జాతీయ ఆరాటాలు, ప్రాంతీయ పోరాటాలు

Published: Wed, 22 Dec 2021 02:52:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జాతీయ ఆరాటాలు, ప్రాంతీయ పోరాటాలు

‘ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ విజయం సాధించకపోతే ఇక జాతీయ స్థాయిలో అధికారం కోల్పోయే క్రమం ప్రారంభమైనట్లే..’ అని ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హిందీ పత్రిక సంపాదకుడు ఒకరు చెప్పారు. బహుశా ఇదే భయంతో కాబోలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా యూపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రెండో రోజూ మోదీ ఆ రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రత్యక్షమవుతున్నారు, వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ప్రయాగ్ రాజ్‌లో మోదీ మంగళవారం 16 లక్షల మంది మహిళల స్వయంసహాయ బృందాల ఖాతాలకు రూ. వేయి కోట్లు, లక్షమంది బాలికల ఖాతాలకు రూ. 20 కోట్లు బదిలీ చేశారు. బీజేపీ కేంద్రయంత్రాంగం మొత్తం ఇప్పుడు యూపీకి మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలనుంచి బీజేపీ నేతల్ని రప్పించి ప్రతి జిల్లాలో ప్రచారరంగంలోకి దించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే లక్నోలో ప్రధాని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పదిలక్షల మందికి పైగా జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక రకంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ‘కార్పెట్ బాంబింగ్’ జరుపుతోంది.


మోదీ సేన సర్వశక్తులొడ్డి ఒక ఎన్నికలో గెలిచేందుకు ప్రయత్నించడం ఇది ప్రప్రథమం కాదు. గత మేలో పశ్చిమబెంగాల్‌లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు మోదీసేన శాయశక్తులా కృషి చేసింది. ఆ ప్రయత్నాలు విజయవంతం కాకపోయినా దాదాపు 38 శాతం ఓట్లు సాధించింది. అటు బెంగాల్, ఇటు యూపీ రెండు చోట్లా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులు ప్రాంతీయ పార్టీలే. ఒక రకంగా దేశవ్యాప్తంగా మోదీకి ప్రాంతీయపార్టీల నేతలే ప్రధాన ప్రత్యర్థులుగా మారుతున్నారు. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ యాత్రలకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడం బీజేపీ నేతలకు ఆందోళన కలిగించకపోలేదు. అంతేకాక గతంలో ఎన్నడూ లేనట్లు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అనూహ్యంగా మౌనంగా ఉండడం, జనంలోకి రాకపోవడం ప్రధానంగా బీజేపీ నేతలను కలవరపరుస్తోంది. ఆమె ఏర్పాటు చేసిన ఒకటి రెండు సమావేశాలు కూడా బ్రాహ్మణ సమ్మేళనాలే. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా అధికంగా బ్రాహ్మణులు, ఠాకూర్లు ఉన్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. యూపీలో మోదీ, అఖిలేశ్ పోస్టర్లు, కటౌట్లు తప్ప మరేవీ కనపడడం లేదు. దీనితో ప్రధాన పోటీ బీజేపీకి, సమాజ్‌వాది పార్టీకి మధ్య మాత్రమే జరుగుతున్నట్లు, మిగతా పార్టీలు వ్యూహాత్మకంగా బీజేపీ ఓట్లను చీల్చి సమాజ్‌వాదికి సహాయపడే విధంగా పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్- వామపక్ష పార్టీలు ఇదేవిధంగా సైంధవ పాత్ర పోషించడంతో ప్రధాన పోటీ బీజేపీకి, తృణమూల్‌కూ మధ్య కేంద్రీకృతమైందని, ఇదే వాతావరణం యూపీలో కూడా కనిపిస్తోందని బీజేపీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహుశా అందుకే మోదీ, అమిత్ షాలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.


స్థూలంగా దేశ రాజకీయాలను గమనిస్తే జాతీయవాదానికీ, ప్రాంతీయవాదానికీ మధ్య పోరు తీవ్రతరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ పోరు ఎటు దారితీస్తుందో చెప్పడానికి సూచిక కావచ్చు. గత మేలో పశ్చిమబెంగాల్‌ లో కనుక మమత ఓడిపోయి ఉండి ఉంటే ఈ పాటికి బీజేపీ దేశమంతటా ప్రాంతీయ పార్టీలపై స్వైరవిహారం చేసి ఉండేది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ఇంటగెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నించాలన్న వైఖరిని అవలంబిస్తున్నట్లు కనపడుతోంది. యూపీలో కనుక భారతీయ జనతాపార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ మరోసారి ప్రాంతీయ పార్టీలపై దాడి తీవ్రతరం చేస్తుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌ను చిత్తు చేయడానికి బీజేపీ వద్ద వ్యూహాలున్నాయి. కాని ప్రాంతీయ పార్టీలను చిత్తు చేయడం అంత సులభం కాదని బీజేపీకి తెలుసు. యూపీ విజయం తర్వాత జాతీయవాదం పేరుతో బీజేపీ దేశమంతటా విస్తరించేందుకు తీవ్ర యత్నాలు మళ్లీ ప్రారంభిస్తుంది. ఇప్పటికే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి తీవ్రతరమవుతుందని, జాతీయవాదం బలోపేతమవుతుందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.


జాతీయవాదానికి బీజేపీ ఇచ్చే నిర్వచనం ఎంతవరకు సరైనదన్న విషయం చర్చనీయాంశం కావచ్చు కాని దేశమంతటా విస్తరించాలన్న ఆకాంక్ష విషయంలో కాంగ్రెస్ కూడా విఫలమైంది. బహుశా ఆ ఆకాంక్షను నెరవేర్చుకునే క్రమంలోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయిందని చెప్పవచ్చు. మొత్తం దేశంలో నేతలందర్నీ వంధిమాగధులుగా, తొత్తులుగా మార్చుకోవడం, బలమైన ప్రాంతీయనేతల్ని ప్రోత్సహించకపోవడం, ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చినట్లు మార్చడం, ఢిల్లీ చుట్టూ నేతల్ని తిప్పించుకోవడం మూలంగా కాంగ్రెస్‌లో అసలు సిసలైన నేతలు లేకుండా పోయారు. కేవలం జవజీవాలు లేని జీహుజూర్ నేతలు మిగిలిపోయారు. దేశంలో ప్రాంతీయ అస్తిత్వాలు తలెత్తడానికి కారణం కాంగ్రెస్ నాయకత్వ వ్యవహార శైలే అని వేరే చెప్పనక్కర్లేదు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, యూపీ, బిహార్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ నాయకత్వాలు తలెత్తడానికి కాంగ్రెస్ అహంకార ధోరణే కారణం. ప్రాంతీయ నేతల్ని అవమానిస్తున్నకొద్దీ కాంగ్రెస్ తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కొంటూ వచ్చింది.


నిజానికి చారిత్రకంగా చూసినా భారతదేశం కేంద్రీకృత అధికారానికి అనువైన దేశం కాదు. భిన్నత్వంలో ఏకత్వం కనపడ్డా, భిన్నత్వానికి విలువ ఇవ్వకపోతే ఏకత్వం మనుగడ సాగించలేదన్న విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. రాజవంశాలు, ప్రాంతీయ రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు, మతాలు, కులాలు, వర్గాలు దేశచరిత్రలో అడుగడుగునా కీలక పాత్ర పోషించిన సందర్భాలు, మొఘల్, బ్రిటిష్ దాడులను ఎదుర్కొన్న ఘట్టాలు మనకు కనిపిస్తాయి. మౌర్యులు, గుప్తులతో సహా దేశాన్నంతా ఏలినవారు మనకు చరిత్రలో కనపడరు. మొత్తం దేశాన్ని ఏలడం తమకు సాధ్యం కాదని అనేకమంది పాలకులు గ్రహించి, వికేంద్రీకరణ ద్వారా అధికారం నిలుపుకునే ప్రయత్నం చేశారు, విభజించి–పాలించు సంస్కృతిని అవలంబించారు. కాంగ్రెస్ ఈ దేశ సంస్కృతిని గ్రహించే ప్రయత్నంలో విఫలమైనందువల్లే క్రమంగా అధికారం కోల్పోయిందేమోనన్న అభిప్రాయం కొట్టివేయదగింది కాదు. తర్వాతి కాలంలో కాంగ్రెస్ వాస్తవం గమనించి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం అనేది కుందేటి కొమ్మును సాధించడం లాంటిదే.


 గతంలో కాంగ్రెస్ చేసిన తప్పునే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోందా? ఇప్పుడు మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ అనుసరిస్తున్న పద్ధతి చూస్తుంటే అది కూడా గతంలో కాంగ్రెస్ నడుస్తున్న దారిలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాల్లో తమ పార్టీకి చెందిన ప్రాంతీయనాయకులకే అస్తిత్వం లేకుండా చేశారు. మొత్తం పార్టీని తమ నియంత్రణలో ఉంచుకుని, తమకు విధేయులైన నేతలకే పట్టం కట్టారు. రాష్ట్రాల అధికారాలను హస్తగతం చేసుకునేందుకు కేంద్రస్థాయిలో చట్టాలను చేశారు. ఈ కేంద్రీకృత అధికారం మూలంగా ప్రాంతీయ నేతల మనోభావాలు, ప్రాంతీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న విషయం మోదీ గమనించడం లేదు. ఒకప్పుడు బీజేపీలో వివిధ రాష్ట్రాలకు చెందిన హేమాహేమీలు కనపడేవారు. ఇప్పుడు వారెవరో చెప్పేందుకు వీలు లేకుండా పోయింది. ప్రాంతీయ నేతల్ని ప్రోత్సహించినందువల్లే తాను కూడా ఒక నేతగా ఎదిగానన్న విషయాన్ని మోదీ మరిచిపోయారు. తాను ప్రధానమంత్రి కాగానే గుజరాత్‌లో తన చెప్పుచేతల్లో ఉండే నేతల్ని ముఖ్యమంత్రులుగా నియమించారు. ఈ వైఖరి వల్ల గుజరాత్‌లో మాత్రమే కాదు, దేశమంతటా ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆయన యోగి ఆదిత్యనాథ్ రెక్కలు కత్తిరించే ప్రయత్నం చేశారు. ఇవాళ మోదీ శీతాకాలంలో కూడా చెమటలు పట్టేలా, గొంతు నొప్పి పుట్టేలా ప్రచారం చేస్తున్నారంటే అందుకు కారణం ఆయన సృష్టించిన పరిస్థితులే.


ప్రాంతీయ అస్తిత్వాల్ని, మనోభావాల్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గుజరాత్‌లో ప్రచారం చేస్తూ నరేంద్ర మోదీని ‘మౌత్ కా సౌదాగర్’ (మృత్యు బేహారి) అని విమర్శించారు. మణిశంకర్ అయ్యర్ లాంటి నేతలు మోదీని నీచకులానికి చెందిన నేత అన్నట్లుగా మాట్లాడారు. ఇది గుజరాతీల మనోభావాలను రెచ్చగొట్టి బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు కారణమైంది. ఇంతెందుకు? పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారం చేస్తూ మమతా బెనర్జీని ‘దీదీ, దీదీ’ అంటూ అపహాస్యం చేస్తూ వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేశారు. ఇది కూడా మమతకు అనుకూలంగా పరిణమించినట్లు రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్రమోదీ అఖిలేశ్ యాదవ్‌పై ‘లాల్ టోపీ వాలా’ అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. ‘ఈ లాల్ టోపీ వాలాలు కుంభకోణాలు చేసేందుకు, అక్రమ స్వాధీనాల కోసం, మాఫియాల కోసం, ఉగ్రవాదులను కాపాడడం కోసం అధికారం చేజిక్కించుకోవాలనుకుంటారు. ఈ ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ లాంటివి’ అని ఆయన హెచ్చరించారు. దీనికి అఖిలేశ్ సమాధానమిస్తూ ‘పెరుగుతున్న ధరలకు, నిరుద్యోగానికి, రైతులు, కూలీల దుస్థితికి, లఖీంపూర్ ఖేరీల హింసాకాండకు వ్యతిరేకంగా మా ఎర్రటోపీలు రెడ్ అలర్ట్ లాంటివి’ అని అన్నారు. యూపీ ఎన్నికలలో గెలిచినా గెలవకపోయినా ప్రాంతీయ అస్తిత్వాలను, మనోభావాలను, నాయకత్వాలను, సమస్యలను గుర్తించి ప్రజాస్వామిక, వికేంద్రీకృత పాలన కొనసాగించినప్పుడే బీజేపీ భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్లవుతుంది. లేకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే ఎదురవుతుంది.

జాతీయ ఆరాటాలు, ప్రాంతీయ పోరాటాలు

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.