ప్రజాధనం.. మట్టిపాలు

ABN , First Publish Date - 2022-05-19T06:00:08+05:30 IST

నరసరావుపేట మున్సిపాలిటీలో వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉంది. చెత్త సేకరణ, తరలింపు, డ్రెయిన్లలో పూడికతీత, రోడ్లు శుభ్రం చేసేందుకు గతంలో రూ.లక్షలు వెచ్చించి ఆధునిక యంత్ర పరికరాలతో కూడిన వాహనాలను కొనుగోలు చేశారు.

ప్రజాధనం.. మట్టిపాలు
తుప్పు పట్టిన మున్సిపల్‌ వాహనాలు

చెత్త వాహనాల నిర్వహణలో నిర్లక్షం

మట్టిలో కలుస్తున్న మున్సిపల్‌ యంత్రాలు

నిరూపయోగంగా వదిలేసి అద్దె వాహనాలపై శ్రద్ధ

నిధుల దుర్వినియోగంలో నరసరావుపేట ముందువరుస 


మన సొమ్మేం కాదుగా.. ప్రజా ధనమే కదా పోయేది.. అన్న తీరులో మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. రూ.లక్షల ప్రజాధనం మట్టిపాలవుతున్నా పట్టీపట్టనట్లుగా ఉన్నారు. రూ.లక్షల విలువైన వాహనాలను వినియోగించకుండా, నిర్వహణ మరిచి వదిలేయడంతో అవి మట్టిలో కలుస్తున్నాయి. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంలో నరసరావుపేట మున్సిపాల్టీ ముందు వరుసలో ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. డ్రెయిన్లలో పూడిక తీసేందుకు, చెత్త సేకరణ తరలించేందుకు రూ.లక్షలు వెచ్చించి గతంలో కొనుగోలు చేసిన వాహనాలు మట్టిపాలువున్నాయి. ఇటీవల క్లాప్‌లో భాగంగా చెత్త సేకరణకు ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేశారు. వీటి రాకతో గతంలో ఉన్న రూ.లక్షలు విలువైన వాహనాలను, పారిశుధ్య పరికరాలను పక్కన పడేశారు. 


నరసరావుపేట, మే 18: నరసరావుపేట మున్సిపాలిటీలో వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉంది. చెత్త సేకరణ, తరలింపు, డ్రెయిన్లలో పూడికతీత, రోడ్లు శుభ్రం చేసేందుకు గతంలో రూ.లక్షలు వెచ్చించి ఆధునిక యంత్ర పరికరాలతో కూడిన వాహనాలను కొనుగోలు చేశారు. అయితే వీటిని వినియోగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. లారీలు, ఆటోలు, ఈ బైక్‌లు, ట్రాక్టర్లు ఇలా వివిధ వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో మరమ్మతులకు గురయ్యాయి. వాటికి మరమ్మతులు నిర్వహించకుండా వదిలేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. ఈ వాహనాలను వదిలేసి వాటి స్థానంలో అద్దె వాహనాలను వినియోగించేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు మళ్లీ లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా నిధులను దుబారా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. చెత్తను సేకరించేందుకు వినియోగించాల్సిన  ఆటోలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రణాళికా విభాగానికి సంబంధించిన ఆటోలు తప్పు పట్టిపోతున్నాయి. ట్రాక్టర్లు, ట్రక్కులు, తాగునీటి ట్యాంకర్‌, డస్ట్‌బిన్లను తరలించే డంపర్‌ ప్లేసర్‌, డ్రెయిన్ల పూడికతీత యంత్రాలను వినియోగించకుండా బంగ్లా ఆవరణలో వదిలేశారు. రోడ్లు శుభ్రం చేసేందుకు రూ.50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు క్లీనింగ్‌ యంత్రాలను వినియోగించకుండా కార్యాలయ ప్రాంగణంలో మూలన పడేశారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై మట్టి పేరుకు పోతున్నా ఈ క్లీనింగ్‌ వాహనాలను వినియోగించడంలేదు. దుమ్ము, ధూళి, మట్టితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు శుభ్రం చేయాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. అధికారులు, పాలకవర్గం సంచరించే బంగ్లా, మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలోనే రూ.లక్షల వాహనాలు తుప్పు పట్టి శిథిలమవుతున్నాయి. గుంటూరు రోడ్డు మార్జిన్‌లో వదిలేసిన లక్షలు విలువ చేసే లారీని చూస్తే మున్సిపల్‌ అధికారుల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. దోమల నివారణ కోసం కొనుగోలు చేసిన ఎలకా్ట్రనిక్‌ ఫాగింగ్‌ ఆటోను కూడా నిరుపయోగంగా మార్చారు. ఆయా వాహనాలకు మరమ్మతులు చేసి వినియోగించే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు.  


Updated Date - 2022-05-19T06:00:08+05:30 IST