అందుకే ఆయన అసాధ్యుడు!

ABN , First Publish Date - 2022-05-28T06:24:14+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలండ్‌లో 1993 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు..

అందుకే ఆయన అసాధ్యుడు!

అమెరికాలోని న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలండ్‌లో 1993 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా), ప్రపంచ తెలుగు సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా నందమూరి తారకరామారావు గారిని ఆహ్వానించాలని ‘తానా’ పాలక మండలి నిర్ణయించింది. ఆ మహాసభలకు భారతదేశంలో ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నేను 1993 సంవత్సరం జూన్‌ 4వ తేదీన యన్‌టిఆర్‌ గారిని బంజార్‌హిల్స్‌, రోడ్‌ నెంబరు 13లోని వారి నివాసంలో కలసి ఆహ్వానించాను. సుమారుగా అరగంటపాటు వారితో మాట్లాడడం, కలిసి టీ తాగే అవకాశం రావడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ రోజు వారు చూపిన అభిమానం, చేసిన మర్యాద మాటల కందనిది.


నేను ఈ తానా మహాసభలకు భారతదేశ సమన్వయకర్తగా ఉన్నంతకాలం హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండేవాడ్ని. జూన్‌ 5వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు నేను మంచి నిద్రలో ఉండగా ఇంటర్‌ కమ్‌ ఫోన్‌ నిరంతరాయంగా మోగుతుంటే ఫోను తీశాను. ఆ వైపు నుంచి ‘నమస్కారం, బాగున్నారా’ అని వినగానే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టి కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయాను. ఆయన ‘ఇంటికి వస్తారా’ అన్నారు. నేను పది నిమిషాలలో తయారయ్యి, యన్‌టిఆర్‌ ఇల్లు చేరుకున్నాను. హాలులో ఆయన ఒక్కరే కూర్చొన్నారు. దేదీప్యమాన్యమైన విద్యుత్తు కాంతిలో యోగీశ్వరుడిలా ప్రకాశిస్తున్నారు. ఆయనతో టీ తాగుతున్నప్పుడు ‘నేనుండే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నెంబరు మీరు ఎలా తెలుసుకున్నారు?’ అని అడిగాను. ఆ ముందు రోజు కలసినప్పుడు నేను ఇచ్చిన నా విజిటింగ్‌ కార్డును చూపించారు. తర్వాత ఒక గంట సేపు తెలుగు మహాసభల గురించి, వాటి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.


అదే రోజు 11గంటలకు మోహన్‌ (యన్‌టిఆర్‌ గారి వ్యక్తిగత కార్యదర్శి)  ఫోను చేసి మరుసటిరోజు అన్న గారు ఇంటికి రమ్మన్నారు అని చెప్పారు. ఎంతో ఉత్సాహంతో జూన్ 6న ఉదయం వారి ఇంటికి చేరుకున్నాను. నేను వెళ్ళేటప్పటికే అన్న గారు వారి బంధువు కామినేని సూర్యనారాయణ గారితో డైనింగ్‌ హాలులో ఉన్నారు. టేబుల్‌ పైన రెండు ప్లేట్లు ఉన్నాయి. కొద్ది నిమిషాలు మాట్లాడుకున్న తరువాత రామారావు గారే స్వయంగా రెండు ప్లేట్లలో ఉప్మాని వడ్డించారు. సూర్యనారాయణ గారు తినడం ప్రారంభించారు. రెండో ప్లేటు చూపించి ‘ప్రారంభించండి’ అని అన్నగారు అన్నప్పుడు ఆ ప్లేటు నా కోసమే అని అర్థమయ్యింది. ‘మేము వేకువనే పూర్తి చేశాము’ అన్నారు. ఇద్దరికీ అన్నగారు కొసరి కొసరి వడ్డించి తినిపించారు. తరువాత కుడుం ముక్కలను వడ్డిస్తూ ‘ఇది ఏంటో తెలుసా?’ అన్నారు. అది ‘కుడుం’ అని తెలిసినప్పటికీ ఆధునికంగా ఉంటుందని ‘ఇడ్లీ సార్‌’  అన్నాను. ‘ఇదే ఈ తరం వారితో ఇబ్బంది, ఇది కుడుం’ అని గట్టిగా చెప్పారు. కామినేనిగారు, నేనూ ఆ ఉప్మా, కుడుములలో నాలుగో వంతు మాత్రమే తిన్నాము. మిగిలిన ఉప్మా, కుడుములు అన్నగారే తిన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. పైగా కొన్ని నెలల క్రితమే హాస్పిటల్‌లో చికిత్స పొందివచ్చారు. వారి ఆహారపు అలవాట్లు గురించి అంతకుముందే విని ఉన్నప్పటికీ– ఆ రోజు నేను ఆశ్చర్యపోకతప్పలేదు.


రెండు రోజుల తరువాత చెన్నై నుంచి ప్రముఖ నిర్మాత స్వర్గీయ యు. విశ్వేశ్వరరావు గారు హైదరాబాదుకు వచ్చారు. వీరు యన్‌టిఆర్‌ బావమరిది, వియ్యంకుడు కూడా. నేను బేగంపేట ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకున్నాకా ఇద్దరం జూబ్లీహిల్స్‌లో తానా తెలుగు సభల కోసం ‘ఆంధ్ర వైభవం’ సినిమాను తన ఖర్చుతో నిర్మిస్తున్న డి. రామానాయుడు గారిని, ఇంకొంతమంది ప్రముఖులను కలవాలి. దారిలో అన్న గారితో కలసి మధ్యాహ్న భోజనం చేశాం. అక్కడ కూడా ఆయన భోజనశక్తిని ప్రత్యక్షంగా చూశాను. ఆయన ఎన్ని గంటలైనా ఏకధాటిగా పనిచేయడానికి ఈ ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమే అని ఆ రోజు అనుకున్నాను.


ప్రముఖ హీరో మోహన్‌బాబు గారిని హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రపంచ తెలుగు మహాసభల స్టాల్స్‌ను ప్రారంభించమని కోరడానికై కలవాలని ఫోను చేస్తే రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ షూటింగ్‌ జరుగుతున్నది, అక్కడికి రమ్మన్నారు. నేను మరుసటి రోజు ఉదయం వెళ్ళాను. ముందుగా అన్న గారికి నమస్కారం చేశాను. ఇతరులందరికీ నన్ను మోహన్‌బాబుగారు పరిచయం చేశారు. కొంతసేపటి తరువాత షూటింగ్‌ స్పాట్‌లో అన్నగారు మోహన్‌బాబు గారి దగ్గరకు వచ్చి పావుగంట బయటకు వెళ్ళి వస్తాను అని అనుమతి తీసుకొని, అలాగే రాఘవేంద్రరావుగారి అనుమతి కూడా తీసుకొని బయటకు వెళ్ళారు. నేను షాక్‌కు గురయ్యాను. యన్‌టిఆర్‌ గారి గురించి ‘ఆయన చండశాసనుడు, షూటింగ్‌ స్పాట్‌లో ఆయన చెప్పిందే వేదం’ లాంటి మాటలు విన్న నాకు ఆయన పావుగంటపాటు బయటకు వెళ్ళడానికి వీరి అనుమతి కోరడమేమిటో అర్థం కాలేదు. మోహన్‌బాబు గారిని అడిగాను. అప్పుడాయన, ‘నేను నిర్మాతను, రాఘవేంద్రరావు గారు దర్శకుడు. షూటింగులో ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే దర్శక, నిర్మాతల నుంచి అనుమతి తీసుకోవడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం’ అన్నారు. యన్‌టిఆర్ అంత అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణం ఈ క్రమశిక్షణేనని అప్పుడు అర్థమయ్యింది.


డాక్టర్ల బృందం అన్నగారు అమెరికా ప్రయాణం చెయ్యవచ్చు అన్న విషయాన్ని ‘తానా’ వారికి తెలియజేసిన పిమ్మట వారి సలహా మేరకు అమెరికాలో వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలుసుకోవాలని అన్న గారిని కలిసాను. అన్న గారు నాతో ‘చూడండి నాయుడు గారు, మేము మా దర్పాన్ని ప్రదర్శించడానికి అక్కడికి రావటం లేదు. డాక్టర్లు చెప్పింది కూడా మీరు విన్నారు. కాబట్టి మీకు తెలుసు మా ఆరోగ్య పరిస్థితి. నిజానికి నేను ఈ పరిస్థితులలో అంతటి సుదీర్ఘ ప్రయాణం చెయ్యకూడదు. అయినప్పటికీ తెలుగువారు, తెలుగు భాష, తెలుగు భూమి మీద నాకున్న మమకారం నన్ను ఈ ప్రయాణానికి సంసిద్ధం చేసింది. మీరు మాకోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయనవసరం లేదు. సుమారుగా 30దేశాల్లో ఉంటున్న తెలుగు సోదరులు, సోదరీమణులు ఈ సభలకు వస్తున్నారని మీరు చెప్పారు. వారందరినీ కలవడమే నాకు ఆనందదాయకం’ అన్నారు. అప్పుడు నాకు అర్థమయ్యింది వారికి తెలుగు భాష, తెలుగు ప్రజల, తెలుగు నేల మీద ఎంతటి అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఉన్నాయో.


జూన్‌ 29వ తేదీన నేను వావిలాల గోపాలకృష్ణయ్య, మాగుంట సుబ్బిరామిరెడ్డి దంపతులు, ఎంతోమంది సినీ, రాజకీయరంగ ప్రముఖులతో పాటు ఎయిరిండియా విమానంలో మద్రాసు నుంచి బయలుదేరాము. అదే విమానంలో అన్న గారు ఢిల్లీ నుంచి ప్రయాణం చేశారు. అందరమూ అమెరికాలోని లాంగ్‌ ఐలండ్‌లోని నాసా కొలీజియమ్‌ స్టేడియం ఆవరణలోనే ఉన్న మేరియట్‌ హోటల్‌లో బస చేశాం. జూన్‌ 3వ తేదీ సమావేశంలో అన్నగారితో పాటు చిరంజీవి, తెలుగు మహాసభల ఆధ్యుడైన మాజీ మంత్రి మండలి వెంకట క్రిష్ణారావు కూడా వేదిక మీద ఉన్నారు. అన్నగారు సందేశాత్మకమైన ప్రసంగాన్ని తానా సభ్యులతో కలసి సుమారుగా 1800 మందిని ఉద్దేశించి చేశారు. ఈ ప్రసంగం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. జూన్‌ 17న అన్నగారు తిరిగి హైదరాబాదు చేరుకున్నారు. వేలమంది బేగంపేట విమానాశ్రయంలో అన్నగారికి స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘నా ఈ అమెరికా పర్యటన ఊహించిన దానికంటె ఎంతో దిగ్విజయం చేసినందుకు ‘తానా’ సంఘానికి, ముఖ్యంగా సమన్వయకర్త, మా శ్రేయోభిలాషి ఆచార్య ముత్యాలు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఆయన తానా సభలకు ముఖ్యఅతిథిగా రావడం ఒక అద్భుతం అని మేమందరం అనుకున్న తరుణంలో ఆయన మాకు కృతజ్ఞతలు చెప్పడం కన్నా మాకు కావలసిందేముంటుంది. అమెరికా నుంచి వచ్చిన పది రోజులకు కృతజ్ఞతలు తెలపడానికి అన్నగారిని కలిసాను. ఇద్దరమూ టీ తాగిన తర్వాత నేను వెళ్ళడానికి కుర్చీ నుంచి లేచినప్పుడు అన్న గారు ‘మన పరిచయం ఊరికేపోదు. ఏదో పరమార్థముంది. వెళ్ళిరండి’ అన్నారు. తనతో ఉండే ఎంత చిన్నవారినైనా సమానంగా గౌరవించే గొప్ప సంస్కారి ఆయన. అందుకే ‘పండితాః సమదర్శినః’ అంటారు.


ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు

Updated Date - 2022-05-28T06:24:14+05:30 IST