అస్తవ్యస్తంగా ఎన్‌ఏపీ రక్షిత పథకం

ABN , First Publish Date - 2021-06-22T06:26:36+05:30 IST

దర్శి ప్రాంతంలో 119 గ్రామాలకు మంచినీరు అందించే ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అస్తవ్యస్తంగా మారింది.

అస్తవ్యస్తంగా ఎన్‌ఏపీ రక్షిత పథకం
నీరు నిల్వ ఉన్న దర్శి ఎన్‌ఏపీ చెరువు

అనేక గ్రామాలకు అందని మంచినీరు

శిథిలమవుతున్న పైపులైన్లు

దర్శి, జూన్‌ 21 : దర్శి ప్రాంతంలో 119 గ్రామాలకు మంచినీరు అందించే ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అస్తవ్యస్తంగా మారింది. కాలంచెల్లిన పైపులైన్లు తరచూ పగిలిపోతుండటంతో అనేక గ్రామాలకు సక్రమంగా నీరు చేరటం లేదు. పాత ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులకు నోచుకోక సక్రమంగా పనిచేయటం లేదు. నూతనంగా నిర్మించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఫిల్టర్‌బెడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక్కడ ఫిల్టర్‌ చేసి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలకు సంపూర్ణంగా నీరు అందించలేకపోతున్నారు. 

సామర్థ్యం కోల్పోయిన పైప్‌లైన్‌

దర్శి నగర పంచాయతీ లోని శివరాజ్‌నగర్‌ సమీపంలో కొండవద్ద 35 సంవత్సరాల క్రితం నెదర్లాండ్‌ ప్రభుత్వం సహకారంతో ఈ పథకం నిర్మించారు. అప్పుడు ఏర్పాటు చేసిన ఫిల్టర్‌బెడ్లు నిర్ణీత సమయంలో మరమ్మతులు చేపట్టకపోవటంతో ఇసుక మట్టిగా మారి ప్రస్తుతం నీరు ఫిల్టర్‌ కావటం లేదు. మొత్తం 7 ఫిల్టర్‌బెడ్లు ఉండగా కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. 35 సంవత్సరాల క్రితం నిర్మిం చిన పైపులైను సామర్థ్యం కోల్పోయి తరచూ పగిలిపోతుండటంతో నీటి పంపిణీకి ఆటంకం కల్గుతుంది. మరమ్మతుల కోసం ఎన్నోసార్లు అధికారులు ప్రతిపాధనలు పంపినా నిధులు విడుదల కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో పథకం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది.

నీరందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

 దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం పరిధిలో సుమారు 17 గ్రామాలకు నీరు అందటం లేదు. లంకోజనపల్లి, తూర్పువెంకటాపురం, కొత్తవెంకటాపురం, గణేఽశ్వరపురం తదిరత గ్రామాలకు మంచినీరు అందించే పైపులైన్లు దర్శి-ఆరవళ్లిపాడు తారురోడ్డు నిర్మాణ పనుల్లో నాలుగు సంవత్సరాల క్రితం పగిలిపోయాయి. అప్పటి నుంచి పైపులైను నిర్మాణ పనులు జరగకపోవటంతో ఆ గ్రామాలకు ట్యాంకర్ల నీరే దిక్కయింది. పైపులైన్‌ నిర్మాణం కోసం రూ.80 లక్షలు నిధులు విడుదల చేయాలని రెండేళ్లు క్రితం ప్రతిపాదనలు పంపినా నేటి వరకు మంజూరు కాలేదు. అధికారులు అరకోరగా బోరు వాటర్‌ను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ సరిపెడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

అదేవిధంగా కట్టసింగన్నపాలెం, లింగన్నపాలెం, ఎర్రొబనపల్లి, బండివెలిగండ్ల, కొత్తపల్లి, లక్ష్మీనారాయణపురం, కొర్లమడుగు తదితర గ్రామాలకు కూడా ఎన్‌ఏపీ నీరు సక్రమంగా అందటంలేదు. కొత్తపల్లి వైపు వెళ్లే పైపులైను ఇటీవల చాపలచెరువు తవ్వకం సమయంలో ప్రొక్లయిన్‌ తగిలి పగిలిపోయింది. పైపులైను మరమ్మతులు అరకొరగా చేయటంతో కొద్దిరోజులు నీరు విడుదల చేసినప్పటికీ మళ్లీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు ఐదు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా అవుతుందని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. 

మంచినీటి పథకం అస్తవ్యస్తంగా జరుగుతున్న విషయంపై ఆంధ్రజ్యోతి ఎన్‌ఏపీ అధికారులను వివరణ కోరగా పైపులైను దెబ్బతినటం వలన కొన్ని గ్రామాలకు నీటి సరఫరాకు అంతరాయం కల్గిన మాట వాస్తవమేనన్నారు. మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేసి అన్నిగ్రామాలకు సక్రంగా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీరు పంపింగ్‌కు కరెంట్‌ సరఫరా అంతరాయం కూడా ఇబ్బంది పెడుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ అధికారులకు తెలిపామన్నారు.

Updated Date - 2021-06-22T06:26:36+05:30 IST