అసాధారణ విజయాలకు నిలువెత్తు నిదర్శనం

ABN , First Publish Date - 2022-09-17T07:29:41+05:30 IST

ప్రభుత్వ విధానాల అమలులో అందరి పాత్ర, సంఘటిత కృషి ప్రధానం అన్నదే జన్ భాగీదారీ లేదా ప్రజాభాగస్వామ్య సూత్రం మూల లక్ష్యం.

అసాధారణ విజయాలకు నిలువెత్తు నిదర్శనం

ప్ర‌జాబ‌ల‌మే మన అసలైన శ‌క్తి. దేశంలోని ప్రతీ ఒక్క పౌరునిలోనూ మన బలం ఇమిడి ఉంది.

– నరేంద్ర మోదీ ప్రధానమంత్రి 


ప్రభుత్వ విధానాల అమలులో అందరి పాత్ర, సంఘటిత కృషి ప్రధానం అన్నదే జన్ భాగీదారీ లేదా ప్రజాభాగస్వామ్య సూత్రం మూల లక్ష్యం. శతాధిక కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రజలందరిలోనూ దాగి ఉన్న శక్తిని సంపూర్ణంగా వినియోగంలోకి తేవడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల అమలులో ప్రధానాంశం. విధానాల అమలు సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని అడ్డుకోవడం, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రజలు ఆ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని, ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేలా ఇత‌రుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌నే స్ఫూర్తిని నింపుతూ ప్రజాబలం ప్రయోజనాలేమిటో మోదీ నిరూపించి చూపించారు.


ఏ అంశంపై అయినా చర్చలకు అవకాశం కల్పించే నిరంతర ప్రక్రియ అనేది లేకపోతే జన్ భాగీదారీ (ప్రజల భాగస్వామ్యం) సంపూర్ణం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయా సమస్యల విశ్లేషణ, పరిష్కారానికి చర్యలు సూచించే విధాన పత్రాలు వెలువరించమే అసలైన ప్రజాభాగస్వామ్య సారం. ఏదైనా విధానాన్ని రూపొందించిన అనంతరం దానిపై ప్రజల స్పందన తెలుసుకోవడం, తర్వాత సంభావ్య లబ్ధిదారుల అభిప్రాయాలూ తెలుసుకోవడం చేసిన తర్వాతే ఆ స్పందనల ఆధారంగా విధానాలు అమలుపరుస్తున్నారు. ప్రజలను సాధికారం చేసి వారి జీవితాలు సరళం చేసే కృషిలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలతో నిరంతర సంప్రదింపుల కోసం మోదీ ప్రభుత్వం విస్తృత స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటోంది. పంటల బీమా, సుస్థిర వ్యవసాయానికి చేయూత అనే రెండు ప్రధాన పథకాలను విలీనం చేసి ప్రధాని మోదీ 2016లో ప్రారంభించిన పిఎం ఫసల్ బీమా ఇందుకు చక్కని ఉదాహరణ. 2019–20లో మరిన్ని మెరుగులతో ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో రైతుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం వారు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తూ సవరణలతో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పరివర్తిత మార్పునకు చర్చలను ఏ విధంగా సాధనం చేసుకున్నారనేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.


ఏ పథకం ప్రయోజనాలు అయినా సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా అందేందుకు చేసిన ప్రయత్నాల్లో ప్రధాని మోదీ అనితర సాధ్యమైన విజయం సాధించారు. ఆయన ఇచ్చిన ఏ పిలుపునకైనా ప్రజలు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. పలు సందర్భాల్లో భారీ ఎత్తున స్పందించి పేపర్‌పై ఉన్న విధానాలు ఫలప్రదంగా అమలయ్యేందుకు దోహదపడ్డారు. గణాంకాల పరంగా చూసినట్టయితే గతంలో వివిధ పథకాల సాఫల్యం అంతంత మాత్రంగా ఉండేది. కాని బహుముఖీనత, పటిష్ఠ అమలు మోదీ ప్రవేశపెట్టిన పథకాల ప్రత్యేకత. సమస్త ప్రజల సర్వతోముఖాభివృద్ధి గురించి ఆలోచించి ఆ బాటలో సాగే ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడడమే ఆయన మాటలు ఒక శాసనంగా నిలిచాయనేందుకు నిదర్శనం.


ప్రభుత్వ విధానాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేసి, వాటి ప్రయోజనాలు అందరికీ అందేలా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం ఆయన విజన్ లోను, పరిపాలనలోనూ కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి ప్రధానమంత్రి హోదాలో ఆయన చేసిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బహిరంగ మలమూత్ర విసర్జన గురించి ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అది ఒక మహోద్యమంగా మారి ఇప్పుడు ఒక లక్షకు పైగా గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా (ఒడిఎఫ్) పరివర్తన చెందడానికి దోహదపడింది. అంతే కాదు, 60 నెలల వ్యవధిలో 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం మరో భారీ విజయం. ఈ అసాధారణ విజయం ప్రపంచం యావత్తును విస్మయపరిచింది. ఇది పైకి స్వచ్ఛత ఉద్యమంగానే అనిపించవచ్చు కాని మహిళల ఆత్మగౌరవం, భద్రతకు అది హామీ ఇచ్చింది. లెక్కలేనంత మంది బాలల జీవితాలను కాపాడింది. చాలా మంది బాలికలు పాఠశాల విద్య మధ్యలోనే వదిలిపెట్టడాన్ని (డ్రాపౌట్) కాకుండా నిలువరించింది.


జల్ జీవన్ మిషన్ ఇందుకు మరో ఉదాహరణ. దీని కింద ఇప్పటివరకు కేవలం గ్రామాల్లోనే 10 కోట్లకు పైబడి నీటి సరఫరాకు పైప్ కనెక్షన్లు అందించారు. ‘ప్రజా భాగస్వామ్యం, సంబంధిత వ్యక్తులందరి భాగస్వామ్యం, రాజకీయ చిత్తశుద్ధి, వనరుల గరిష్ఠ వినియోగం అన్నింటి ఫలితమే జల్ జీవన్ కార్యక్రమం విజయం’ అని ప్రధానమంత్రి అన్నారు. ప్రజలందరికీ ఇలాంటి కనీస సదుపాయం ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. నీటిని తెచ్చుకునేందుకు మహిళలు ఇప్పుడు గంటల తరబడి నడవాల్సిన పని లేదు. దీనివల్ల గ్రామీణ కుటుంబాల జీవనాన్ని సరళం చేయడంతో పాటు కలుషిత జలాల ద్వారా ప్రమాదకరమైన వ్యాధుల వ్యాప్తిని కూడా నిలువరించడం సాధ్యమయింది.


కేవలం 18 నెలల కాలవ్యవధిలో 200 కోట్ల కొవిడ్–19 వ్యాక్సినేషన్ల మైలురాయి ఈ ప్రజాబలానికి మరో పెద్ద ఉదాహరణ. అసాధ్యమే అయినా దీన్ని మనం సాధించాం. పలువురి ప్రయత్నాల ద్వారానే ఇది సాధ్యమయినప్పటికీ వాస్తవానికి దానికి సారథ్యం వహించినది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అసాధ్యమైనది సాధించడం ఆయన సంకల్ప బలంతోనే సాధ్యమయింది. అలాగే ప్రజల పట్ల ఆయనకు గల ప్రగాఢ విశ్వాసం కూడా అందుకు కారణం. అంతే కాదు, మహమ్మారి కాలంలో కర్ఫ్యూలు కట్టుదిట్టంగా పాటించాలని, ప్రజాసేవలో ముందువరుసలో నిలిచిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ప్రశంసాపూర్వకంగా దీపాలు వెలిగించాలని ఆయన ఇచ్చిన పిలుపుపై ప్రజలందరి సంపూర్ణ సానుకూల స్పందన కూడా ఆయన మాటలు ప్రతీ ఒక్కరినీ ఎంతగా ప్రభావితం చేసి ఒక ఉద్యమరూపం దాలుస్తాయనేందుకు నిదర్శనం. ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వం నిర్బంధించకపోయినప్పటికీ అందుబాటులో ఉన్న వాటిలో ఉత్తమమైన ప్రత్యామ్నాయం ఎంచుకోవడానికే మొగ్గు చూపారు. అలాగే భరించగల సామర్థ్యం ఉన్న వారు ఎల్‌పిజి, టికెట్లపై రైల్వే సబ్సిడీలు వదులుకున్నారు. వాస్తవమైన సబ్సిడీలను తొలగించకుండానే ‘గివ్ ఇట్ అప్’ నినాదంతో ఇది సాధ్యం అయింది. ఇవన్నీ ప్రధాని మోదీ నాయకత్వంలోని జన్ భాగీదారి విజయం కాకపోతే మరేదవుతుంది?


ఎందరో అభివర్ణించినట్టు మన్ కీ బాత్ విజయం ఒక సామాజిక విప్లవం మాత్రమే కాదు, జన్ భాగీదారీకి పునాది. ప్రతీ ఒక్క పౌరుని పరివర్తిత శక్తిపై ప్రధాని మోదీకి గల చెక్కు చెదరని విశ్వాసానికి ఈ నెలవారీ ఎపిసోడ్‌లు చక్కని నిదర్శనం. దేశీయ వాణిజ్యాన్ని, స్థానిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఆయన ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్ ఒక మహోద్యమంగా మారి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలనే చైతన్యం ప్రజల్లో కలిగేందుకు దోహదపడింది. నేడు ఈ ప్రజా ఉద్యమం పలు చిన్న వ్యాపారాలను సాధికారం చేసింది. అలాగే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో స్టార్టప్‌లు నిలదొక్కుకోవడానికి, సాంప్రదాయిక కళల పునరుద్ధరణకు సహాయకారి అయింది. అంతే కాదు స్థానిక ఆటబొమ్మలకు ప్రచారం చేయండి అనే మోదీ పిలుపు ‘ఆటబొమ్మల తయారీలో ఆత్మనిర్భరత’కు దోహదపడింది.


‘5–7 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలలకు నేను శాల్యూట్ చేస్తున్నాను. జాతి చైతన్యం ఉద్దీప్తమయింది. తాము విదేశీ బొమ్మలతో ఆడుకోవాలనుకోవడంలేదని పలు కుటుంబాల్లోని 5–7 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలలు చెప్పారన్న విషయం నా దృష్టికి వచ్చింది. 5 సంవత్సరాల బాలల నోటి నుంచి ఆ మాట రావడం వారిలోని స్వయం–సమృద్ధ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’ అని 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం ప్రపంచ ఆటబొమ్మల తయారీ కేంద్రంగా మారేందుకు సహాయపడాలని, దేశంలో టాయ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి సహకరించాలని 2020 నుంచి మోదీ కోరుతున్నారు. 2022 నాటికి దేశంలో ఎన్నో టాయ్ క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. భారతీయ సంస్కృతి, విలువల ఆధారంగా కొత్త ఆలోచనలను సేకరించడం కోసం ‘టాయ్ కాథాన్’ వంటి ప్రదర్శనలు నిర్వహించాయి. దేశంలో ఆటబొమ్మల తయారీదారులందరూ ఆటబొమ్మలకు బిఐఎస్ (భారత ప్రమాణాల బ్యూరో) ధ్రువీకరణ పత్రం పొందడాన్ని తప్పనిసరి చేయడం వల్ల చైనా కంపెనీల పోటీని నిర్మూలించింది.


‘ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రభుత్వానికి ఐదేళ్ల కాంట్రాక్టు ఇవ్వడం కాదు. వాస్తవానికి జన్ భాగీదారీ’ అని ప్రధాని మోదీ అన్నారు. పౌరులపై ప్రధానమంత్రికి గల చెక్కు చెదరని విశ్వాసం పదే పదే దేశానికి అసాధారణ విజయాలు అందించింది. విధానాల ప్రయోజనాలు సమాజంలో చిట్టచివర నిలిచిన వ్యక్తికి కూడా అందినప్పుడే ప్రజాస్వామ్యం అసలైన విజయం సాధిస్తుంది. ఆ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాద సారమే : అందరి భాగస్వామ్యంతోనే అందరి సుసంపన్నత సాధ్యం.



Updated Date - 2022-09-17T07:29:41+05:30 IST