Advertisement

దశల వారీగా జాతీయ విద్యావిధానం

Aug 1 2020 @ 03:08AM

కేంద్ర విద్యాశాఖ లక్ష్యం 2040.. అప్పటిలోగా ఒక్కో అంశంపై దృష్టి.. రాష్ట్రాల సహకారం లేనిదే అమలు అసాధ్యం


  • పాలసీలోని మిగతా అంశాలూ ప్రశ్నార్థకం!
  • అందుకే 20 ఏళ్ల గడువు తీసుకున్న కేంద్రం
  • అసాధ్యమేమీ కాదన్న కేంద్ర మంత్రి 
  • ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల భవిష్యత్‌పై స్పష్టత

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)తో విద్యావ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణబద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు.. ఉన్నత విద్యను బలోపేతం చేస్తూనే.. విద్యార్థి కెరీర్‌కు ఉపయోగపడేలా డిజైన్‌ చేస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాలకూ దేశంలో క్యాంప్‌సలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. అన్నింటికీ మించి ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మాతృభాషలోనే బోధనకు సిద్ధమైంది. అయితే.. ఇవన్నీ ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. విద్య అనేది ఉమ్మడి (కేంద్ర, రాష్ట్రాల) జాబితాలో ఉండటంతో.. ఎన్‌ఈపీకి రాష్ట్రాలు సహకరిస్తే తప్ప.. ఇది ఆచరణ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే.. కేంద్రం కూడా దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంది. 2040 వరకు దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించింది.


క్రమపద్ధతిలో.. దశలవారీగా

ఎన్‌ఈపీలో ప్రతిపాదిత సంస్థలు దశలవారీగా ఏర్పడతాయి. ఇందుకోసం పార్లమెంట్‌లో పలు చట్టాలు చేయాల్సి ఉన్నదని విద్యామంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 2025 కల్లా ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఎన్‌ఈపీకి అనుగుణంగా మార్పులు చేస్తారు. 2030 కల్లా 3-18 సంవత్సరాల మధ్య పిల్లలకూ నిర్బంధ విద్యను అమలు చేస్తారు. ఉపాధ్యాయ విద్యకు కొత్త ప్రణాళిక ఏర్పర్చి నాలుగేళ్ల బీఈడీని పరిచయం చేసేందుకు  2030 వరకు కాల పరిమితిని నిర్ణయించారు.


20 ఏళ్లలో పలు సంస్థలు, కమిషన్లు, కమిటీలు?

కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన సభ్యులతో అంశాలవారీగా కమిటీలు వేస్తారు. 20 ఏళ్లలో కనీసం 10-12 నూతన సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో జాతీయ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. కూడా రాష్ట్ర విద్యా కమిషన్‌లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. వివిధ సబ్జెక్టులతో కూడిన మల్టీ డిసిప్లైనరీ ఎడ్యుకేషన్‌, పరిశోధన విశ్వవిద్యాలయాలు(మెరూ) ఏర్పడతాయి. జాతీయ పరిశోధనా మండలి, టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా సాంకేతిక వేదిక(ఎన్‌ఈటీఎఫ్‌), భారతీయ భాషలను పరిరక్షించేందుకు అనువాద సంస్థలు ఏర్పడుతాయి. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో జాతీయ స్కాలర్‌షిఫ్‌ నిధిని పరిచయం చేస్తారు. ఈ సంవత్సరమే యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటుకు ప్రత్యేక చట్టం చేస్తారు. 


అమలు అసాధ్యమేమీ కాదు: పోఖ్రియాల్‌

ఎన్‌ఈపీని అమలు చేయడం అసాధ్యమేమి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్నారు. శుక్రవారం ఆయన పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘‘భాషను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దబోం. రెండు భారతీయ భాషలు తప్పనిసరి. ఇంగ్లిష్‌ మూడో భాషగా ఉండొచ్చు. విద్యార్థికి అర్థమయ్యేలా సైన్స్‌, గణితం పుస్తకాలను ఇంగ్లిష్‌, మాతృభాషలో ప్రచురించి ఇవ్వొచ్చు’’ అని ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో నెలకొన్న అయోమయంపై స్పష్టతనిచ్చారు. 3వ తరగతి నుంచే విద్యార్థికి కొత్త భాషలో చదవడం, రాయడం, చర్చించడం వంటి నైపుణ్యాలు వచ్చేలా సిలబస్‌ ఉంటుందన్నారు. సెంకడరీ స్కూళ్లలో దశలవారీగా వృత్తి విద్యను పరిచయం చేస్తామని, వాటికి ఐటీఐలు, పాలిటెక్నిక్‌ లు, స్థానిక పరిశ్రమలను అనుసంధానం చేస్తామని తెలిపారు.సింగిల్‌ స్ర్టీమింగ్‌ పరిస్థితేంటి?

విద్యార్థులు సబ్జెక్టులను ఐచ్ఛికంగా ఎంచుకోవచ్చని ఎన్‌ఈపీ చెబుతోంది. అయితే.. సింగిల్‌ స్ర్టీమ్‌ విద్యా సంస్థల్లో.. వేర్వేరు సబ్జెక్టులెలా? ఐఐటీల్లో ఇది సాధ్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐఐటీ ఢిల్లీలో హ్యుమానిటీస్‌, పబ్లిక్‌ పాలసీలున్నాయి. స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ఐఐటీ ఖరగ్‌ పూర్‌ ప్రసిద్ధి. సింగిల్‌ స్ర్టీమింగ్‌ ఉన్న విద్యాసంస్థల్లో ఎన్‌ఈపీ అమలైతే.. వాటి ప్రమాణాలు పడిపోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


విదేశీ వర్సిటీలకు ఆహ్వానం

ఎన్‌ఈపీ అమలులో భాగంగా విద్యాప్రమాణాలను పెంచేందుకు టాప్‌-100 ర్యాంకింగ్‌ ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. టాప్‌-100కు ప్రామాణికం ఏంటనేది స్పష్టం చేయలేదు. 2013లో యూపీఏ-2 సర్కారు ఇలాంటి బిల్లునే తీసుకువచ్చింది. అప్పట్లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు కేంబ్రిడ్జ్‌, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఎడిన్‌బర్గ్‌ అండ్‌ బ్రిస్టాల్‌ వర్సిటీ వంటి టాప్‌-20 విశ్వవిద్యాలయాలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం భారత్‌ లో 650 విదేశీ విశ్వవిద్యాలయాలు సేవలందిస్తున్నా.. దేశంలోని ఏదో ఒక వర్సిటీతో కలిసి సంయుక్త కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఈపీలో భాగంగా విదేశీ వర్సిటీలు వస్తాయా? అనేది అనుమానమే!


నాలుగేళ్ల డిగ్రీతో లాభాలేంటంటే?

ఎన్‌ఈపీలో డిగ్రీ విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అంటే బీకాంలో ఫిజిక్స్‌ కూడా చేయవచ్చు. ఎవరైనా ఒక సంవత్సరం చదివాక మానేసినా... డిప్లొమా సర్టిఫికేట్‌ ఇస్తారు. మూడేళ్లు చదివి, విద్యను ఆపేసే విద్యార్థికి బ్యాచిలర్‌ డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు చదివి, బ్యాచిలర్‌ డిగ్రీ తీసుకునేవారికి పరిశోధనల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


త్రిభాషా సూత్రం అమలయ్యేనా?

ప్రాథమిక విద్యలో మాతృభాషలోనే బోధన అంశం రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? కొన్ని రాష్ట్రాలు మొత్తం విద్యనే ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయించాయి. తమిళనాడులాంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. త్రిభాషా సూత్రం ఇంతకు ముందు కూడా విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో.. ఇది అమలయ్యేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.