పేరుకే జిల్లా.. అభివృద్ధి ఎక్కడ?

ABN , First Publish Date - 2021-06-20T05:46:38+05:30 IST

మెదక్‌ పేరుకే జిల్లాగా మారింది కానీ ఆ స్థాయిలో అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. తలపెట్టిన ప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్క జిల్లాలో ఆగమేఘాల మీద పూర్తవుతుంటే ఇక్కడ మాత్రం ఎన్నేళ్లు పడుతుందో తెలియడం లేదు.

పేరుకే జిల్లా.. అభివృద్ధి ఎక్కడ?
పిల్లర్ల స్థాయిలో ఎస్పీ కార్యాలయం

మెదక్‌ జిల్లాలో పనులన్నీ పెండింగ్‌లోనే

ఏళ్ల తరబడి పూర్తికాని వైనం  

సీఎం గారూ.. మా జిల్లా వైపు చూడండి!


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 19 : మెదక్‌ పేరుకే జిల్లాగా మారింది కానీ ఆ స్థాయిలో అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. తలపెట్టిన ప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్క జిల్లాలో ఆగమేఘాల మీద పూర్తవుతుంటే ఇక్కడ మాత్రం ఎన్నేళ్లు పడుతుందో తెలియడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి మెదక్‌లో పర్యటించినపుడు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. సీఎం గారు ఓసారి మెదక్‌ జిల్లా వైపు కూడా చూడండని జిల్లావాసులు మొరపెట్టకుంటున్నారు. ఇక్కడి అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 


ఘనపూర్‌ ఎత్తు పెంపు ఇంకెన్నాళ్లకు?

మెదక్‌ జిల్లాలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్‌ ఘనపూర్‌ ఆనకట్ట (వనదుర్గా ప్రాజెక్టు). దీని ఎత్తు పెంచుతామని 2014 డిసెంబరు 17న సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆనాడు ఘనపూర్‌ ఆనకట్టుకు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించారు. రూ.43.64 కోట్లతో 1.725 మీటర్ల వరకు ఎత్తు పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 2015 మే నెలలో ఆనకట్టు ఎత్తు పెంపు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభమే కాలేవు. ఘనపూర్‌ ఆనకట్టు నుంచి పొలాలకు నీరందించే మహబూబ్‌నహర్‌, ఫతేనహర్‌ మెయిన్‌ కెనాల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రెండు కాల్వల మరమ్మతులకు రూ.55 కోట్ల వరకు అవసరం. 


బైపాస్‌ రోడ్డేది ?

మెదక్‌ను జిల్లా చేశారు కానీ ఇంకా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయి. మెదక్‌కు కూడా రింగ్‌ రోడ్డు బైపాస్‌ రోడ్డు వస్తాయని అందరూ సంతోషించారు. కానీ 70 వేల జనాభా ఉన్న మెదక్‌లో ప్రధాన రోడ్డు ఒకటే ఉంది. ఏదైనా రోడ్డు మరమ్మతులు జరిగినా, ఆందోళనలు, రాస్తారోకోలు జరిగినా మరోవైపు నుంచి వెళ్లడానికి అవకాశం లేదు. దూర భారం తగ్గడానికి, ట్రాఫిక్‌ను తగ్గించడానికి బైపాస్‌ రోడ్డు అవసరం.


డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఊసేది?

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు కోసం పేదలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాకు 5,244 ఇళ్ల మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు 1,775 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 1,643 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. పూర్తయిన వాటిలో ఇప్పటివరకు పాపన్నపేట మండలంలో 88, శివ్వపేట మండలంలో 60, హవేళీఘనపూర్‌ మండలంలో 40 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. మెదక్‌ పట్టణంలో దాదాపు 900, తూప్రాన్‌ పట్టణంలో 400, రామాయంపేట పట్టణంలో 300, నర్సాపూర్‌ పట్టణంలో 250, వెల్దుర్తిలో 100, నిజాంపేట మండలంలో 110 ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయడం లేదు. 


వినిపించని రైలు కూత 

మెదక్‌- అక్కన్నపేట రైల్వే మార్గం ఇప్పటికీ పూర్తి కాలేదు. 2015లో రైలు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐదేళ్లు గడిచినా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఏడాది కాలంగా పనులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. రైల్వేలైన్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతోనే పనులు ఆగిపోయాయని తెలిసింది. గతేడాది డిసెంబరు నాటికి రైలు కూత వినిపిస్తామన్నారు. మళ్లీ డిసెంబరు వస్తున్నా నేటికి దిక్కు లేదు. 


Updated Date - 2021-06-20T05:46:38+05:30 IST