నటరత్న యన్టీఆర్ 'భట్టి విక్రమార్క'కు 60 ఏళ్ళు

Sep 28 2020 @ 22:44PM

నటరత్న యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'భట్టి విక్రమార్క' చిత్రం సెప్టెంబర్ 28తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది... ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. భారతదేశంలో పిల్లలను విశేషంగా అలరించిన జానపద కథల్లో 'భట్టి విక్రమార్క' స్థానం ప్రత్యేకమైనది.. అన్నదమ్ములైన విక్రమార్కుడు, భట్టి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'భట్టి విక్రమార్క'... ఇదే కథలోనే సుప్రసిద్ధమైన విక్రమార్కబేతాళ కథలు కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో విక్రమార్కునిగా యన్టీఆర్, భట్టిగా కాంతారావు నటించారు. విక్రమార్కుని మోసగించే మాంత్రికునిగా ఎస్వీ రంగారావు నటించగా, నాయిక పాత్రలో అంజలీదేవి, మిగిలిన పాత్రల్లో రేలంగి, గిరిజ, సంధ్య,  నాగభూషణం, మిక్కిలినేని, ముక్కామల కనిపించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చగా, కథ, మాటలు, పాటలు అనిశెట్టి అందించారు.. జంపన దర్శకత్వంలో పి.వి.వి. సత్యనారాయణమూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన 'భట్టి విక్రమార్క' తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఈ చిత్రం మదరాసులోని దాదాపు అన్ని స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. సరసు స్టూడియోస్ లో ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, అగ్నిప్రమాదం జరిగి, ఆ రోజుల్లో ఒకటిన్నర లక్షల నష్టం వాటిల్లింది. తెలుగు చిత్రసీమలో అదే పెద్ద అగ్నిప్రమాదమని ఇప్పటికీ చెప్పుకుంటారు. సినిమా విడుదలయిన తరువాత ఘనవిజయం సాధించింది. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.