఉండే ఆవులకు ఒక విశిష్టతను ఇచ్చి.. దానిని భావోద్వేగమైన పాయింట్‌తో ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాడు. ఇలా ఒక పాయింట్‌ని బేస్ చేసుకుని కాకుండా.. ఎక్కడెక్కడికో లింక్ చేస్తూ అనేక విషయాలు జోడించాలనుకోవడంతో సినిమా గందరగోళంగా మారింది. కానీ అడవిలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తాయి. ఓవరాల్‌గా ఈ చిత్రంలో ‘పుష్ప’ రేంజ్ కంటెంట్ ఉన్నా.. కథ నడిచిన తీరు, ఎమోషనల్‌గా ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోవడంతో.. ఇదొక సాధారణ సినిమాగానే అనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, హిందువులకు మాత్రం ఈ చిత్రం ఓ కోణంలో బాగా కనెక్ట్ అవుతుంది. 

ట్యాగ్‌లైన్: ‘నల్లమల’.. కొందరిదే!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International