ఆర్జీవీకి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసిన పేర్ని నాని

ABN , First Publish Date - 2022-01-10T21:02:07+05:30 IST

దర్శకుడు రాంగోపాల్ వర్మకు మంత్రి నాని ప్రత్యేక ఆతిధ్యమిచ్చారు. రొయ్యల కూర, మటన్, చికెన్ ప్లేయిన్‌ బిర్యానితో భోజనం ఏర్పాట్లు చేశారు.

ఆర్జీవీకి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసిన పేర్ని నాని

అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మకు మంత్రి నాని ప్రత్యేక ఆతిధ్యమిచ్చారు. రొయ్యల కూర, మటన్, చికెన్ ప్లెయిన్‌ బిర్యానీతో భోజన ఏర్పాట్లు చేశారు. లంచ్ తరువాత ఇద్దరి మధ్య తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు థియేటర్లను నడపడం సాధ్యం కాదని పలువురు స్వచ్ఛందంగానే థియేటర్లను మూసివేస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 1200 థియేటర్లు ఉండగా, వాటిలో ఇప్పటి వరకు ఇలా 240 వరకు మూతపడ్డాయి. సినిమా టికెట్ల వ్యవహారం సినీ పెద్దల, ఏపీ మంత్రుల మధ్య దుమారం చెలరేగింది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. 



సినిమా టికెట్ల ధరలను పెంచాలనే సినీ ప్రముఖుల డిమాండ్‌కు ఆర్జీవీ మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై  పేర్ని నాని కూడా స్పందించారు. సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చిద్దామని నాని, వర్మకు సోమవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు రాంగోపాల్ వర్మ పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆర్జీవీని భారీ బందోబస్తు నడుమ ఎయిర్‌పోర్టు నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయానికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తా. ఒక ఫిల్మ్ మేకర్‌‌గా మాట్లాడడానికి వచ్చాను. ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను. ఎవ్వరేం మాట్లాడినా దాని గురించి నేను మాట్లాడను’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-10T21:02:07+05:30 IST