విద్వేషపు విషానికి విరుగుడు ఉన్నదా?

ABN , First Publish Date - 2022-02-10T07:09:21+05:30 IST

ముస్కాన్. మెచ్చుకోవడానికీ ముచ్చటపడడానికీ ఆ అమ్మాయి చేసింది వినోద ప్రదర్శనో విద్యా విన్యాసమో కాదు.

విద్వేషపు విషానికి విరుగుడు ఉన్నదా?

ముస్కాన్. మెచ్చుకోవడానికీ ముచ్చటపడడానికీ ఆ అమ్మాయి చేసింది వినోద ప్రదర్శనో విద్యా విన్యాసమో కాదు. జడలు విప్పి, విరుచుకుపడుతున్న మూర్ఖత్వాన్ని, వెన్నులో వణుకు పుట్టించే దాష్టీకాన్ని తడబడని అడుగులతో అధిగమించింది ఆమె. ఆత్మాభిమానాన్ని, గుండె ధైర్యాన్ని గొంతులోకి వొంపుకుని నినదించింది. నిస్పృహా నిర్వేదాలు అలుముకున్న సమస్యాత్మక సన్నివేశానికి సమాధానంలా వెలిగింది.


ఆ అమ్మాయి సరే. తాము చేస్తున్నదేదో మహత్తర కార్యమని, నెరవేరుస్తున్నది సాంస్కృతిక కర్తవ్యమని, దేవుడు సంతోషించే ఘనకార్యమని అనుకుని ఆ విద్యార్థిని మీద ఎగబడడానికి వచ్చారే, వారి మీద మాత్రం జాలి కలుగుతోంది. దేశభవిష్యత్తు మీద భయం వేస్తోంది. వారిని అట్లా తీర్చిదిద్దిన వారి మీద ఏవగింపు కలుగుతోంది. పావన నవజీవన బృందావన నిర్మాతలు కావలసినవాళ్లు ఏమి కాబోతారో అని బెంగ పుడుతున్నది. ఇదంతా చూసి, దేశదేశాల నాగరికులు మన గురించి ఏమనుకుంటారో అని సిగ్గు వేస్తున్నది. ఇంతేనా, ఈ ద్వేష శ్లేష్మంలో దేశం కొట్టుమిట్టాడవలసిందేనా? అన్న నిర్వేదం ఏర్పడుతోంది.


వేటకు గురి అవుతున్నది ‘ఇతరులు’ కావచ్చు. కానీ, చచ్చిపోతున్నది మనిషితనమే కదా, కార్పణ్యపు పతాకాన్ని పట్టుకుని ఏ అమృతఘడియల కోసం మనం ప్రయాణిస్తున్నాము? ఈ వేళ ఒకరు ‘ఇతరులు’. రేపు మరొకరు. దళితులు, అణగారినవారు, ఏ సామాజిక అస్తిత్వం బలిపీఠం మీదకు వచ్చినా అధికంగా గాయపడవలసి వచ్చే స్త్రీలు, ఇట్లాగే కదా, తమని కానివారిని, తమలాగా వేషధారణ చేయనివారిని, వేరే తిండి తినేవారిని, వేరే రంగులో ఉండేవారిని, వేరే భాష మాట్లాడేవారిని అన్యులుగా నిర్వచిస్తే, జరిగేది ఇంతే కదా, నడివీధిలో వేటనే కదా?


ముస్కాన్‌ను అసదుద్దీన్ ఒవైసీ అభినందించాడు. ధైర్యాన్ని ప్రశంసించాడు. చదువుకోవడం మీదనే గట్టిగా నిలబడమన్నాడు. అంతేకాదు, పాకిస్థాన్ మంత్రి ఒకడు ఏదో మాట్లాడినందుకు గట్టిగా బుద్ధిచెప్పాడు. మలాలా మీద దాడి జరగకుండా నీ దేశం చూడలేకపోయింది, నువ్వేంటి నీతులు చెప్పేది, నీ సంగతి నువ్వు చూసుకో-.. అని నోరుమూయించాడు. తన మీద ఉన్న ముద్రలను తొలగించుకుని, ప్రజానుకూల జాతీయ రాజకీయ పక్షంగా గుర్తింపు పొందడానికి ఆయన ప్రయత్నమైతే గట్టిగానే చేస్తున్నాడు. ఎంఐఎం సరే, సెక్యులర్ పార్టీలని చెప్పుకునే వాటికి అటూ ఇటూ మాట్లాడే నంగితనం తప్ప, ధైర్యం లేదు. ఓట్ల లాభనష్టాల గురించిన వాటి గుంజాటన తేలేది కాదు. ఇన్ని శషభిషల తరువాత కూడా వాటికి అటు మెజారిటీ మెప్పూ దొరకదు, ఇటు మైనారిటీ ఓటూ దొరకదు.


ఇదంతా ఉత్తరప్రదేశ్ కోసమే కావచ్చు. ఒక వివాదం, దాని ప్రతిధ్వనులు ప్రజలను చీల్చి, ఓట్లు రాలుస్తాయి కావచ్చు. కర్ణాటక చిచ్చును చర్చించి, మన దగ్గర కూడా చీకటి శక్తులకు ఐడియాలు ఇవ్వాలా? మనదాకా రాలేదు కదా, ఊరుకుంటే అదే ఉపశమిస్తుంది అని ఊరుకోవాలా? మరి ఈ లోగా కూలిపోయే నమ్మకాలు, సహవాసాలు, పెరిగిపోయే విద్వేషాలు, గట్టిపడే గోడలు...? ఎన్నికల వ్యూహమే అయినా సరే, ఇందులోని దీర్ఘకాలిక సత్యాన్ని పట్టించుకోవలసిందే. 


స్థానికంగా తక్షణ పరిస్థితులలో వెలువడిన ఒక ప్రతిఘటనాత్మక స్వరాన్ని సమర్థించి సొంతం చేసుకున్నాడు కానీ, అసదుద్దీన్, ఆయన పార్టీ ఎందుకు ‘హిజాబ్’ వివాదానికి జాతీయస్థాయిలో ఒక ప్రతికథనాన్ని నిర్మించలేకపోయింది? ఆరేడేళ్లుగా దేశంలోని పరిణామాలకు జాతీయస్థాయి మైనారిటీ స్పందనలు ఎందుకు నిర్మితంకాలేదు? ఎందుకు ఒక కౌమార ప్రాయంలో ఉన్న ఒక బాలిక పెద్ద సవాల్‌కు స్పందించవలసిన భారాన్ని స్వీకరించవలసి వచ్చింది? జాతీయస్థాయిలో ముస్లిములకు ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నిస్తున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, చదువుకునే బడులలో ఆవరించిన భీతావహ పరిస్థితిని పార్లమెంటులోను, రాష్ట్రపతి దగ్గరా, ఉన్నత న్యాయస్థానాల దగ్గరా ఎందుకు నివేదించలేకపోయింది, ప్రమాదసూచికను ఎగురవేయలేకపోయింది? గట్టి స్వరం, స్పష్టమైన స్వరం వినిపించగలిగిన నాయకుడే, ఎందుకు ఒక సాహసబాలికకు అనుచరుడిగా మాత్రమే ధ్వనిస్తున్నాడు?


‘హిందూ విద్యార్థి స్నేహితుల అండతోనే నేను సురక్షితంగా ఉన్నాను, నా మీద దాడికి ప్రయత్నించినవారిలో అధికులు బయటివారే, న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నాను, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను’ అని ముస్కాన్ మీడియాతో మాట్లాడింది. వైఖరులను ఎట్లా మలచుకోవాలో, సమ్మిశ్రిత సమాజ జీవనంలోని మిత్రులను ఎట్లా గుర్తించాలో రాజకీయవాదులు నూతన ప్రతిఘటనా తరం నుంచి నేర్చుకోవాలి. ముస్లిమ్ సమాజం తనకు ఎదురవుతున్న సమస్యలను తను మాత్రమే ఎదుర్కొనలేదు. అదే సమయంలో తమలో తాము ఒక సంఘటిత శక్తిగా సమీకృతమవుతూ మిత్రశ్రేణులను ఎంచుకోవాలి. రెండు శత్రుశిబిరాలుగా మెజారిటీ, మైనారిటీల మోహరింపు జరగాలని విద్వేషశక్తులు ఆకాంక్షిస్తున్నాయి. అందుకు భిన్నమైన సమీకరణాలను నిర్మించుకోవాలి.


సెక్యులర్ పార్టీలుగా చెలామణీ అయ్యే పార్టీలు తమను మోసగించాయని ముస్లిమ్ మైనారిటీలు గుర్తిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం ఒకటి రెండు దశాబ్దాలకే ఈ తెలివిడి కొందరికి వచ్చింది కానీ, దేశవిభజనకు బాధ్యులన్న ముద్రతో ముస్లిములు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించలేకపోయారు. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ, అవి ముందుకు సాగలేదు. ఈ దేశంలో ప్రాంతీయ అస్తిత్వాలు మొదటగా రాజకీయ వ్యక్తీకరణలు పొందాయి. దక్షణాది ప్రాంతీయ పార్టీలు, ఏకకాలంలో ప్రాంతీయ అస్తిత్వానికి, శూద్ర సామాజిక అస్తిత్వాలకు ప్రాతినిధ్యం వహించేవి. ఉత్తరాదిలో వెనుకబడిన కులాలు అనేక రాజకీయ పార్టీలుగా ఏర్పడి, ఉత్తరభారతంలో అధికారంలో భాగస్వామ్యం పొందాయి. కానీ దేశజనాభాలో పది పన్నెండు శాతం ఉన్న ముస్లిమ్ మైనారిటీలు ఒక రాజకీయ శక్తిగా రూపొందలేదు. ఇది మైనారిటీ రక్షకులుగా చెప్పుకున్నవారి విద్రోహం, ముస్లిమ్ శిష్టుల వైఫల్యం. మైనారిటీలను ఓటుబ్యాంకుగా మార్చారని బిజెపి విమర్శిస్తుంది కానీ, ఆ ఓటు బ్యాంకు ఇతరులకు సేవ చేయడానికే తప్ప, ఆ వర్గానికి ఉపయోగపడలేదని చరిత్ర నిరూపించింది. బిజెపి బలం పెరిగిన తరువాత కాంగ్రెస్ తదితర సెక్యులర్ పార్టీల పని మరింత సులభం అయింది. బిజెపి అనే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తమకు ఓటువేయడం తప్ప ముస్లిములకు గత్యంతరం లేదన్న ధీమాతో, వారి ఓట్లు మాత్రం తీసుకుని, అధికారంలోను, రాజకీయ సంస్థల నిర్మాణంలోనూ భాగస్వామ్యం లేకుండా చేశారు. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణంలో వచ్చిన మార్పు ముస్లిమ్ యువకులలో, మేధావులలో అంతర్మథనానికి దారితీసింది. ఎంత కాలం ఈ కంచి గరుడ సేవ అన్న ప్రశ్న ఇప్పుడు ముస్లిమ్ ప్రజానీకాన్ని వేధిస్తున్నది. మన ఓట్లు మనకే అన్న నినాదం వారిలోనూ ఆదరణ పొందుతున్నది. మజ్లిస్ పార్టీకి వివిధ రాష్ట్రాలలో ప్రాతినిధ్యం పెరగడం వెనుక, ఈ మైనారిటీ అస్తిత్వ స్పృహ ఉన్నది.


కానీ, మజ్లిస్‌కు ఉన్న వివాదాస్పదమైన గతం, ఆధునిక అస్తిత్వ స్పృహతో పరిచయం లేని కులీన తత్వం దాని విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో మధ్యేవాద పార్టీలతో విసిగిపోయిన ముస్లిములను మజ్లిస్ ఆకట్టుకుంటోంది. అయితే, తాను గెలిచే అవకాశం ఉన్న స్థానాలలోనే కాకుండా, ఇతర చోట్ల కూడా పోటీ చేసి, సెక్యులర్ పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తున్నదన్న విమర్శ ఎదుర్కొంటున్నది. సెక్యులర్ పార్టీ అయినందువల్ల తమకు ఒరిగిందేమీ లేదని, మెజారిటీ మతతత్వంలో ఈ పార్టీలు తక్కువేమీ కాదని మజ్లిస్ పక్షీయులు సమాధానం చెబుతున్నారు. మా ఓట్లు మాకే పడేట్టు చూసుకుని, ఇతరుల ఓట్ల చీలిక ద్వారా ఏర్పడే సన్నివేశంలో అధికారంలో భాగస్వామ్యం కోసం ప్రయత్నించాలనే కాన్షీరామ్ తరహా వ్యూహాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని మజ్లిస్ చెబుతున్నది కానీ, ప్రస్తుత పరిస్థితులలో అది భారతీయ జనతాపార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నది. దళితులకు సాధికారత అన్న కాన్షీరామ్ పిలుపును వ్యతిరేకించే నైతిక వాదన ఎవరికీ లేదు. కానీ, ముస్లిమ్ సాధికారత విషయం వేరు. హరిద్వార్‌లో జరిగిన మతపెద్దల సమ్మేళనంలో ఒక వివాదాస్పద వక్త, ముస్లిమ్ ప్రధాని అయ్యే వ్యూహాన్ని మజ్లిస్ రచిస్తోంది జాగ్రత్త అని హెచ్చరించాడు. ముస్లిమ్ అస్తిత్వ రాజకీయాలు ఇతర సామాజిక అస్తిత్వాల మాదిరి ప్రతిపత్తిని, గుర్తింపును పొందాలంటే, అవి ఆధునికంగా, సెక్యులర్‌గా రూపొందాలి. అధికసంతానాన్ని కని, అధికారాన్ని సాధించాలి వంటి పిలుపులు ఇవ్వకూడదు. దళితుల వంటి వివక్షిత ప్రజాశ్రేణులతో సహజమైత్రిని రాజకీయ బంధంగా మలచుకోవాలి. విద్య ద్వారా, ఉపాధి ద్వారా నూతన జీవనావకాశాలలోకి ఉత్సాహంగా ప్రయాణిస్తున్న ముస్లిమ్ విద్యార్థులకు, యువకులకు అండదండగా ఉండాలి. సిఎఎ వ్యతిరేక ఉద్యమంలోను, అలీగఢ్ విశ్వవిద్యాలయ ఉద్యమంలోనూ నూతన ప్రగతిశీల యువనాయకులు రంగం మీదకు వచ్చారు. వారిలో అనేకులు నిర్బంధంలో ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విశ్వాసంతో ప్రజారంగంలో పనిచేసే ఈ నూతన శక్తులు ఈ దేశప్రజలు సామరస్య సహజీవనంతో మెలగడానికి దారులు వేయగలవు. ఆ దారులు వర్ధిల్లాలి. 


అప్రజాస్వామికతకీ, అపరిమిత నిరంకుశ అధికారానికీ దగ్గర దారిగా మైనారిటీల అన్యీకరణను కొందరు ఎంచుకున్నారు. అన్యీకరణను నిర్వీర్యం చేయడం ద్వారానే దురంహకార అధికార ప్రమాదాన్ని నిరోధించగలం. ముస్కాన్ నుంచి, ముస్కాన్‌లకు అండగా నిలిచిన జైభీమ్ విద్యార్థుల నుంచి నిరీక్షించగలిగే పరిష్కారం అదే!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-02-10T07:09:21+05:30 IST