మదర్సాలలో జాతీయగీతాలాపన..UP బాటలో MP

ABN , First Publish Date - 2022-05-13T23:13:56+05:30 IST

ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌ లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి...

మదర్సాలలో జాతీయగీతాలాపన..UP బాటలో MP

భోపాల్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) తరహాలోనే మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను (National Anthem) తప్పనిసరి చేయనున్నారు. ఈమేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) శుక్రవారంనాడు సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ యూపీ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారనే అనే మీడియా ప్రశ్నకు, ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని, పరిశీలిస్తామని మంత్రి సమాధానమిచ్చారు.


పాకిస్థాన్‌లో పాడమన్నామా?

కాగా, అక్కడా ఇక్కడా అని కాకుండా దేశంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ జనగణమన గీతాలాపన చేయాలని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణు దత్ శర్మ అన్నారు. ''జాతీయగీతాన్ని పాకిస్థాన్‌లో పాడమని మేము చెప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల్లోనూ విద్యాసంస్థల్లో జాతీయ గీతం పాడటం, భారత్ మాతా కీ జై నినాదాలు చేయడం జరగాలని మాత్రమే మేము చెబుతున్నాం'' అని శర్మ తెలిపారు. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని అన్ని మదర్సాలలో ఈనెల 12 నుంచి 'జనగణమన' గీతాలాపనను తప్పనిసరి చేశారు. ఈ మేరకు మే 9న అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులకు ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఆదేశాలిచ్చింది.

Read more