అనంత నుంచే ఉద్యమిస్తా: నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-10-24T09:57:27+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ రైతులతో మమేకమయ్యారు. వారి కష్టాలకు దన్నుగా నిలిచారు.

అనంత నుంచే ఉద్యమిస్తా: నారా లోకేశ్

చంద్రన్న బాటలో.. లోకేశ్‌ అడుగులు..

అన్నదాతల బాధలు, కష్టాలు వింటూనే.. ఓదార్పు..

పరిహారం కోసం అనంత నుంచే ఉద్యమిస్తానని భరోసా..

సంఘటితంగా కలిసొచ్చిన నేతలు..

పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం..

జిల్లాలో 7 గంటలపాటు సాగిన పర్యటన


అనంతపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ రైతులతో మమేకమయ్యారు. వారి కష్టాలకు దన్నుగా నిలిచారు. ఆయన ఒకరోజు పర్యటన జిల్లాలో ఆద్యంతం రైతుల మమేకంతోనే సాగింది. వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే.. బాధిత రైతుల బాధలు, కష్టాలను ఓర్పుగా విన్న తీరును చూస్తే.. చంద్రన్న బాటలో లోకేశ్‌ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. మోకాలి లోతు నీళ్లను సైతం లెక్కచేయకుండా.. కాళ్లు బుదరలో కూరుకుపోతున్నా.. పట్టించుకోకుండా.. పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు ఆయన చూపిన చొరవ బాధిత రైతులనే కాదు.. ఆ పార్టీ నాయకులు, శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనను అంతగా ప్రభావితం చేశాయి. అన్నదాతల కన్నీళ్లను చూసి ఆయన చలించిపోయారు.


ఏకంగా ఏడు గంటలపాటు బాధిత రైతులతోనే గడిపారు. ఏ బాధిత రైతు పంట పొలాన్ని పరిశీలించేందుకెళ్లినా.. వారితో పంట సాగు వివరాలు అడిగి మరీ తెలుసుకుంటూ వారిలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమానికి వెనుకాడనని వారిలో భరోసా నింపారు. ప్రభుత్వం మొండికేస్తే.. అనంత నుంచే ఉద్యమం చేపడతానంటూ రైతుల్లో ధైర్యం నింపేందుకే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జిల్లాలో నారా లోకేశ్‌ శుక్రవారం ఒక రోజు క్షేత్రస్థాయి పర్యటన అటు బాధిత రైతుల్లో భరోసా.. ఇటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్లయింది.


నారా లోకేశ్‌ ఉదయం 10.30 గంటలకు జిల్లా సరిహద్దు గ్రామమైన గుంతకల్లు నియోజకవర్గంలోని కరిడికొండకు చేరుకున్నారు. స్థానిక రైతు కేశవస్వామి వేరుశనగ పొలాన్ని పరిశీలించారు. వర్షంతో పంట పూర్తిగా నష్టపోవటంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత రైతుతో వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడిపత్రి నియోజకవర్గ పరిధి పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ రైతు రమే్‌షరెడ్డికి చెందిన పత్తి, శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని రాందాసుపేటలో కౌలు రైతు దామోదర్‌రెడ్డికి వేసిన వేరుశనగ, రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లిలో రైతు నరేష్‌ వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.


ప్రభుత్వ తీరును ఎండగడుతూ..

జిల్లాలో భారీ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లినా.. దానిని అంచనా వేసి, బాధిత రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును లోకేశ్‌ ఈ పర్యటనలో తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అధికారుల తీరుపై నిలదీశారు. పంట నష్టపోయి రైతులు బాధల్లో ఉంటే.. వారి పొలాలను పరిశీలించి నష్టం ఏ మేరకు వాటిల్లిందో ప్రభుత్వానికి నివేదికలు పంపేందుకు అధికారులు కనీస చొరవ చూపకపోవడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాయలసీమ బిడ్డనంటూ ఎన్నికల ముందు పాట రాయించుకుని, మరీ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భారీ వర్షాలతో సీమ రైతు బిడ్డలు తీవ్రంగా నష్టపోతే.. పరామర్శించేందుకు తీరిక లేదా అని విమర్శలు గుప్పించారు. నష్టపోయిన రైతులను తమ బాధ్యతగా పరామర్శించేందుకెళ్తే.. ఎదురు దాడి విమర్శలు చేయటం ఏ మేరకు సమంజసమని పాలకులను నిలదీశారు.


విపత్కర పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం.. ప్రజల తరుపున పోరాడే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. పంట నష్టపోయామనీ, పొలానికొచ్చి పరిశీలించాలని రైతులు గగ్గోలు పెడుతున్నా.. అధికారులకు గానీ.. ప్రభుత్వానికి గానీ.. చీమకుట్టినట్లు లేదంటూ ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరును ఎండగట్టారు. రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన బాధిత రైతులను కదిపితే తెలుస్తుందన్నారు. అన్నదాతల గోడు పట్టించుకోని ప్రభుత్వానికి వారి బాధలేం తెలుస్తాయని ముఖ్యమంత్రే లక్ష్యంగా విమర్శనాస్ర్తాలు గుప్పించారు.


నేతలు సంఘటితం.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం..

జిల్లాలో నారా లోకేశ్‌ పర్యటన నేతలందరినీ సంఘటితం చేసింది. భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు జిల్లాకొచ్చిన ఆయనకు ఆ పార్టీ నేతలు, శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి జేసీ పవన్‌తో కలిసి నారా లోకేశ్‌ వచ్చారు. ఆయనకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్‌, ఉన్నం హనుమంతరాయచౌదరి, చాంద్‌బాషా, ఈరన్న, జితేంద్రగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పరిటాల శ్రీరామ్‌, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, వెంకటశివుడు యాదవ్‌, అంజినప్ప, జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ సరిపూటి సూర్యనారాయణ, మాజీ మేయర్‌ మదమంచి స్వరూప, నాయకులు తలారి ఆదినారాయణ, ఆదెన్న, బుగ్గయ్య చౌదరి, శ్రీధర్‌ చౌదరి, ముంటిమడుగు కేశవరెడ్డి, రామలింగారెడ్డి, పర్వతనేని శ్రీధర్‌బాబు, జేఎల్‌ మురళీధర్‌, రాయల్‌ మురళి, దేవళ్ల మురళి, వెంకటప్ప, లింగారెడ్డి, సుబ్బరత్నమ్మ, రామసుబ్బమ్మ, ప్రియాంక, శివబాల, విశాలాక్షి తదితరులు స్వాగతం పలికారు.


నారా లోకేశ్‌ పర్యటన నాలుగు నియోజకవర్గాలకే పరిమితమైనా.. జిల్లాలో ముఖ్య నేతలందరూ కదిలిరావటం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. లోకేశ్‌ వెంటే నేతలంతా నడిచారు. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా కలిశారు. భోజన విరామ సమయంలో ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకున్నారు. జిల్లాలో ఒక రోజు పర్యటన ముగించుకుని సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు రోడ్డు మార్గాన బయల్దేరి వెళ్లారు. పామురాయి వద్ద ఆ పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌, జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు.. లోకేశ్‌కు వీడ్కోలు పలికారు.

Updated Date - 2020-10-24T09:57:27+05:30 IST