ప్రియురాలు తనను నిర్లక్ష్యం చేస్తోందని భావించి.. మాట్లాడాలని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2021-02-25T06:25:11+05:30 IST

పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో..

ప్రియురాలు తనను నిర్లక్ష్యం చేస్తోందని భావించి.. మాట్లాడాలని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి..
విద్యార్థిని అనూషకు నివాళి(ఇన్‌సెట్‌లో.. నిందితుడు విష్ణువర్ధన్‌రెడ్డి)

అమానుషం! 

నరసరావుపేటలో విద్యార్థిని దారుణ హత్య

ఘాతుకానికి పాల్పడిన ప్రేమోన్మాది

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

ఆగ్రహించిన విద్యార్థులు.. 8గంటలపాటు రోడ్డుపైనే ఆందోళన

హత్యను ఖండించిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు

 

నరసరావుపేట(గుంటూరు): నరసరావుపేటలో అమానుషం జరిగింది... డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని సహ విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. నమ్మకంగా తీసుకువెళ్లి గొంతు పిసికి చంపాడు. ఘాతుకానికి పాల్పడిన ప్రేమోన్మాది పోలీసులకు లొంగిపోయాడు. హత్య ఘటనను ఖండిస్తూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు... కళాశాల అద్దాలను ధ్వంసం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. సుమారు ఎనిమిది గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి న్యాయం చేయాలని నినదించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

 

పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోటా అనూష(20) బుధవారం దారుణ హత్యకు గురైంది. సహచర విద్యార్థి, పేమోన్మాది మెడా విష్ణువర్ధన్‌రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడుకు చెందిన అనూష రోజూ మాదిరిగానే ఇంటి నుంచి కళాశాల బస్సులో కాలేజీకి వచ్చింది. బస్సు దిగిన అనంతరం ఆమెను విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడాలని చెప్పి ఆటోలో ఎక్కించుకు వెళ్లినట్లు సహచార విద్యార్థులు చెబుతున్నారు. పట్టణ శివారులోని రావిపాడు సమీపంలోని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి అనూష గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువ ఒడ్డున పడవేసి కనిపించకుండా చెత్త కప్పాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చి తాను అనూషను హత్య చేశానని, మృతదేహం కాలువ వద్ద ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు.


కొంతకాలంగా వేధింపులు

ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించిన విష్ణు.. అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్టు సమాచారం. గోళ్ళపాడు గ్రామానికి చెందిన కోటా ప్రభాకరరావు, వనజలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం ఆధారంగా జీవిస్తూ పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు. తాను పడిన కష్టం పిల్లలు పడకూడదని, కుమారుడిని ఇంజనీరింగ్‌లోను, కుమార్తె అనూషను బీఎస్సీలో చేర్పించాడు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వగ్రామం బొల్లాపల్లి మండలం పమిడిపాడు. తల్లి అంగన్‌వాడి కేంద్రంలో పనిచేస్తుండగా తండ్రి వ్వవసాయం చేస్తున్నాడు. విష్ణువర్ధన్‌రెడ్డి జులాయిగా తిరుగుతుంటాండని తోటి విద్యార్థులు అంటున్నారు. రెండ్రోజులుగా కళాశాలకు హాజరుకావడం లేదు. బుధవారం కళాశాల వద్దకు వచ్చి అనూషను తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.


నేతల పరామర్శ

తెలుగుదేశం నేతలు జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, డాక్టర్‌ కోడెల శివరామ్‌, మల్లి, సీపీఐ రాష్ట్ర నేత ముపాళ్ళ నాగేశ్వరరావు అనూష మృతదేహం వద్ద నివాళులర్పించారు. హతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని జీవీ ఆంజనేయులు, అరవిందబాబు కోరారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఫోన్‌ ద్వారా అనూష కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. వైసీపీ హయాంలో ఇటువంటి హత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ నేతలు, ఏఐటీయుసీ, సీపీఐ, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.


జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ హత్య సంఘటనపై హోం మంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ బాధితులతో చర్చలు జరిపారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తరఫున ఆమె హామీ ఇచ్చారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా కోసం ప్రభుత్వానికి కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపనున్నారని, కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేయడంతో బాధితులు ఆందోళన విరమించారు. 


8 గంటల పాటు ఆందోళన

అనూష కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అమె కుటుంబసభ్యులతో కలసి విద్యార్థులు చేపట్టిన  ఆందోళన 8గంటలకు పైగా కొనసాగింది. ఆస్పత్రితో ఉన్న మృతదేహాన్ని స్టెచ్చర్‌పై విద్యార్థులు ప్రదర్శనగా పల్నాడు రోడ్డులోని బైసాస్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. డీఎస్పీ విజయ భాస్కర్‌  ఆందోళన చేస్తున్న వారితో పలు ధపాలుగా చర్యలు జరిపారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె స్వగ్రామం గోళ్లపాడుతో విషాధ చాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. యువతిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

Updated Date - 2021-02-25T06:25:11+05:30 IST