మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్‌ చేయండి: అనిత

ABN , First Publish Date - 2022-01-25T00:12:09+05:30 IST

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని

మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్‌ చేయండి: అనిత

విశాఖపట్నం: కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘చలో గుడివాడ’ కార్యక్రమం చేపట్టి అక్కడ జరిగిన వ్యవహారాలతో సంబంధం వున్న వ్యక్తుల వివరాలు బయటపెడతామని ప్రకటించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ పేరు చెబితే గుడివాడ కేసినో గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ అంటే పోర్టులు, పరిశ్రమలు గుర్తుకు వచ్చేవని...ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యిందన్నారు. కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లోనే కేసినో జరిగిందని దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. తక్షణమే మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్‌ చేయాలని, లేకపోతే తొలుత గుడివాడ, తరువాత తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు. 

Updated Date - 2022-01-25T00:12:09+05:30 IST