
ధ్రుపద్ తాళ ప్రధాన ప్రక్రియ. ఖ్యాల్ రాగ ప్రధాన ప్రక్రియ. ధ్రుపద్ విశాలమైన కాన్వాస్ తీసుకుంటుంది. కాని, అందులో నగిషీలు ఉండవు; అవి ఖ్యాల్లో ఉంటాయి. సూక్ష్మమైన, చిత్రవిచిత్రమైన స్వర సమ్మేళన విన్యాసాలు ఖ్యాల్లో ఉంటాయి. అయితే తాళానికి ప్రాముఖ్యం తక్కువ. ధ్రుపద్ రాగ స్వరూపాన్ని ‘విహంగ వీక్షణం’ చేస్తుంది. సూక్ష్మమైన నగిషీల జోలికి పోదు.
హిందూస్థానీ గాత్ర సంగీత రచనలు హిందీలో మాత్రమే ఎందుకున్నాయి? ధ్రుపద్, ఖ్యాల్, ఠుమ్రీ, దాద్రా వంటి గాత్ర సంగీత రచనలు బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ వంటి భాషలలో ఎందుకు రాలేదు?
కర్ణాటక సంగీతంలో ‘ఆర్ట్ మ్యూజిక్’- ముఖ్యంగా సంకీర్తనలు, కృతులు, పదాలు, జావళీలు తెలుగులో మాత్రమే ఎందుకు వచ్చాయి? కృతులు తమిళంలో కొద్దిగా వచ్చాయి. త్యాగరాజు తర్వాత దాదాపు వంద సంవత్సరాలకి పాపనాశం శివన్ ధైర్యం చేసి త్యాగరాజు శైలిలోనే తమిళంలో కృతులు రచించాడు. ఆ తర్వాత మరికొందరు రాశారు-బాలమురళీకృష్ణతో సహా. తమిళంలో కొన్ని అభినయ పదాలు కూడా వచ్చాయి. కాని కన్నడంలో, మలయాళంలో కృతులు, పదాలు, జావళీలు రాలేదు-వచ్చినా చాలా కొద్ది. ఆలాపన, కృతి, నెరవల్, స్వరకల్పనలతో పాడే రచనలలో దాదాపు 85 శాతం తెలుగువి; 15 శాతం తమిళ, కన్నడభాషల్లోనివి. పురందరదాసు ప్రవేశపెట్టిన సంగీత పాఠాలు మినహా కర్ణాటక సంగీతానికి కన్నడిగుల సేవ అంతగా లేదనే చెప్పాలి. ఆఖరికి లక్షణ గ్రంథాలు కూడా అన్నీ తెలుగు వాళ్ళవే. పురందర దాసు కన్నడ భాషలో నాలుగు లక్షలపైగా కీర్తనలు రచించాడట. వాటిలో సుమారు వెయ్యి కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. కన్నడిగులు వాటిని ‘దేవరనామాలు’ అంటారు. వాటి సాహిత్యమే తప్ప స్వరాలు లభించడం లేదు. కర్ణాటక ప్రాంతంలోని కొందరు ప్రముఖ హిందూస్థానీ విద్వాంసులు వాటిని హిందూస్థానీ బాణీలో పాడుతున్నారు. అసలు పురందర దాసు జన్మతః మహారాష్ట్రకు చెందినవాడు. పూనా జిలాల్లోని పురందరగఢ్ నుంచి కృష్ణదేవరాయల కాలంలో హంపీ విజయనగరానికి వలస వచ్చి స్థిరపడ్డాడు. దాక్షిణాత్య శాస్త్రీయ సంగీతాభ్యాసానికి ప్రామాణికమైన గీతాలు రచించినందున ఆయనకు కర్ణాటక సంగీత పితామహుడనే పేరు వచ్చింది.
హిందూస్థానీ గాత్ర సంగీత విద్వాంసులలో-అగ్రశ్రేణిలో-బెంగాలీ వాళ్ళు కనిపించరు. అసలు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వారెవరూ కనిపించరు. అస్సాం నుంచి ఒక్క పర్వీన్ సుల్తానా, బెంగాల్ నుంచి మాళవికా కానన్, అజయ్ చక్రవర్తి, కౌశికీ చక్రవర్తి కనిపిస్తారు. కాని, వాద్య సంగీతంలో సగం మంది పైగా బెంగాలీ వారే. అల్లా ఉద్దీన్ ఖాన్, ఇమ్దాద్ ఖాన్, ఇనాయత్ ఖాన్, వహీద్ ఖాన్, విలాయత్ ఖాన్, రవిశంకర్, పన్నాలాల్ ఘోష్, అలీ అక్బర్ ఖాన్, నిఖిల్ బెనర్జీ, జ్ఞానప్రకాశ్ ఘోష్, కళ్యాణీ రాయ్, జయాబోస్, శరణ్ రాణి, బుధాదిత్య ముఖర్జీ, హిమాంశు బిస్వాస్... ఇంకా ఎందరో.
అయితే, 18, 19 శతాబ్దాలలో బెంగాల్లో ధ్రుపద్ గాయకులు చాలా మంది ఉండేవారు. బెంగాల్లోని విష్ణుపూర్ ధ్రుపద్ బాణీ చెప్పుకోదగినది. ఇప్పుడు ఎవరూ లేరు. కొందరు బెంగాలీ భాషలో ధ్రుపద్ రచనలు చేశారు. కాని, అవి రాణించలేదు. రవీంద్రనాథ్ టాగోర్ కూడా ధ్రుపద్ చట్రంలో కొన్ని రచనలు చేశారు. అయితే అవి ‘ఆర్ట్ మ్యూజిక్’కు ఉద్దేశించినవి కావు.
ధ్రుపద్ గానంలో ఆలాప్, నొంతొం ఆలాప్ వరకు రంజకంగా ఉంటుంది. ఆలాప్లో రసపోషణ, రాగ స్వరూప చిత్రణ, రాగసౌధ నిర్మాణం జరుగుతుంది. తర్వాత ధ్రుపద్ బందిష్ (సాహిత్య రచన)లో మొదట విలంబకాలంలో సాహిత్య అర్థ స్ఫూర్తితో గానం చేసినంత వరకు బాగా ఉంటుంది. ఆ తర్వాత ‘బోల్ బంత్’ (సాహిత్య) విన్యాసాలు ప్రారంభం కావడంతో రాగసౌధం కూల్చివేత (ఛ్ఛీఝౌజూజ్టీజీౌుఽ) మొదలవుతుంది; మాధుర్యం భగ్నమవుతుంది. రసభంగమవుతుంది. ధ్రుపద్లో అది అనివార్యమేమో అనిపిస్తుంది. కాకపోతే... అది డాగర్ గాయకుల ధోరణి కావచ్చు. ఆ బాణీ ముఖ్యబలహీనత అది.
ఖ్యాల్లో రసభంగం కాకుండా పాడడం సాధ్యం. రసభంగమైతే అది గాయకుని తప్పు; అది ఖ్యాల్ ప్రక్రియ దోషం కాదు. ఖ్యాల్లో నిజానికి శుద్ధ ఆలాప్ లేదు. ‘బోల్ ఆలాప్’ మాత్రమే ఉంది. ధ్రుపద్లో ఉన్న మాదిరి శుద్ధ ఆలాప్ ఖ్యాల్లో లేకపోవడం ఒక లోపమే. అందుకే కొన్ని ఘరానాల వారు ముందు ధ్రుపద్ శైలిలో ఆలాప్, నొంతొం ఆలాప్ గానం చేసి, తర్వాత ఖ్యాల్ బందిష్ పాడతారు. ఆగ్రా ఘరానా అగ్రగాయకుడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ అలా పాడేవాడు. ఆయన గానంలో ధ్రుపద్లో వినిపించే మీండ్ (జారుగమకాలు), కంపన్లు ఉంటాయి. మేఘ్ గర్జన్, ధర్తీకాదఢ్కన్ వంటి విన్యాసాలుంటాయి.
ధ్రుపద్ బందిష్ లయ ప్రధానమైనది. ఖ్యాల్లో లయకు సంబంధించి చాలా స్వేచ్ఛ ఉంటుంది. ధ్రుపద్లో అదే సాహిత్యాన్ని అదే ఆవర్తంలో వేగాన్ని ద్విగుణం, త్రిగుణం చేస్తూపోతారు. సాహిత్యాన్ని నరికి పోగులు పెడతారు. అంతా మేధకు, గణితానికి సంబంధించిన వ్యవహారంగా కనిపిస్తుంది. ఖ్యాల్లో అలా కాక ఎన్ని షికార్లు చేసినా చివరకు ‘సమ్’ (సమ)లో వచ్చి కలుసుకుంటే సరిపోతుంది, గాయకునికి స్వేచ్ఛ ఎక్కువ. అందుకే ఖ్యాల్లో వైవిధ్యం, ఆకర్షణ కనిపిస్తాయి. లయ ప్రధానమైతే రసభంగం తప్పదు. సంగీతంలో రసావిష్కరణ ముఖ్యం. రాగం ద్వారానే రసపోషణ జరుగుతుంది. అందుకే తాళం, లయ ఎప్పుడూ రాగానికి ఒదిగి ఉండాలి.
కవిత్వంలో రసావిష్కరణ జరుగుతుంది; గణితంలో జరగదు. అయితే సంగీతంలో శ్రుతి, లయ-రెండూ ఉంటాయి; ఉండాలి. శ్రుతి-రంజకత్వానికి దోహదం చేస్తుంది. తబ్లా సోలో ఎంత అద్భుతంగా ఉన్నా ‘రసావిష్కరణ’ జరగదు.
ధ్రుపద్ తాళ ప్రధాన ప్రక్రియ.
ఖ్యాల్ రాగ ప్రధాన ప్రక్రియ.
ఠుమ్రీ భావ ప్రధాన ప్రక్రియ.
ధ్రుపద్ విశాలమైన కాన్వాస్ తీసుకుంటుంది. కాని, అందులో నగిషీలు ఉండవు; అవి ఖ్యాల్లో ఉంటాయి. సూక్ష్మమైన, చిత్రవిచిత్ర మైన స్వర సమ్మేళన విన్యాసాలు ఖ్యాల్లో ఉంటాయి. అయితే తాళానికి ప్రాముఖ్యం తక్కువ. ధ్రుపద్ రాగ స్వరూపాన్ని ‘విహంగ వీక్షణం’ చేస్తుంది. సూక్ష్మమైన నగిషీల జోలికి పోదు.
నండూరి పార్థసారథి
99597 34534