ఎదురుదాడి సరే, ఆత్మవిమర్శేదీ?

ABN , First Publish Date - 2022-02-09T06:46:04+05:30 IST

కొందరు ఆయన నుదుట విభూతి రేఖలు చూసి భక్తి పరవశులవుతారు. మరి కొందరు ఆయన ఊర్థ్వ పుండ్రాలను చూసి తన్మయత్వం చెందుతారు..

ఎదురుదాడి సరే, ఆత్మవిమర్శేదీ?

కొందరు ఆయన నుదుట విభూతి రేఖలు చూసి భక్తి పరవశులవుతారు. మరి కొందరు ఆయన ఊర్థ్వ పుండ్రాలను చూసి తన్మయత్వం చెందుతారు. కొందరు కేదార్‌నాథ్ గుహలో ఆయన ధ్యాన ముద్ర చూసి వినమ్రులవుతారు. మరికొందరు ఆయన కాశీ పుణ్యవాహిని గంగా నదిలో మునకలు వేసి కాలభైరవుడికి హారతి పట్టడాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతారు. ఇంకొందరు ఆయన అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి భూమి పూజలు చేయడం చూసి మైమరిచిపోతారు. ఆయన సాధారణ నాయకుడు కాడని భరత భూమిపై హైందవ మత పునరుద్ధరణ చేసేందుకు అవతరించిన అవతార పురుషుడు, తేజోమూర్తిగా భావించి ఆయన వశీకరణ శక్తిలో మునిగిపోతారు. ఆయన పావన కరస్పర్శ కోసం ఈ దేశంలో మందిరాలు, మఠాలు, విగ్రహాలు ఎదురు చూస్తుంటాయి. మఠాధిపతులు, సాధువులు, మహర్షులు ఆయన వెంట వేగంగా నడుస్తూ ఆయనను మెప్పించేందుకు తీవ్ర యత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన మీద ఈగ వాలినా ఆ ఈగ దేశ భక్తిని శంకిస్తూ దాడి చేసేందుకు వందలాది మంది అప్రమత్తంగా ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ప్రస్తావిత మహావ్యక్తి అని మరి చెప్పాలా!


స్వతంత్ర భారతదేశంలో కోట్లాది సామాన్యుల కూలిపోయిన ఆశలు, చెదిరిపోయిన స్వప్నాల మధ్య నరేంద్రమోదీ ఒక కొత్త నిర్మాణంలా, ఒక కొత్త స్వప్నంగా, ఒక కొత్త అక్షరంగా ప్రభవించారనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిణామం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వ్యతిరేకత బలంగా ఉన్న సమయంలో, ఇతర ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోతున్న సమయంలో నరేంద్రమోదీ తన ప్రతిష్ఠను పెంచుకునే అన్ని సాధనాలను ఉపయోగించుకున్నారు. హిందూత్వ విధానాలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల వైఫల్యాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అందుకే 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ గతంలో ఏనాడూ లేని విధంగా 40 శాతానికి పైగా ఓట్లు సాధించడం ప్రారంభమైంది. యూపీలో 2012లోనూ, అంతకు ముందు ఎన్నికల్లోనూ బిజెపి ఓట్ల శాతాన్ని, ఆ తరువాత సాధించుకున్న ఓట్ల శాతాన్ని పోలిస్తే పై విషయం అర్థమవుతుంది.


అయితే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వ్యక్తిగత ఆకర్షణ, ఇతర వర్గాల్లోకి చొచ్చుకుపోవడం, ప్రభుత్వ పనితీరుపై మాత్రమే మోదీ ఆధారపడలేదు. ప్రత్యర్థులను బలహీనపరచడానికి, చీల్చడానికి సామ, దాన, భేద, దండోపాయాలపై ఆధారపడవలసి వచ్చింది. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత, ఆ మరుసటి సంవత్సరం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి, అనంతరం వివిధ రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు నరేంద్ర మోదీ అనారోగ్యకరమైన, అసహజమైన మార్గాలను అవలంబించారు. క్రమంగా దేశ రాజకీయాల తీరుతెన్నులే మారిపోయాయి.


నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావస్తున్న తరుణమిది. యూపీతో సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో నరేంద్రమోదీ, ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాల భవిష్యత్ ఏమిటో చర్చించాల్సిన అవసరం ఉన్నది. మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తోంది. ఆయన ప్రభావం ఇంకా ఆవరించే ఉన్నది. ఇప్పటికీ అవే ఉపన్యాసాలు. అవే హావభావాలు. యూపీలో ఎన్నికలు జరిగినా, ఇంకెక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే ప్రధాన రాజకీయ నాయకుడు, బిజెపి తరఫున ప్రధాన ప్రచారకుడు. కేంద్రమంత్రులు ఎందరు ఉన్నా ఆయనే సకల మంత్రిత్వ శాఖల అధిపతి. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ అయినా నరేంద్రమోదీ ముందుండి దాన్ని సమర్థించకపోతే ఆ బడ్జెట్‌కు ఏ మాత్రం విలువ లేదు.


ప్రశంసల్లో మాత్రమే కాదు, విమర్శల్లో కూడా ఎవరూ తనను విస్మరించలేని పరిస్థితికి దేశ రాజకీయాలను మార్చివేయడంలో మోదీ విజయవంతమయ్యారు. దేశమంతటా తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన భక్తగణాన్ని రూపొందించుకోవడమే కాదు, ప్రతి రాజకీయ సంభాషణలోనూ తన పేరు దొర్లకుండా ఉండలేని పరిస్థితిని ఆయన కల్పించుకున్నారు. మోదీని తీవ్రంగా విమర్శించేవారు ఎంతమంది ఉన్నారో, ఆయనను అంతే ప్రగాఢంగా, గుడ్డిగా సమర్థించేవారు అంతమంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి బలం ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఏ మాత్రం బలం లేని ప్రాంతాల్లో కూడా తన పేరు చర్చల్లో ఉండేలా మోదీ చేసుకున్నారు. కాశీ కారిడార్ ప్రారంభానికి వెళ్లినా, జీయర్ స్వామి మఠానికి వెళ్లినా ఆయన ప్రతి కదలికను, ప్రతి ఉపన్యాసాన్ని జనం జాగ్రత్తగా గమనిస్తారనడంలో అతిశయోక్తి లేదు.


కాని ఈ ఉధృతి భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందా అన్నది చెప్పలేం. మోదీ, ఆయన విధానాల పట్ల వ్యతిరేకత పెరగలేదని కూడా ఎవరూ అనలేరు. ఆర్థిక విధానాలు సవ్యంగా ఉన్నాయని, ధరలు అదుపులో ఉన్నాయని, నిరుద్యోగం నియంత్రణలో ఉన్నదని కూడా చెప్పేందుకు వీలు లేదు. మోదీ నిరంకుశ, ఏకపక్ష విధానాల వల్ల ఎవరికీ అసంతృప్తి లేదని కూడా అనేందుకు ఆస్కారం లేదు. ప్రధానమంత్రి పూర్తిగా సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నారని, రాష్ట్రాలను గౌరవిస్తున్నారని ఏ ఒక్క ముఖ్యమంత్రీ చెప్పేందుకు అవకాశం లేదు. మోదీ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం లేదని ఆ సంస్థల్లో ఉన్న వారు కూడా అంగీకరించలేరు. కనుక ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇకనుంచీ జరిగేది మరో ఎత్తు. అందుకు ప్రాతిపదిక అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎంతమేరకు కనపడుతుందో చెప్పలేము. అయితే తన భవిష్యత్ అంత సాఫీగా ఉండే అవకాశాలు లేవని మోదీకి కూడా తెలుసు. ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ సంకేతాలను అందిస్తున్నాయి.


ఈ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న వారిలో శక్తిమంతంగా మాట్లాడిన ఏకైక వక్త నరేంద్రమోదీ అనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు ఎలాంటి గందరగోళం సృష్టించకుండా మాట్లాడడం మొదలు పెడితే సమాధానమిచ్చేందుకు మోదీయే రావల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మిగతా నేతలెవరూ అంత సమర్థంగా మాట్లాడలేరని అర్థమవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను తిప్పిగొట్టేందుకు మోదీ ఉభయ సభలను ఉపయోగించుకోవల్సి వచ్చింది. తడబడకుండా, సూటిగా స్పష్టంగా ప్రసంగించిన రాహుల్ భారత్‌లో రెండు దేశాలు ఉన్నాయని అన్నారు. మోదీ పాలనలో లక్షల కోట్లు సంపాదించిన గుప్పెడు మంది ఒకవర్గమైతే, కటిక దరిద్రంలో కోట్లాది కష్టజీవులు కునారిల్లుతున్నారని రాహుల్ విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజా సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మళ్లిస్తున్న తీరును రాహుల్ దుయ్యబట్టారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అన్న వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తూ నరేంద్రమోదీ ఒక చక్రవర్తిలా పాలిస్తున్నారని ఆయన ఎత్తి చూపారు.


నిజానికి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని మోదీ ప్రభుత్వం విస్మరించి ఉండేది. అయితే ఆ ప్రసంగానికి సోషల్ మీడియాలో విశేష ప్రచారం లభించింది. కేవలం అయిదు గంటల్లో కోటీ 60 లక్షలమంది రాహుల్ ప్రసంగాన్ని తిలకించడం చూసి మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. పలువురు మంత్రులు రాహుల్‌పై విరుచుకుపడ్డారు. రాహుల్‌కు ఒకప్పుడు సన్నిహితుడైన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కూడా ప్రవేశపెట్టారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి దిగి చర్చకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీపైనే తన దాడిని ఎక్కుపెట్టారు. ధారాళంగా హిందీలో ప్రసంగించడం, ప్రత్యర్థులపై బాణాలు సంధించడంలో మోదీకి దీటైనవారు మరెవ్వరూ లేరు కదా. అయితే ఆయన మాట్లాడిందేమిటి? కాంగ్రెస్‌ను దేశ ప్రజలు తిప్పిగొట్టారని, పలు రాష్ట్రాల్లో ఓడించారని చెప్పారు. ఇందులో కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఆత్మ విమర్శలో పడినప్పుడల్లా దేశాన్ని ముక్కలు, ముక్కలు చేసే ముఠా (తుకుడే తుకుడే గ్యాంగ్), అర్బన్ నక్సలైట్లు అని ఆరోపించడంలో కూడా కొత్తదనం ఏమీ లేదు. చివరకు తన పార్టీయే సమర్థించిన తెలంగాణ బిల్లును ఆమోదించిన తీరును ఆయన తప్పుపట్టడం ఆశ్చర్యకరం. ఒకోసారి అత్యంత గంభీరంగా, ఉన్నత స్థాయిలో మాట్లాడతారని పేరు తెచ్చుకున్న మోదీ రాజకీయాల విషయం వచ్చేసరికి తన స్థాయిని మరచి ఎటువంటి ఆరోపణలైనా చేయడానికి దిగజారుతారనడానికి పార్లమెంట్‌లో ఆయన తాజా ప్రసంగాలే నిదర్శనాలు.


అయినా దేశాన్ని ఎనిమిది సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా కాంగ్రెస్‌ను, అది చేసిన పాపాలను తిట్టడంలో అర్థం లేదు. ఆ పాపాలు చేసినందుకే ప్రజలు కాంగ్రెస్‌ను గద్దె దించి మోదీని అందలమెక్కించారు. తన హయాంలో తీసుకున్న నిరంకుశ, ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థలకు జరిగిన నష్టాల గురించి సమాధానం చెప్పుకోవాల్సిన మోదీ కాంగ్రెస్ ఎప్పుడో చేసిన తప్పులపై విరుచుకుపడడం అర్ధరహితం. సమస్యల గురించి మాట్లాడాల్సిన సమయంలో ఆలయాల్లో, మఠాల్లో పరిష్కారం వెతుక్కోవడం వల్ల ఎల్లవేళలా ఫలితాలు లభించవు. మైళ్లకు మైళ్లు నడిచిన వలసకార్మికులు, ఆక్సిజన్ అందక మరణించిన ప్రజలు, పెరిగిపోతున్న నిరుద్యోగులు, అధిక ధరల వాతపడిన సామాన్య జనం, కేసులు విచారణకు రాక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న నిర్భాగ్యులలో అధిక భాగం హిందువులే కదా. 


ఎ. కృష్ణారావు

వారెక్కడ పరిష్కారం వెతుక్కుంటారు?

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-02-09T06:46:04+05:30 IST