పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీ ఈ నెల 29న!

ABN , First Publish Date - 2021-10-23T22:35:10+05:30 IST

కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిన్‌ను ప్రధాన మంత్రి

పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీ ఈ నెల 29న!

న్యూఢిల్లీ : కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న వాటికన్‌లో మర్యాదపూర్వకంగా కలుస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు రోమ్ వెళ్తున్న మోదీ ఓ రోజు ముందుగా, అంటే, అక్టోబరు 28న బయల్దేరబోతుండటం గమనార్హం. 


జీ-20 సదస్సు తర్వాత స్కాట్లాండ్‌లో COP26 సదస్సు నవంబరు 1న జరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ నేపథ్యంలో మోదీ బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ పాల్గొనే ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్న బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ ఎలిజబెత్ ట్రుస్ బ్రిటన్ ప్రధాని జాన్సన్ సందేశాన్ని మోదీకి తెలియజేసే అవకాశం ఉందని సమాచారం. నవంబరు 1న COP26 సదస్సులో ప్రసంగం అనంతరం సమయాన్ని కేటాయించాలని మోదీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.


జీ-20 సదస్సులో ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్‌, తైవాన్‌లపై చర్చ జరిగే అవకాశం ఉంది. తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను చక్కదిద్దడం, ఇండో-పసిఫిక్‌లో తైవాన్‌పై చైనా దూకుడు వంటివాటిపై చర్చిస్తారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తమలో తాము ఘర్షణపడుతుండటంతోపాటు కరువు వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 


Updated Date - 2021-10-23T22:35:10+05:30 IST