పడగ విప్పుతున్న నిరంకుశత్వం

ABN , First Publish Date - 2022-06-18T06:11:27+05:30 IST

స్వాతంత్ర్య సాధనకు ఒక దశాబ్దం ముందే స్వపరిపాలన మనకు ఒక విధంగా అనుభవంలోకి వచ్చింది. 1937లో పరిమిత ఓటు హక్కు ప్రాతిపదికన జరిగిన ఎన్నికలలో ..

పడగ విప్పుతున్న నిరంకుశత్వం

స్వాతంత్ర్య సాధనకు ఒక దశాబ్దం ముందే స్వపరిపాలన మనకు ఒక విధంగా అనుభవంలోకి వచ్చింది. 1937లో పరిమిత ఓటు హక్కు ప్రాతిపదికన జరిగిన ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మొదలైన పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. సంపూర్ణ స్వాతంత్ర్య సాధన, పూర్తిస్థాయి ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటునకు దీన్నొక ముందడుగుగా అందరూ భావించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తమిళ మేధావి ఒకరు విద్యార్థుల నుద్దేశించి ఒక అసాధారణ ప్రసంగం చేశారు. అందులో ఆయన వ్యక్తం చేసిన భావాలు నేటి భారతదేశ రాజకీయ సంస్కృతితో ప్రతిధ్వనిస్తున్నాయి.


నేను ప్రస్తావించిన మేధావి కె. స్వామినాథన్. ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ అయిన ఈ భావ సాహసికుడు 1938లో అన్నామలై విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. ‘రాజకీయ నాయకులలో మౌలికంగా రెండు రకాలవారు ఉంటారు. తమను తాము అనివార్యమైనవారుగా భావించుకునే వారు; అలా భావించుకోనివారు’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. తమ నాయకత్వం అనివార్యమని భావించుకోని నాయకుల శ్రేణిలో ఒకే ఒక్క పేరును ఆయన ప్రస్తావించారు. మహాత్ముడే ఆ ఏకైక నాయకుడు. ‘తన తరువాత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించేవారికి శిక్షణ ఇచ్చే విషయమై గాంధీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా శ్రద్ధతో కృషి చేస్తున్నారు. గాంధీ తోడ్పాటు లేకపోతే జవహర్ లాల్ నెహ్రూ గానీ, రాజేంద్రప్రసాద్ గానీ నేడున్న స్థాయిలో ఉండేవారు కాదు. అయితే వారిరువురూ గాంధీకి గుడ్డిగా విధేయత చూపేవారు కాదు. మట్టి నుంచి మాణిక్యాలను సృష్టించగల మహోన్నతుడు గాంధీజీ’.


ఉత్కృష్ట నాయకత్వాన్ని ఒక సమున్నత ఉదాహరణతో వివరించిన తరువాత స్వామినాథన్ ఒక హెచ్చరిక చేశారు: ‘తమ అనుయాయులను విశ్వసించని నాయకులూ ఉన్నారు. స్వతంత్రంగా పని చేసే సేచ్ఛను వారికి ఇచ్చేందుకు ఈ నాయకులు అనుమతించరు. సైనిక క్రమ శిక్షణకు నిబద్ధమవుతారు. తమ పక్కన స్వేచ్ఛగా ఆత్మ విశ్వాసంతో ఉండేవారికి బదులుగా యాంత్రికంగా, భావావేశ రహితంగా పనిచేసే వారు తమ వెనుక ఉండాలని ఈ నాయకులు కోరుకుంటారు. వీరు ఎలాంటి అభిప్రాయ భేదాలను సహించరు స్నేహపూరిత విమర్శలను నిరసిస్తారు. ఇటువంటి వారు శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు ఒక నిస్సహయ స్థితిని వదిలి వెళతారు’. స్వామినాథన్ అదే ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: ‘సగటు స్థాయికంటే కొంచెం ఉన్నతమైన నాయకులే నేడు మనకు అవసరం. మానవాతీతుడు లాంటి ఏకైక నాయకుడు మనకు అనవసరం’.


స్వామినాథన్ ప్రసంగ పాఠాన్ని నేను ఇటీవలే ఆయన పేపర్స్‌లో కనగొన్నాను. చదివి దిగ్భ్రాంతి చెందాను. 1938లో ఆయన చేసిన హెచ్చరికలు 2022 సంవత్సరంలోని భారతదేశ రాజకీయాలకూ వర్తిస్తాయి. ఇప్పటికీ వాటి ప్రాసంగికత ఎంతో ఉంది’.


నరేంద్ర మోదీ వ్యక్తి పూజ, దాని పర్యవసనాల గురించి నేను ఇదే కాలమ్‌లో చాలా సార్లు రాశాను. ఆ వాదనలను మళ్లీ పునరావృతం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రభుత్వ నాయకుడు సంపూర్ణాధికారాన్ని చెలాయించే ధోరణులు కేంద్రంలోనే కాకుండా పలు రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా వ్యక్తమవుతున్నాయనే వాస్తవాన్ని నేను ఎత్తి చూపదలిచాను. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ, పార్ల మెంటరీ ఎన్నికలలో నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. గొప్ప ధైర్యంతో ఎదుర్కొంటారు. అయితే ఆమె రాజకీయాల శైలి స్పష్టంగా మోదీ రాజకీయాలనే పూర్తిగా తలపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్, బెంగాల్ ప్రభుత్వం, బెంగాలీ ప్రజలకు తాను ఒక తిరుగులేని అధినేత్రిగా ఆమె ఆరాధనలు అందుకుంటున్నారు. మూర్తీభవించిన అధికార స్వరూపిణిగా ఆమె వెలుగొందుతున్నారు. నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ నాయకత్వ శైలుల మధ్య పోలికలు ఇక్కడితోనే అంతం కావు. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ముఖ్యమంత్రి గురించి పిరికితనంతో కూడిన విధేయత చూపుతారు. కేంద్రంలో బీజేపీ ఎంపీలు, మంత్రులు కూడా ఇలాగే భీరువులుగా వ్యవహరించడం మనకు తెలుసు. పూర్తిగా విధేయ ఐఏఎస్, ఐపీఎస్‌లతో పనిచేసేందుకు మోదీ, మమతలు ఇష్టపడడం కద్దు. మోదీ వలే మమత కూడా పత్రికా స్వాతంత్ర్యాన్ని, సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని సమర్థిస్తారు. అయితే ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తారు. తన పాలనకు ముప్పుకలుగజేస్తాయనే భయంతో పత్రికా స్వాతంత్ర్యాన్ని, సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని ఆమె అణచివేస్తున్నారు.


పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారో అదే తమ తమ రాష్ట్రాల్లో చేసేందుకు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), పినరాయి విజయన్ (కేరళ), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కె.చంద్రశేఖరరావు (తెలంగాణ), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్) ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడుగురు ముఖ్యమంత్రులు భిన్న రాజకీయ పార్టీలకు చెందినవారు. అయితే స్వాభావికంగానూ, పాలనా శైలిలోనూ వారిది ఒకే తీరు. అది నిరంకుశత్వమే. ప్రొఫెసర్ స్వామినాథన్ నేడు సజీవులై ఉండి ఈ ముఖ్యమంత్రుల తీరుతెన్నులను గమనించి ఉంటే ఏమి వ్యాఖ్యానించే వారో స్పష్టమే. భిన్నాభిప్రాయాలను సహించరని, స్నేహపూరిత విమర్శలను తిరస్కరిస్తారని, స్వతంత్ర వైఖరితో కాకుండా యాంత్రికంగ ఆ పనిచేసే వారే తమ అనుయాయులుగా ఉండాలని కోరుకుంటారని స్వామినాథన్ తప్పక నిరసించేవారు.


గమనార్హమైన మరో విషయమేమిటంటే ఈ నాయకులు అందరూ ఒకే విధమైన నియంతృత్వ పాలకులుకారు. భిన్న రకాల నియంతృత్వాలను చెలాయిస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ, ఉత్తరప్రదేశ్ స్థాయిలో ఆదిత్యనాథ్ నియంతృత్వాన్ని మెజారిటీ వాదంతో మిళితం చేశారు. మతపరమైన మైనారిటీలను పలు విధాల పీడిస్తూ వారిపై అపనిందలు మోపుతున్నారు. మీడియాను అణచివేసేందుకు, రాజకీయ అసమ్మతివాదులను నిర్బంధించేందుకు రాజ్యాధికారాన్ని దుర్వినియోగపరచడంలో కూడా ఈ ఇరువురూ ఎటువంటి సంకోచాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. మమత, కేజ్రీవాల్ మొదలైన వారి రాజకీయాలు కూడా సొంత బలాన్ని పెంపొందించుకునేందుకు, వ్యక్తిగత అధికారాన్ని పటిష్ఠం చేసుకునేందుకు అగ్రప్రాధాన్యమిస్తున్నాయి. ఆ లక్ష్యాల సాధనకు రాజ్యాధికారాన్ని, ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవడానికి వెనుకాడడం లేదు.


సర్వోత్కృష్ట నాయకుల ఆరాధన సాధారణంగా సంపూర్ణాధికార రాజ్యాలలో వర్థిల్లుతుంది. అవి, సైనిక నియంతృత్వాలు, ఫాసిస్టు రాజ్యాలు, కమ్యూనిస్టు వ్యవస్థలు ఏవైనప్పటికీ సర్వోన్నత నాయకుల వ్యక్తిపూజ సర్వసాధారణం. ఒక వ్యక్తి, అత్యున్నత అధికార పదవిని అధిష్టించగలిగితే అతడు సకల పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తాడని, వారి సంకల్పాలను నిర్దేశిస్తాడనే విశ్వాసం ప్రజాస్వామ్య భావనకు పూర్తిగా విరుద్ధమైనది. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల తరుణంలో మన ప్రజాస్వామ్యం అంతకంతకూ నిరంకుశ ధోరణులతో వ్యవహరించే వ్యక్తుల పాలనలోకి వెళుతోంది. ఇది మనకు అన్ని విధాల హానికరంగా పరిణమిస్తోంది.


అధికారాన్ని సంపూర్ణంగా చెలాయించడం ద్వారా తమను తాము ఉన్నతీకరించుకోవడం పైనే దృష్టి నిలిపే నాయకులు అభివృద్ధి సాధన, పాలనా బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. విధాన నిర్ణయ అధికారాలను సంపూర్ణంగా స్వాయత్తం చేసుకుని, మంత్రులు, సివిల్ సర్వెంట్స్‌కు అధికారాలను అప్పగించేందుకు నిరాకరించే నాయకులు భారత్‌ను కాదు కదా, వైశాల్యం, జనాభా, వైవిధ్యంలోనూ అతి పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాన్నీ సమర్థంగా పాలించలేరు. మరింత స్పష్టంగా చెప్పాలంటే పాలనా బాధ్యతలకు వారు అనర్హులు. విధేయులు, భజనపరుల మెచ్చుకోలు మాటలకు మురిసిపోయే నాయకులు ప్రధానమంత్రులుగా లేదా ముఖ్యమంత్రులుగా విఫలమవుతారు. రాజకీయ సహచరులు, ప్రత్యర్థుల, స్వతంత్ర మీడియా సలహాలు, విమర్శలను అంగీకరించరు. వాటికి అసలు ప్రతిస్పందించనే ప్రతిస్పందించరు. మరి ఇటువంటి నాయకులు దేశ పాలకులు అయినప్పుడు జరిగేదేమిటి? మన దేశ ఆర్థిక సామర్థ్యం సంపూర్ణంగా వికసించదు మన సమాజంలో సామరస్య జీవనం అసాధ్యమవుతుంది; మన జాతీయ భద్రతకు భరోసా ఉండదు. కేంద్రంలో నియంతృత్వ ప్రధానమంత్రికి తోడు రాష్ట్రాలలో నిరంకుశ ముఖ్యమంత్రుల మూలంగా మన భవిష్యత్తు అపాయంలో పడుతుంది. వివిధ రంగాల నిపుణులతో పాటు, దేశ పౌరుల సలహాలు, సూచనలను వినేవారు, విని నేర్చుకునే నాయకులు మాత్రమే భారత్ శ్రేయస్సుకు, భారతీయుల అభ్యున్నతికి మహోదాత్తంగా దోహదం చేయగలరు. మంత్రులకు అధికారాలను బదిలీ చేసేవారు, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని, పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవించేవారు, ప్రతిపక్షాలతో నిర్మాణాత్మక చర్చలకు ప్రాధాన్యమిచ్చే నాయకులు మాత్రమే మీకూ, నాకూ, దేశానికి మేలు చేయగలరు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-06-18T06:11:27+05:30 IST