హైకోర్టులో నారాయణకు ఊరట

ABN , First Publish Date - 2022-05-27T09:09:19+05:30 IST

హైకోర్టులో నారాయణకు ఊరట

హైకోర్టులో నారాయణకు ఊరట

జూన్‌ 9 వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశం  

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని కేసులో ఆయనతోపాటు రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ విషయంలో జూన్‌ 9 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 9కి  వాయిదా వేసింది. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు నారాయణ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తరఫు న్యాయవాది టీకే చైతన్య వాదిస్తూ.. ఈ వ్యవహారంలో అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని తెలిపారు. అనారోగ్యంతో ఆయన హాజరు కానందున వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేసే ప్రమాదం ఉందన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అరెస్ట్‌ చేస్తామనే ఆందోళన పిటిషనర్లకు అవసరం లేదన్నారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోమని తెలిపారు.

Updated Date - 2022-05-27T09:09:19+05:30 IST