స్వేచ్ఛా ప్రస్థానంలో తెగని శృంఖలాలు

ABN , First Publish Date - 2022-08-13T07:11:11+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి కాలంలో ‘ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’ అని పదేపదే మనకు చెప్పారు.

స్వేచ్ఛా ప్రస్థానంలో తెగని శృంఖలాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి కాలంలో  ‘ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’ అని పదేపదే మనకు చెప్పారు. ‘ భారత్ వస్తు తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా రూపొందుతుందని, భారత్ అంకుర సంస్థలను సంబంధిత రంగాల భవిష్యత్తుగా ప్రపంచం భావిస్తోందని, వివిధ రంగాలలో భారత్ కార్యదక్షత ను ప్రపంచం ప్రశంసిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. 


నిజమే, ప్రపంచం భారత్ ను చూస్తోంది. అయితే అది తప్పనిసరిగా భారత్ నుంచి ఏదో నిశ్చిత మార్గదర్శకత్వాన్ని ఆశించి మాత్రం కాదు. ఈ విషయాన్ని, ఆకార్ పటేల్ కొత్త పుస్తకం ‘ప్రైస్ ఆఫ్ ది మోదీ ఇయర్స్’ ను చదవడం ద్వారా ధ్రువీకరించుకున్నాను. వివిధ అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచీలు, వాటిలో మన దేశం ఏ స్థానంలో ఉన్నదీ పటేల్ పుస్తకం వెల్లడించింది. పలు సూచీలలో భారత్ అల్పస్థానాలలో ఉంది. ప్రపంచం మన దేశం గురించి కనుగొంటున్న వాస్తవాలు ప్రధాని మోదీ చేస్తున్న ప్రకటనలకు పూర్తిగా భిన్నమైనవి. హెన్లే పాస్ పోర్ట్ ఇండెక్స్ లో భారత్ 85 వ స్థానంలో ఉండగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన దేశం 94 వ స్థానంలోనూ, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో 103 వ స్థానంలోనూ, ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో 131 వ స్థానంలోనూ ఉందని ఆకార్ పటేల్ పుస్తకం విశదం చేసింది. వాస్తవమేమిటంటే 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ సూచీలలో భారత్ స్థానం మరింతగా దిగజారిపోతూండటం! 


మన గురించి ప్రపంచం ఏమనుకుంటున్నదనేది ముఖ్యమే. అయితే మన గురించి మనం ఏమనుకుంటున్నామనేది మరింత ముఖ్యం. భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం సందర్భంగా మనలను మనం ఇలా ప్రశ్నించుకుందాం: ‘భారత్ లో ఏం జరుగుతోంది? వివిధ రంగాలలో పురోగతి ఎలా ఉంది? భారతీయులు ఎలా పని చేస్తున్నారు? రాజ్యాంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏ మేరకు సాధించాము? జాతి నిర్మాతలు ఔదలదాల్చిన ఆదర్శాలను మనం గౌరవిస్తున్నామా? మన దేశ స్వాతంత్ర్యానికి పోరాడిన వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చామా?’ 


2015లో నేను భారత్ ను ‘ఎన్నికలు మాత్రమే జరిగే ప్రజాస్వామ్యం’గా అభివర్ణించాను. ఎన్నికలు క్రమబద్ధంగా జరుగుతుంటాయని, అయితే ఎన్నికలకు ఎన్నికలకు మధ్య కాలంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు జవాబుదారీతనంతో వ్యవహరించడం లేదనేది ఆ వ్యాఖ్య అర్థం. పార్లమెంటు, మీడియా, సివిల్ సర్వీస్ మొదలైన సంస్థలు, వ్యవస్థలు తమ ప్రభావశీలతను కోల్పోయాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే అవి పని చేస్తున్నాయి. ఈ వాస్తవాల దృష్ట్యా ‘ఎన్నికలు మాత్రమే జరిగే’ అనే విశేషణానికి మన ప్రజాస్వామ్యం అర్హమైనది కాదని భావిస్తున్నాను. ఎన్నికల బాండ్ల వ్యవహారాలలో పారదర్శకత ఉందా? ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న పార్టీ కొమ్ముకాయడం లేదా? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను ప్రలోభాలకు లోను చేసి రాజకీయ స్వార్థాలు సాధించుకోవడం లేదా? మరి ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతున్నాయని, ఎన్నికల ఫలితాలను అన్ని పార్టీలు సదా గౌరవిస్తున్నాయని ఎలా చెప్పగలం? 


ఇటీవలి సంవత్సరాలలో భిన్నాభిప్రాయాలను అణచివేయడంలో భారత రాజ్యవ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారమే 2016-20 సంవత్సరాల మధ్య 24 వేల మంది భారతీయులను ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’ (ఊపా) కింద అరెస్ట్ చేశారు. వీరిలో ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు విధించారు. మీడియా సంస్థలు, పాత్రికేయులపై దాడులు మరింతగా పెరిగిపోయాయి. ఆకార్ పటేల్ తన పుస్తకాన్ని అప్ డేట్ చేస్తే ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ లో మన దేశం స్థానం 142గా కాకుండా 150గా ఉండేది. ఈ అణచివేత వాతావరణంలో ఉన్నత న్యాయవ్యవస్థ సైతం పౌరుల పక్షాన కాకుండా రాజ్య వ్యవస్థ పక్షాన ఉండడం ఎనలేని నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. 


భారతీయులు తమ రాజకీయ వ్యవహారాల్లో స్వేచ్ఛాయుతులుగా ఉన్నారని చెప్పలేము. సామాజిక వ్యవహారాలలో వారికి ఉన్న స్వాతంత్ర్యం మరీ తక్కువ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశం నుంచి నిష్క్రమించిన 75 ఏళ్ల తరువాత కూడా మన సమాజం పూర్తిగా విభిన్న స్థాయిలతో కూడిన వ్యవస్థగానే ఉంది. 1950లో భారత రాజ్యాంగం కుల, జెండర్ వివక్షలను నిషేధించింది. అయినా ఆ దురాచారాలు ఇప్పటికీ అమానుషంగా కొనసాగుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల తోడ్పాటుతో ఒక ప్రభావశీల దళిత వృత్తి నిపుణుల వర్గం ప్రభవించింది. అయినప్పటికీ సమాజ జీవితంలో కుల వివక్షలు బలీయంగా ఉన్నాయి. జెండర్ వివక్షలు కూడా అదే రీతిలో కొనసాగుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనే మొత్తం కార్మికులలో మహిళలు 20శాతానికి మించిలేరు. వియత్నాం, చైనాలను అటుంచి బంగ్లాదేశ్ కూడా ఈ విషయంలో మనకంటే మెరుగ్గా ఉంది. 


మత, సాంస్కృతిక వ్యవహారాలలో కూడా మన ‘పురోగతి’ ఉత్తేజకరంగా లేదు. వివిధ వ్యవహారాలలో ఎలా నడచుకోవాలనే విషయమై ప్రజలకు ఆదేశాలు జారీ చేసే వికృత ధోరణులు ప్రబలిపోతున్నాయి. ఏ ఆహారాన్ని తినాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడ నివసించాలి, ఏమి రాయాలి, రాయకూడదు, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయాలపై రాజ్య వ్యవస్థ, ‘నైతిక విలువల పరిరక్షణ’ నిఘా బృందాలు రెండూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి!. ముస్లింలను నానావేధింపులకు గురిచెయ్యడం మరింత ఆందోళనకర విషయం. వర్తమాన భారతదేశ రాజకీయాలు, నవీన వృత్తులలో ముస్లింలకు సరైన ప్రాధాన్యం లేదు. టెలివిజన్, సామాజిక మాధ్యమాలలో ముస్లింలపై ఎత్తి పొడుపులు, పరిహాసాలు సర్వసాధారణమైపోయాయి. దేశ చరిత్రలో ముస్లింల పాత్రను కళంకిత పరుస్తున్నారు. వారి దేశభక్తిని శంకిస్తున్నారు. ఈ వేధింపులు, వివక్షలు మన ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు. 


ఆర్థిక రంగంపై మన దృష్టిని సారిద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా సరళీకరిస్తాననే హామీతో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు వాస్తవానికి 1991 ఆర్థిక సంస్కరణలు త్యజించిన పరిరక్షణ విధానాల అమలుకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా తనకు అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తల ఆస్తుల పెరుగుదలకు మాత్రమే తోడ్పడుతున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. భారత్ లో ఒక శాతం సంపన్నులు జాతీయ ఆదాయంలో 22 శాతాన్ని కలిగి ఉండగా 50 శాతం పేదలు 13 శాతం మాత్రమే కలిగివున్నారని ‘వరల్డ్ ఇనిక్వాలిటీ రిపోర్ట్ -2022’ అంచనా వేసింది. ముకేశ్ అంబానీ 2020లో 1500 కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు కలిగివుండగా 2021 జూలై నాటికి ఆయన ఆస్తుల విలువ 8000 కోట్ల డాలర్లకు పెరిగింది. అదేకాలంలో గౌతమ్ అదానీ ఆస్తులు 1300 నుంచి 5500 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆదాయాలు, ఆస్తుల పంపిణీలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ సమాజం మరింతగా అసమానతల సమాజంగా పరిణమిస్తోంది. స్వతంత్ర భారత్ తన 75 వ సంవత్సరంలో ఉన్న పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు పట్టడం సహేతుకం కాదు. జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంస్థలను నిర్మించింది. మత, భాషాపరమైన బహుళత్వాన్ని పెంపొందించింది. వీటితో పాటు దేశీయ పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇచ్చి ఉండవలసింది. నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు ఆరోగ్య భద్రతను మరింతగా సమకూర్చి ఉండవలసింది. ఇందిరాగాంధీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థపై రాజ్య వ్యవస్థ నియంత్రణ గరిష్ఠంగా పెరిగిపోయింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచారు. భారత జాతీయ కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీగా దిగజారిపోవడానికి ఇందిరే బాధ్యురాలు. 


నరేంద్ర మోదీ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. కష్ట పడి పని చేసే రాజకీయ వేత్త. ఆరెస్సెస్ సిద్ధాంతాల స్ఫూర్తితో కూడిన మెజారిటీ వాద ధోరణులు ఆయన దృక్పధాన్ని తీర్చిదిద్దాయి. ఇవి పాలనలో పూర్తిగా ప్రతిబింబిస్తున్నాయి. జాతికి ఆయన వారసత్వంపై చరిత్రకారుల తీర్పు కఠినంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 


మన తరపున మన నాయకులు దేశ ప్రగతి గురించి గొప్పగా చెబుతున్న మాటలకు మనం మోసపోకూడదు. వారు చెబుతున్నట్టుగా ప్రపంచం మన దేశాన్ని ప్రశంసాపూర్వకంగా చూడడం లేదు. భారత్ ఓ అద్భుతమని ఎవరూ అనుకోవడం లేదు. వాస్తవాలను నిష్పాక్షికంగా చూడగల, నిశితంగా, స్వతంత్రంగా ఆలోచించగల భారతీయులు సైతం మాతృదేశం గురించి అలా భావించడం లేదు. భారత్ ఒక స్వేచ్ఛాయుత దేశమే అయినప్పటికీ భారతీయులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా స్వేచ్ఛాయుతులుగా లేదు. ఆ స్వేచ్ఛా వెలుగుల కోసం మనం మరెంతో కృషి చేయవలసి ఉంది.



రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-08-13T07:11:11+05:30 IST