8 నెలల చిన్నారిపై కేర్ టేకర్ దాష్టీకం.. మెదడులో రక్తస్రావం, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో..

ABN , First Publish Date - 2022-02-05T22:16:23+05:30 IST

గుజరాత్‌లో మనసు ద్రవించిపోయే దారుణం జరిగింది. ఇంట్లో చిన్నారి బాగోగులు ఏర్పాటు చేసిన కేర్ టేకర్ 8 నెలల చిన్నారి

8 నెలల చిన్నారిపై కేర్ టేకర్ దాష్టీకం.. మెదడులో రక్తస్రావం, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో..

సూరత్: గుజరాత్‌లో మనసు ద్రవించిపోయే దారుణం జరిగింది. ఇంట్లో చిన్నారి బాగోగులు చూసేందుకు ఏర్పాటు చేసిన కేర్ టేకర్ 8 నెలల చిన్నారి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. అభంశుభం తెలియని చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించింది. ఈడ్చి పడేసింది. ఇష్టమొచ్చినట్టు చావబాదింది. ఆమె దెబ్బలకు చిన్నారి మెదడులో రక్తస్రావమైంది. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చావుబతుకుల మధ్య  కొట్టుమిట్టాడుతోంది.


సూరత్‌లోని రాండెర్ పలాన్‌పూర్ పటియాలో నివసించే దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులే. దీంతో ఇంటి వద్ద తమ పిల్లలను చూసుకునేందుకు ఓ కేర్‌టేకర్‌ను తీసుకున్నారు. కేర్ టేకర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి రోజు ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తున్నాయని చుట్టుపక్కల వారు చెప్పడంతో ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాజాగా, సీసీటీవీ కెమెరాను పరిశీలించగా వెన్నులో వణుకుపుట్టే సీన్లు కనిపించాయి. 


కేర్ టేకర్ ఆ చిన్నారి తలను అదే పనిగా మంచానికేసి బాదుతున్న దృశ్యాలు కనిపించాయి. అంతేకాదు, జుట్టు పట్టుకుని మెలేయడం, చెంపలు వాయించడం చూసి విస్తుపోయారు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.


నిందితురాలు కోమల్ చంద్లేకర్‌ను మూడు నెలల క్రితమే పనిలో పెట్టుకున్నట్టు చిన్నారని నాయనమ్మ కాలాబెన్ పటేల్ తెలిపారు. మొదట్లో ఆమె పిల్లలను బాగానే చూసుకున్నట్టు చెప్పారు. నిందితురాలికి ఐదేళ్ల క్రితం వివాహమైన పిల్లలు లేరని పోలీసులు తెలిపారు. కాగా, కోమల్ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మెదడులో రక్తస్రావం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.  

Updated Date - 2022-02-05T22:16:23+05:30 IST