టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం

ABN , First Publish Date - 2022-02-11T22:30:18+05:30 IST

టాటా సన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం

న్యూఢిల్లీ : టాటా సన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు. ఈ కంపెనీ బోర్డు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ళలో ఈ గ్రూప్ కంపెనీల పరిస్థితులను ఈ సమావేశంలో సమీక్షించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.


రతన్ టాటా సిఫారసు

ఈ బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితునిగా రతన్ ఎన్ టాటా పాల్గొన్నారని, నటరాజన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ పనితీరు, అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. మరో ఐదేళ్ళపాటు ఆయన పదవీ కాలాన్ని పునరుద్ధరించాలని సిఫారసు చేశారని తెలిపింది.  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ పనితీరును బోర్డు సభ్యులు ప్రశంసిస్తూ, మరో ఐదేళ్ళపాటు ఆయన పునర్నియామకానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని పేర్కొంది. 


చాలా సంతోషం 

గడచిన ఐదేళ్ళపాటు టాటా గ్రూప్‌నకు నాయకత్వం వహించడం తన అదృష్టమని, మరో ఐదేళ్ళపాటు ఈ గ్రూప్‌నకు నాయకత్వం వహించే అవకాశం లభించడం చాలా సంతోషకరమని నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పారు. 


నటరాజన్ చంద్రశేఖరన్ హయాంలోనే ఎయిరిండియాను తిరిగి టాటా సన్స్ స్వాధీనం చేసుకుంది. ఆయన 2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో చేరారు. సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత 2017 జనవరిలో బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. 


30 ఏళ్ళ బిజినెస్ కెరీర్

టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి టాటా గ్రూప్ కంపెనీల బోర్డుల చైర్మన్‌గా నటరాజన్ వ్యవహరించారు. టీసీఎస్‌లో ఆయన బిజినెస్ కెరీర్ 30 ఏళ్ళు. విశ్వవిద్యాలయం నుంచి నేరుగా టీసీఎస్‌లో చేరారు. సాధారణ స్థాయి నుంచి సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. టాటా గ్రూప్ కంపెనీల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.  


Updated Date - 2022-02-11T22:30:18+05:30 IST