నమో నమో నారసింహ

Published: Tue, 29 Mar 2022 03:26:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నమో నమో నారసింహ

  • వైభవంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన
  • శోభాయాత్రలో పల్లకీ మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • సతీమణితో మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం
  • ఉద్ఘాటన అనంతరం గర్భాలయంలో తొలి పూజలు
  • హాజరైన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
  • విమాన గోపురంపై సుదర్శన చక్రానికి పూజలు
  • ఆలయ పునర్నిర్మాణ భాగస్వాములకు సీఎం సన్మానం


యాదాద్రి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఓ సంకల్పం సిద్ధించింది.. ఓ అద్భుతం ఆవిష్కృతమైంది.. అహోరాత్రుల శ్రమ వాస్తవంలోకి వచ్చింది.. కనీవిని ఎరుగని వైభవం కళ్లముందు సాక్షాత్కరించింది. ఆరేళ్ల పాటు పునర్నిర్మితమైన.. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం లక్ష్మీనారసింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రం దివ్య ధామంగా మారి సామాన్య భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కృష్ణ శిలలపై చెక్కిన సుందర శిల్పాలు.. దర్శన భాగ్యానికి వేచి ఉండే క్యూలైన్లు.. ఎంతమంది ఆకలినైనా తీర్చగలిగే అన్నప్రసాద భవనం.. తలనీలాలిచ్చే కల్యాణ కట్ట.. పుణ్య స్నానా లు ఆచరించే పుష్కరిణిలు.. ఇలా ఒకటేమిటి..? ఎన్నో ప్రత్యేకతల ఇల వైకుంఠంగా రూపుదాల్చిన యాదాద్రిలో సోమవారం స్వయంభు పాంచనారసింహుడి ఆలయ ఉద్ఘాటన మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మిన్నంటిన నమో నారసింహ, జయజయ నారసింహ స్మరణతో, అణువణువూ ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో, ఆద్యంతం భక్తిరస ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన అత్యంత వైభవంగా సాగింది. సోమవారం ఉదయం 11.55 గంటలకు ఏకశిఖర వాసుడి సన్నిధిలో ఏక కాలంలో మహాకుంభ సంప్రోక్షణ వైదికపర్వాలు నేత్రపర్వంగా సాగాయి. 

నమో నమో నారసింహ

భక్త జనం ఈ వైశేషిక వేడుకలను తిలకించి తన్మయత్వం పొందారు. ఆలయ సప్త రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపాలపై విమానాలు, ప్రధానాలయంలోని ఉపాలయాలపై ప్రతిష్ఠాపన చేసిన సువర్ణమయ కలశాలు, గర్భగుడిపై కొలువుదీరిన స్వామివారి ఆయుధరాజం శ్రీ సుదర్శన చక్రానికి అర్చకులు, పండితులు, రుత్వికగణం వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు, విశిష్ట అతిథుల హాజరు నడుమ యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మికతను నింపుకొంది. ముందుగా నిర్ణయించిన శ్రీ ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం మిధున లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ వైదిక పర్వాలు సాగాయి. అనంతరం ప్రధానాలయ గర్భగుడి ముఖ ద్వారం గడప చెంత సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తొలి పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత.. స్వయంభువులను దర్శించుకుని తొలి పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు స్వామివారి ఆశీస్సులు, పట్టు వస్ర్తాలు అందజేశారు. అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు గర్భాలయంలోని యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక వైదిక పర్వాలను ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహచార్యుల ఆధ్వర్యంలో ఉప ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, భట్టర్‌ సురేంద్రాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, అర్చకబృందం, రుత్వికులు నిర్వహించారు. 

నమో నమో నారసింహ

ఉదయం నుంచి కార్యక్రమాలు ఇలా..

ఉదయం 7 గంటలకే బాలాలయంలోని యాగశాలలో అర్చక బృందం, రుత్వికులు చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజ కుంభారాధనలు నిర్వహించి మహా పూర్ణాహుతి పర్వాలను ప్రారంభించారు. శాంతి మంత్ర పఠనాలతో యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలను నిర్వహించారు. అనంతరం అర్చక బృందం, రుత్వికులు యాగశాలలోని మహాకుంభ కలశాలను వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలతో యాగశాల ప్రదక్షిణ చేసి బాలాలయ గర్భగుడిలోకి తీసుకెళ్లారు. మహాకుంభాన్ని సువర్ణ ప్రతిష్ఠాలంకార మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య.. బాలాలయంలో కొలువుదీరిన సువర్ణ ప్రతిష్ఠాలంకార మూర్తులు, ఉత్సవమూర్తులు, మహాకుంభ కలశాలతో శోభాయాత్ర ఆరంభించారు. సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. 

నమో నమో నారసింహ

సువర్ణమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కోలాటాలతో ప్రదర్శన చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా జరిగింది. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్‌ స్వయంగా పల్లకీ మోశారు. స్వయంభూ ప్రధానలయంలో నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణ ఉత్సవం నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలో శాంతి కల్యాణ మహోత్సవాన్ని, విశ్వక్సేన ఆరాఽధన, శుద్ధి పుణ్యాహవచన కైంకర్యం, రక్షాబంధనం, యజ్ణోపవీతధారణ గోత్రప్రివర ఉచ్ఛారణ మహా సంకల్పపఠనాదులతో అంత్యంత వైభవంగా శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు.


సంప్రోక్షణ పూజల్లో సీఎం, ప్రముఖులు

ప్రధానాలయ సప్తరాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండలపాలపై విమానాలు, ప్రధానాలయంలోని ఉప ఆలయాలపై ప్రతిష్ఠాపన చేసిన స్వర్ణమయ కలశాలు, విమాన గోపురంపై సుదర్శన చక్రానికి సంప్రదాయ రీతిలో పూజల అనంతరం, మహా కుంభసంప్రోక్షణ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విమానగోపురం వద్ద సుదర్శన చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శ్రీఆంజనేయస్వామివారి సన్నిధి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి శ్రీగరుడ ఆళ్వార్‌ సన్నిధి వద్ద పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి తూర్పు రాజగోపురం, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఈశాన్యం ప్రాకార మండపం, జగదీశ్‌రెడ్డి పంచ తల పశ్చిమ రాజగోపురం, నిరంజన్‌రెడ్డి పంచతల దక్షిణరాజగోపురం, కొప్పుల ఈశ్వర్‌ పంచతల ఉత్తర రాజగోపురం, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈశాన్య ప్రాకార మండపం-23, శ్రీనివా్‌సగౌడ్‌ శ్రీవిశ్వక్సేన మండపం, వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాయువ్య ప్రాకార మండపం-18, మల్లారెడ్డి ఈశాన్య ప్రాకార మండపం-21, హరీశ్‌రావు ఈశాన్యం ప్రాకార మండపం-24, సబితాఇంద్రారెడ్డి ఆగ్నేయ ప్రాకార మండపం-3, గంగుల కమలాకర్‌ త్రితల తూర్పు రాజగోపురం, సత్యవతి రాథోడ్‌ ఆళ్వార్‌ సన్నిధి, పువ్వాడ అజయ్‌కుమార్‌ సప్తతల పశ్చిమ రాజగోపురం వద్ద పూజల్లో పాల్గొన్నారు.


 డిప్యూటీ స్పీకర్‌  పద్మారావుఅష్టభుజి మండపాలు ఆగ్నేయ ప్రాకార మండపాలు-2 వద్ద, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అష్టభుజి మండపాలు ఆగ్నేయ ప్రాకార మండపం-1 వద్ద, ప్రభుత్వ విప్‌లు ఎం.ఎ్‌స.ప్రభాకర్‌ ఆగ్నేయ ప్రాకార మండపం-5, గంప గోవర్థన్‌ లోపలి ప్రాకారం మండపం (యాలీ పిల్లర్స్‌) ఆగ్నేయం, గొంగిడి సునీతారెడ్డి శ్రీ ఆండాళమ్మవారి సన్నిధి, గువ్వల బాల్‌రాజు ఈశాన్యం, రేగా కాంతారావు నైరుతి, బాల్క సుమన్‌ ఆగ్నేయ ప్రాకార మండపం-4, అరికెపూడి గాంధీ వాయువ్యం, ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఈశాన్య ప్రాకార మండపం-20, రైతుబందు చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వాయువ్య ప్రాకార మండపం-19, జడ్పీ చైర్మన్‌ ఎ.సందీ్‌పరెడ్డి ఆగ్నేయ ప్రాకార మండపం-6, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శ్రీరామానుజ సన్నిధి, సీఎం సలహాదారు కేవీ రమణాచారి వాయువ్య ప్రాకార మండపం-17, వైటీడీఏ ప్రత్యేకాధికారి భూపాల్‌రెడ్డి వాయువ్య ప్రాకార మండపం-18 వద్ద సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలలకు 130మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది.

నమో నమో నారసింహ

పువ్వాడపై తేనెటీగల దాడి

యాదాద్రి ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై తేనెటీగలు దాడిచేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా కార్యక్రమాల్లో ఉండగా తేనెటీగలు దూసుకొచ్చాయి. అయినా పువ్వాడ మహాకుంభ సంప్రోక్షణ కొనసాగించారు.. 


భక్తురాలి రూ.కోటి విరాళం

యాదాద్రీశుడి విమాన గోపురం బంగారు తాపడానికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు విజయలక్ష్మీ బాయి దంపతులు రూ.కోటి విరాళం ఇచ్చారు. చెక్కును దేవస్థాన అధికారులకు సమర్పించారు. కాగా, వివిధ విభాగాల ద్వారా ఖజానాకు రూ.4,44,531 సమకూరాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. స్వామివారి హుండీని మంగళవారం లెక్కించనున్నారు.

నమో నమో నారసింహ

ఆలయ పునర్నిర్మాణ భాగస్వాములకు సీఎం సన్మానం

యాదాద్రి టౌన్‌ : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో శంకుస్థాపన నుంచి ఉద్ఘాటన వరకు భాగస్వాములైన స్థపతులు, శిల్పులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, వివిధ శాఖల అధికారులను సీఎం కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. వారి శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పాలుపంచుకున్న ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్తపతులు డాక్టర్‌ సుందరరాజన్‌, డాక్టర్‌ ఆనందాచారివేలు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ మధు, శిల్పులు ముని, వెంకట్‌రెడ్డి, రబ్బానీ, యాసీన్‌, సుబ్బారావు, మురుగేశన్‌, శరవణం, సెల్వకుమార్‌, గణేశన్‌, సుధాకర్‌, రవీంద్రాచారి, వట్టయ్య, మణి, త్యాగరాజన్‌, ఇంజనీర్‌ డాక్టర్‌ ఇ.బాబూరావు, ప్రొఫెసర్‌ ఆర్‌.రమేశ్‌రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, శిల్పులు కృష్ణబాబు, రవీంద్రన్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు, గణపతిరెడ్డి, ఎస్‌ఈ వసంతనాయక్‌, ఈఈలు వై.ఇంద్రారెడ్డి, శంకరయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, ఊడెపు రామారావు, తెలంగాణ రాష్ట్ర వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్‌తేజ, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావులను సన్మానించారు.

నమో నమో నారసింహ

దర్శనం.. శ్రీకారం

యాదాద్రి: మహాకుంభ సంప్రోక్షణ పూజలు, శాంతి కల్యాణ మహోత్సవం అనంతరం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రధానాలయంలోని స్వయంభు పాంచనరసింహుడిని సాధారణ భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తొలి రోజు ఉచిత దర్శనాలు కల్పించి, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన టికెట్‌ కౌంటర్‌ వద్ద భక్తులంతా రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, వారందరికీ జియోట్యాగింగ్‌ ఉన్న క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. వీరంతా కొండపైకి వెళ్లేందుకు కొండ కింద ఉన్న కల్యాణకట్ట నుంచి నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులు క్యూలైన్ల నుంచి ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న స్వర్ణమయ క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని, ప్రధానాలయ తూర్పు రాజగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించారు. ఆలయంలోని తూర్పు రాజగోపురం నుంచి వచ్చిన భక్తులు ప్రదక్షిణగా గర్భలయానికి వెళ్లే ఆలయ మొదటి మాడ వీధి నుంచి అద్దాల మండపం వద్దకు, అక్కడి నుంచి మొదటి మాడవీధి నుంచి గర్భాలయంలోకి వెళ్లే త్రితల రాజగోపుర మార్గం నుంచి గర్భగుడిలోకి చేరుకున్నారు. స్వామివారి దర్శనానంతరం పశ్చిమంవైపు ఉన్న సప్తతల మహారాజగోపురం, వేంచేపు మండపం నుంచి భక్తులు బయటకు వచ్చారు.


యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు మండలి చైర్మన్‌, శాసన సభ స్పీకర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాఽధికారులు హాజరయ్యారు. దీంతో యాదాద్రి కొండపైన, కింద దాదాపు మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. సంప్రోక్షణ పూర్తయ్యే వరకు యాదాద్రి పట్టణంలోకి భక్తులను అనుమతించలేదు. ముందస్తుగా రాయిగిరి, వడాయిగూడెం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత భక్తులను అనుమతించారు.

నమో నమో నారసింహ


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.