వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-05-21T06:48:06+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు

జగన్‌ మూడేళ్ల పాలనపై విసిగిపోయారు

ప్రజల పక్షాన పోరాటం చేస్తాం

కేసులకు భయపడే ప్రసక్తే లేదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

 అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజం


విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళుతూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను ఇబ్బందులు పాల్జేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైసీపీ పాలకులను తరిమితరిమికొట్టడం కూడా ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు, 55 మంది సీనియర్‌ నాయకులను వేధించడంతోపాటు పలు రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నారన్నారు. నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ను, ఇంకా చిత్తూరు జిల్లాలో అప్పటి ఉపముఖ్యమంత్రి అక్రమాలు వెలుగులోకి తీసుకువచ్చిన డాక్టర్‌ అనితారాణిని ఇబ్బందులు పెట్టారన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. బిహార్‌ను ఏపీ ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పడానికి బాధపడుతున్నామన్నారు. గంజాయి మత్తులో మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని లోకేష్‌ అన్నారు. టీడీపీ నాయకులపై దొంగ కేసులు పెడున్నారని, తనపై మొన్నటి వరకు 12, తాజాగా రెండు కలిసి మొత్తం 14 కేసులు పెట్టారన్నారు. చివరకు తనపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దొంగ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 

Updated Date - 2022-05-21T06:48:06+05:30 IST