సూపర్‌-12కు నమీబియా

ABN , First Publish Date - 2021-10-23T08:01:13+05:30 IST

అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే నమీబియా చరిత్ర సృష్టించింది. సూపర్‌-12లో ప్రవేశించి సత్తా చాటింది.

సూపర్‌-12కు నమీబియా

అరంగేట్ర వరల్డ్‌కప్‌లో చరిత్ర 

ఎరాస్మస్‌, వీస్‌ అదరహో

షార్జా: అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే నమీబియా చరిత్ర సృష్టించింది. సూపర్‌-12లో ప్రవేశించి సత్తా చాటింది. గ్రూప్‌ ‘ఎ’లో శుక్రవారం జరిగిన చావోరేవో మ్యాచ్‌లో 8 వికెట్లతో టెస్ట్‌ జట్టు ఐర్లాండ్‌కు షాకిచ్చింది. దాంతో ఈ గ్రూప్‌లో శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నిలవడం ద్వారా నమీబియా జట్టు మెగా టోర్నీ తదుపరి దశకు చేరింది. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకూ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక గ్రూప్‌ ‘ఎ’ నుంచి ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ టోర్నీ నుంచి అవుటయ్యాయి. ఐర్లాండ్‌తో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నమీబియా ఇంకా తొమ్మిది బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ గెరార్డ్‌ ఎరాస్మస్‌ (53 నాటౌట్‌) అజేయ అర్ధ శతకం సాధించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డేవిడ్‌ వీస్‌ (28 నాటౌట్‌)తో కలిసి ఎరాస్మస్‌ మూడో వికెట్‌కు అభేద్యంగా 53 పరుగులు జోడించాడు. మొదట ఐర్లాండ్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 125 పరుగులు చేసింది. 


నెదర్లాండ్స్‌ చిత్తు :

అంతగా ప్రాధాన్యంలేని గ్రూప్‌ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ కేవలం 10 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. అకెర్‌మన్‌ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. లాహిరు, హసరంగా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తీక్షణ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated Date - 2021-10-23T08:01:13+05:30 IST