మంగళగిరికి తీరని అన్యాయం

ABN , First Publish Date - 2021-11-26T06:14:11+05:30 IST

రెండున్నరేళ్లలో మంగళగిరి నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.

మంగళగిరికి తీరని అన్యాయం
చిలువూరులో విద్యార్థులతో కరచలనం చేస్తున్న లోకేశ్‌

దుగ్గిరాల పర్యటనలో నారా లోకేశ్‌ 

దుగ్గిరాల, నవంబరు 25: రెండున్నరేళ్లలో మంగళగిరి నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.  మండలంలోని చిలువూరు గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామస్థులు, కార్యకర్తలతో మాట్లాడుతూ దుగ్గిరాల మండల పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మార్పు ఆరంభమైందన్నారు. కార్యకర్తలు కేసులకు భయపడవద్దని, అన్నీ గుర్తుపెట్టుకుని ఒక చెంపపై కొడితే, తిరిగి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రోజుకోసం ఎదురు చూడాలన్నారు. జగన్‌ పాదయాత్ర హామీలు మరచి ప్రజలపై పన్నుల బాదుడు కొనసాగిస్తున్నారన్నారు.  రాష్ట్రంలో ఎక్కడా కనీస అభివృద్ధి జరగలేదన్నారు. స్థానిక రామతులసి కల్యాణ మండపంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీడీపీ నేతలను ఘనంగా సత్కరించారు. 

విద్యార్థులతో ముఖాముఖీ

కేవీఎస్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ను సందర్శించి  విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఎంతోమంది  మేధావులు ఒకప్పుడు కుగ్రామాల్లోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివిన వారేనన్నారు. ఇలాంటి ఎయిడెడ్‌ వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన 19, 42, 50, 51 నంబరు జీవోలను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎయిడెడ్‌ సంస్థల ఆస్తులపై కన్నేసి జీవోలను తయారు చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యావ్యస్థలో విప్లవాత్మక మార్పులు చేపడతామన్నారు. విద్యార్థినులు లక్ష్మీచైతన్య, నస్రీన్‌, చాందినీలు మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు ఫీజులు చెల్లించలేమని, దూరం వెళ్లాలంటే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. స్థానిక లూథరన్‌ చర్చి ప్రార్థనల్లో, మసీదులో నమాజులో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు, తోటకూర సీతారామయ్య, సర్పంచ్‌ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీలు షేక్‌ జబీన్‌, చిలువూరు రోజమరియమ్మ, కరస్పాండెంట్‌ కాట్రగడ్డ నారాయణరావు, చిలువూరు శేషగిరి, నిజాముద్దీన్‌, జలాలుద్దీన్‌, కొప్పుల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-26T06:14:11+05:30 IST