పారిశుధ్యం అధ్వానం

Dec 1 2021 @ 00:51AM
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, టీడీపీ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి

డ్రైనేజీల నిర్వహణ అస్తవ్యస్తం

కుక్కలు, పందుల బెడద పెరిగిపోయింది

సాధారణ నిధులు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తారా?

బలిఘట్టం డంపింగ్‌ యార్డుతో వరహా నది నీరు కలుషితం 

అధికారులు పట్టించుకోవడంలేదు

మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహంనర్సీపట్నం, నవంబరు 30: మునిసిపల్‌ అధికారుల తీరుపై అధికార, విపక్ష ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పారిశుధ్యం లోపించిందని, డ్రైనేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా వుందని, పందులు, కుక్కల బెడద నానాటికీ పెరిగిపోతున్నదని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ధ్వజమెత్తారు. అత్యవసర పనులకు వినియోగించాల్సిన సాధారణ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. 

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి అధ్యక్షతన మంగళవారం అత్యవసర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. తొలుత ఆమె మాట్లాడుతూ,  ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని, రూ.15 వేలు కడితే ఇంటిపై సంపూర్ణ హక్కులు వస్తాయన్న దానిపై అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయిలో నర్సీపట్నం మునిసిపాలిటీకి 5వ ర్యాంక్‌ వచ్చిందని తెలిపారు. తరువాత పలు వార్డుల కౌన్సిలర్లు వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 


పద్మావతి ప్రశ్నల వర్షం

తెలుగుదేశం పార్టీకి చెందిన 26 వార్డు కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, మునిసిపాలిటీలో చెత్త తరలింపునకు ఎన్ని ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు? వాటిలో అద్దెవి ఎన్ని? ప్రతి నెలా ఎంత ఖర్చు చేస్తున్నారు? రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? నామినేటెడ్‌ విధానంపై ఒక్కరికే పనులన్నీ ఎందుకు అప్పగిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిపై ప్రజారోగ్య విభాగం ఏఈ రవి సమాధానాలు ఇచ్చారు.  

9వ వార్డు కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య(జనసేన) మాట్లాడుతూ, వీధుల్లో పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వీటి గురించి మూడు నెలలుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. చైర్‌పర్సన్‌ సమాధానం ఇస్తూ.... కుక్కులు, పందుల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. 8వ వార్డు కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ(వైసీపీ) మాట్లాడుతూ, సాధారణ నిధులు ఎంత వున్నాయి? వాటిని దేనికి ఖర్చు చేస్తారు? అని ప్రశ్నించగా, సాధారణ నిధులు రూ.42 లక్షలు వుండేవని, వీటిలో రూ.35 లక్షలను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడంతో ప్రస్తుతం రూ.7 లక్షలు ఉన్నాయని అకౌంటెంట్‌ స్వర్ణమంజరి చెప్పారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... సాధారణ నిధులను అత్యవసర పనులకు ఉపయోగిస్తారని, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. పదో వార్డు కౌన్సిలర్‌ రాజునాయుడు(టీడీపీ) మాట్లాడుతూ, డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా వున్నాయని, పందులు, దోమల బెడద అధికంగా ఉందని అన్నారు. 11వ వార్డు కౌన్సిలర్‌ బేతిరెడ్డి రత్నం(వైసీపీ) మాట్లాడుతూ 10, 11 వార్డులకు కలిపి పారిశుధ్య కార్మికులు నలుగురు మాత్రమే ఉన్నారని, దీని వలన సకాలంలో పారిశుధ్య పనులు జరగడంలేదని అన్నారు. 16వ వార్డు కౌన్సిలర్‌ వీరమాచినేని జగదీశ్వరి మాట్లాడుతూ, బాంబే టైలర్‌ రోడ్డులో పెద్ద గొయ్యి ఉందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని వెంటనే పూడ్చాలని కోరారు. 18వ వార్డు కౌన్సిలర్‌ శెట్టి విజయాంబ మాట్లాడుతూ, బలిఘట్టంలో డంపింగ్‌ యార్డు కారణంగా వరహా నది నీరు కలుషితం అవుతున్నదని, డంపింగ్‌ యార్డుని అక్కడ నుంచి తరలించాలని కోరారు. 19వ వార్డు కౌన్సిలర్‌ బయపురెడ్డి చిన్నబాబు(వైసీపీ) మాట్లాడుతూ బయపురెడ్డిపాలెం, కృష్ణాపురం మధ్య రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్‌ బ్రేకర్లు వేయించాలని అన్నారు. 15వ వార్డు కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లిదొర(వైసీపీ) మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలపై ఏ చర్యలు తీసుకున్నాన్నారో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. 8వ వార్డు కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ(వైసీపీ) మాట్లాడుతూ, మునిసిపాలిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల మీద 485 కోర్టు కేసులు నడుస్తున్నాయని తెలిపారు. ప్లాన్‌లు లేకుండా నిర్మించిన భవనాలు 95 ఉన్నాయని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఫణి తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.