నష్టాల్లో చేపల రైతులు

ABN , First Publish Date - 2021-12-09T04:41:55+05:30 IST

రొయ్యలసాగే కాదు.. చేపల సాగు కూడా రైతులకు భారంగా మారింది. పెరిగిన పెట్టుబ డులకు తగ్గట్టు ఆదాయం రాకపోవడంతో వారు నష్టాల బారిన పడుతున్నారు.

నష్టాల్లో చేపల రైతులు
సాగు చేసిన ఫంగస్‌ చేపలు

ధరలు లేక దిగాలు

మోయలేకున్న మేత ఖర్చు

పెరిగిన పెట్టుబడి


ముత్తుకూరు, డిసెంబరు 8 : రొయ్యలసాగే కాదు..  చేపల సాగు కూడా రైతులకు భారంగా మారింది. పెరిగిన పెట్టుబ డులకు తగ్గట్టు ఆదాయం రాకపోవడంతో వారు నష్టాల బారిన పడుతున్నారు. వెనామీ రొయ్యల సాగు జాక్‌పాట్‌గా మారడంతో పలువురు రైతులు చేపల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఫంగస్‌, రూప్‌చంద్‌ వంటి రకాల చేపల సాగు వల్ల నష్టంలేకుండా, ఎంతో కొంత ఆదాయం సాధించవచ్చని భావించారు. అయితే ఉన్నట్లుండి చేపల ధర పడిపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. గత నెల వరకు ఫంగస్‌ చేపలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేవారు. మార్కెట్‌లో ఈ చేపలను కిలో  రూ.80 నుంచి రూ. 100లకు అమ్ముకునేవారు. కొనుగోలుదారులు అమాతం ధర తగ్గించి కిలో రూ.30లకు రైతుల వద్ద నుంచి కొంటున్నారు. దీంతో కష్టపడి సాగు చేసి దిగుబడి సాధించినా, ఫలితం కనిపించడం లేదు. 


పెరిగిన పెట్టుబడి

గతంలో సాంప్రదాయ పద్ధతిలో మేత సొంత పద్ధతిలో తయారుచేసుకుని వేసి, సాగు చేసేవారు. కాగా నేడు రెడీ మేడ్‌గా దొరికే చేపల మేతలనే రైతులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. నీటి సరఫరా కోసం ఎక్కువ ప్రాంతాల్లో డీజిల్‌ ఇంజన్లను వాడుతుండడంతో, ఆయిల్‌ ఖర్చులు పెరిగిపోయాయి. వ్యాధుల నివారణకు వాడే మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చేపల సాగు పూర్తయ్యేటప్పటికి పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. 


పడిపోయిన ధరలు

 నెల కిందట ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇదేమిటని కొనుగోలుదారులను రైతులు ప్రశ్నిస్తే.. వరుసగా వస్తున్న పండుగలు, అయ్యప్పమాల ధారణ సమయం, ఇలా పలు కారణాల వల్ల చేపల ధరలు పడిపోయాయని చెప్తున్నారు. చేపల ఉత్పత్తికి తగినంత వినియోగం దేశీయంగా లేకపోవడం వల్ల కూడా ధరలు పడిపోతున్నాయి. ఉత్పత్తి ఒక్కసారిగా ఎక్కువైన సందర్భాల్లో ధరలు పడిపోయి, రైతుల లాభదాయకత దెబ్బతింటోంది. 


Updated Date - 2021-12-09T04:41:55+05:30 IST