దిద్దుబాట!

ABN , First Publish Date - 2022-05-20T10:33:40+05:30 IST

స్థానిక ఎన్నికలను విజయవంతంగా జరుపుకున్నందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బుధవారం అభినందించారట.

దిద్దుబాట!

స్థానిక ఎన్నికలను విజయవంతంగా జరుపుకున్నందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బుధవారం అభినందించారట. ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నుకునే ఈ ప్రక్రియ అమోఘం, అద్భుతమంటూ ఈ సందర్భంగా ఆయన ఏవో నాలుగు మంచిమాటలన్నారు కానీ, నేపాల్ విషయంలో చైనా ఎంత శ్రద్ధగా ఉన్నదో, ఉండబోతున్నదో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఈ ఎన్నికల్లో అధికారపక్షమైన నేపాలీ కాంగ్రెస్ నాయకత్వంలోని ఐదుపార్టీల సంకీర్ణం ఘన విజయం సాధించబోతున్నదని కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చైనా అధినేత ప్రశంసలకు మరింత ప్రత్యేకత చేకూరుతోంది.


బుద్ధపూర్ణిమనాడు నరేంద్రమోదీ నేపాల్‌లో కాలూనిన తరువాత ఆ దేశంతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకొనే ప్రయత్నాలు చైనా నుంచి వేగవంతం కావడం సహజం. కేపీ శర్మ ఓలి ఏలుబడిలో అమితకాలంలోనే చైనాకు నేపాల్ దగ్గరైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానంలో నేపాలీ కాంగ్రెస్ అధినేత ఉండటం భారత్‌కు ఉపశమనం కలిగించే అంశం. నరేంద్ర మోదీ లుంబినీ చేరుకోవడానికి కొద్దిగంటల ముందే అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌతమ్ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేపాల్ ప్రధాని ప్రారంభించారు. బుద్ధపూర్ణిమనాడు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నందున అదేరోజున అతిథిగా వస్తున్న నరేంద్రమోదీ విమానం అక్కడ దిగివుంటే నేపాల్‌కు గర్వకారణమయ్యేది. అయితే, మోదీ మనదేశంలోని ఖుషీనగర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి లుంబినీలో నిర్మించిన హెలిప్యాడ్‌లో దిగారు తప్ప ఈ కొత్త విమానాశ్రయంలో అడుగుపెట్టలేదు. దాదాపు 540 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ విమానాశ్రయం భారత్ నేపాల్ సరిహద్దుకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదుదశాబ్దాల క్రితం దేశీయ విమానాశ్రయంగా దీనిని నిర్మించింది భారతదేశమే కానీ, అంతర్జాతీయ విమానాశ్రయంగా దానిని మార్చడం మాత్రం చైనా చేతుల్లో జరిగినందునే మోదీ అక్కడ అడుగుపెట్టలేదని మీడియా విశ్లేషణ. సుమారు 45 దేశాల నుంచి ఇక్కడకు వచ్చే అంతర్జాతీయ విమానాలకోసం భారత్ తన గగనతలాన్ని తెరవాలని నేపాల్ కోరుతున్నదనీ, భద్రత విషయంలో అనుమానాల వల్ల భారత్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోనందున ప్రధాని దానిని ఉపయోగించలేదని కూడా అంటున్నారు. భారత్ నేపాల్ మధ్యలో చైనా ఎంత బలంగా ఉన్నదో భైరహ్వా విమానాశ్రయం ఓ ఉదాహరణ.


నేపాల్‌తో భారత్ బంధాన్ని బలోపేతం చేయడానికి బుద్ధపూర్ణిమనాడు గౌతమబుద్ధుడి జన్మస్థలాన్ని మోదీ చక్కగానే ఎంచుకున్నారు. బౌద్ధ ఆరామాల నిర్మాణం నుంచి బౌద్ధవేడుకల నిర్వహణ వరకూ ఇప్పటికే అక్కడ చైనా మయమైనందున భారతదేశం కూడా ఒక అంతర్జాతీయ బౌద్ధ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించబోతున్నది. బుద్ధుడిపట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఉభయదేశాల ప్రజలను ఒకే కుటుంబంగా అనుసంధానిస్తున్నదని మోదీ వ్యాఖ్యానించారు. బౌద్ధం, బుద్ధుడి జన్మస్థలం ఇత్యాది అంశాల్లో భారతదేశ పాలకగణం భిన్నమైన అభిప్రాయాలు కలిగి, దుష్ప్రచారాలు సాగిస్తున్నదని నేపాలీ జాతీయవాదులు కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మోదీ తన ప్రసంగం ద్వారా నేపాలీలను శాంతపరిచారు. అదేవిధంగా, నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణమని వ్యాఖ్యానించడం ద్వారా కేపీ శర్మ ఓలీ సృష్టించిన విద్వేషాలను చల్లార్చే ప్రయత్నం కూడా చేశారు. ఇరుదేశాల పండుగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు ఇత్యాదివి ప్రస్తావించడం ద్వారా మనమంతా ఒక్కటే, మనది ఒకటే కుటుంబమని నేపాలీలకు విస్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా, పలు అవగాహనలు చేసుకోవడం, కొన్ని కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా జరిగింది. చైనాకు సన్నిహితుడిగా పేరుగాంచిన కేపీ శర్మ ఓలి కాలంలో ప్రతీ అంశమూ వివాదాస్పదమై ఇరుదేశాల మధ్యా దూరం పెరిగినమాట వాస్తవం. మోదీ ప్రధాని అయిన కొత్తల్లో భారతదేశం తమ కొత్త రాజ్యాంగ రచనలో జోక్యం చేసుకుంటోందని నేపాల్ ఆరోపించేంత వరకూ పరిస్థితి వెళ్ళింది. నూతన రాజ్యాంగంలో తమకు న్యాయం జరగలేదంటూ మాధేశీలు చేస్తున్న పోరాటానికి భారతదేశం సహకరిస్తూ చమురు, ఆహారం ఇత్యాది సరఫరాలు నిలిపివేసిందని నేపాల్ అప్పట్లో ఆగ్రహించింది. భారత్ నేపాల్ మధ్య దూరం పెరిగిన ఈ కాలాన్ని చైనా సద్వినియోగం చేసుకొని, ఆహారసరఫరాల నుంచి భారీ పెట్టుబడుల వరకూ తన పాత్ర విస్తృతం చేసుకుంది. ఇంతకాలమూ చిక్కుల్లో ఉన్న భారత్ నేపాల్ మైత్రి ఇప్పుడు ఉభయదేశాల చొరవతో కొత్త చిగురులు తొడుగుతున్నందుకు సంతోషించాలి.

Updated Date - 2022-05-20T10:33:40+05:30 IST