కరోనా నియంత్రణలో ఆదర్శంగా నిలిచాం

ABN , First Publish Date - 2021-05-07T06:33:35+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని, ముఖ్యమంత్రి మార్గదర్శకం, నిరంతర పర్యవేక్షణతోనే అది సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అన్నారు.

కరోనా నియంత్రణలో ఆదర్శంగా నిలిచాం

  జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి

వన్‌టౌన్‌, మే 6 : కరోనా వైరస్‌ నియంత్రణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని, ముఖ్యమంత్రి మార్గదర్శకం, నిరంతర పర్యవేక్షణతోనే అది సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అన్నారు. కరోనా స్ట్రెయిన్‌ను అరికట్టడంలో అందరినీ కలుపుకుని వెళ్లేవారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కరోనాపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణకు, కట్టడికి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను సమన్వయం చేసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ వ్యవస్థ ఎంత కీలకమైన పాత్ర వహించిందో, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థ కూడా అంతే కీలకమైన పాత్ర వహించిందన్నారు. జిల్లా పరిధిలో 745 ఐసీయూ బెడ్స్‌, 189, నాన్‌ ఐసీయూ బెడ్స్‌ ఆక్సిజన్‌తో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలో కరోనా వైరస్‌ వేరియెంట్‌ బి 1.36 (ఎన్‌440కె) ఉనికి లేదని, ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకావద్దని అన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రతి  పీహెచ్‌సీ పరిధిలోనూ టెస్టింగ్‌ కోసం ఐడీలను ముందుగా రూపొందించి శాంపిల్స్‌ సేకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో  ప్రణాళికలను రూపొందించుకుని జిల్లాస్థాయిలో సమీక్షిస్తున్నామన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం, భాగస్వామ్యంతో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో మరింత ముందడుగు వేస్తున్నామని వారి చర్యలు అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణువర్ధన్‌, సామినేని ఉదయభాను, కొలుసు పార్ధసారథి, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌, జోగి రమేష్‌, వసంత కష్ణప్రసాద్‌, మేకా ప్రతాప వెంకట అప్పారావు, కె.రక్షణనిధి, మొండితోక జగన్‌మోహనరావు, వల్లభనేని వంశీమోహన్‌, కె.అనిల్‌కుమార్‌, ఎంపీ వల్లభనేని బాలశౌరి, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎస్పీ, కె.రవీంద్రనాథ్‌బాబు, జేసీలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T06:33:35+05:30 IST