ltrScrptTheme3

కన్నుల పండువగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

Oct 26 2021 @ 05:10AM

భారతీయ సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం  సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు సినీ ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు టాలీవుడ్‌ నుంచి ‘జెర్సీ’ ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా, ఎడిటింగ్‌ విభాగాల్లో పురస్కారాలను పొందింది. చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి, ఎడిటర్‌ నవీన్‌ నూలి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ అవార్డులు అందుకున్నారు.  ‘మహర్షి’ఉత్తమ వినోదాత్మక ప్రజాదరణ చిత్రం, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ (రాజు సుందరం) విభాగాల్లో పురస్కారానికి ఎంపికైంది. ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి అవార్డులు అందుకున్నారు. 


గతేడాది ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించిన ‘చిచోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా పురస్కారం అందుకుంది. ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయి ఉత్తమ నటుడిగా, ‘మణికర్ణిక’, ‘పంగ’ చిత్రాలకి గాను కంగనా రనౌత్‌ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.  


‘అసురన్‌’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటుడి అవార్డ్‌ అందుకున్నారు. ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రానికి విజయ్‌ సేతుపతి ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యారు. ‘ఒత్తు సెరుప్పు సైజ్‌ 7’ చిత్రం స్పెషల్‌ జ్యూరీ పురస్కారం దక్కించుకుంది. ‘విశ్వాసం’ చిత్రానికి గాను డి. ఇమ్మాన్‌ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. 


బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్‌ చిత్రంగా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలిచింది.


సత్తా చాటిన తెలంగాణ యువకులు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం నెమురగొముల గ్రామానికి చెందిన ఎర్రబోతు కృష్ణ నిర్మించిన మరాఠీ చిత్రం ‘లతా భగవాన్‌కరే’ని జాతీయ ఫిలిం అవార్డు వరించింది. స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో ఈ చిత్రం జాతీయ పురస్కారం దక్కించుకుంది. చిత్ర బృందం సోమవారం అవార్డు అందుకుంది. కరీంనగర్‌కు చెందిన నవీన్‌ దేశబోయిన దర్శకత్వం వహించారు. 


సినీ కుటుంబానికి అంకితం

ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురసారాన్ని సోమవారం ఢిల్లీలో రజనీకాంత్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా  అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఈ అవార్డ్‌ను నాలోని నటుణ్ణి గుర్తించి ప్రోత్సహించిన కె. బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య సత్యనారాయణ, స్నేహితుడు రాజ్‌ బహుదూర్‌, నా సినీ కుటుంబానికి చెందిన దర్శక నిర్మాతలు తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను’’ అని లేఖలో రజనీకాంత్‌ తెలిపారు. 


భారతీయతను ప్రతిబింబించేలా సినిమాలుండాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సామాజిక సమరసతను, నైతికతను, ప్రజల్లో బాధ్యతను పెంపొందించే విధంగా సినిమాలు ఉండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హింస, అశ్లీలతల వంటివి చూపించడాన్ని తగ్గించాలని సిని దర్శక నిర్మాతలకు సూచించారు. సోమవారం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, వైభవోపేతమైన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకూడదని, భారతీయతను ప్రతిబింబించేలా మన సినిమాలుండాలని ఆకాంక్షించారు. జపాన్‌, ఈజిప్ట్‌, చైనా, అమెరికా, రష్యా, ఆరేస్టలియాతోపాటు వివిధ దేశాల్లో భారతీయ సినిమాలకు ఎంతో ఆదరణ ఉందని చెప్పారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన విలువలు, మన సంప్రదాయాలను సినిమా వేదిక ద్వారా విశ్వవ్యాప్తం చేసేందుకు మరింత కృషి జరగాలని  అన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.