75 years: ఆ జాతీయ పతాకానికి 75 ఏళ్లు

ABN , First Publish Date - 2022-08-13T17:18:29+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు(75 years) పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆజాదీ

75 years: ఆ జాతీయ పతాకానికి 75 ఏళ్లు

                            - పంద్రాగస్టున అదే పతాకావిష్కరణ 


బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు(75 years) పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ను వైభవంగా జరిపేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. హర్‌ ఘర్‌ తిరంగా పేరిట ప్రారంభమైన అభియానలో భాగంగా రాష్ట్రంలో ఈనెల 13 నుంచి 15వరకు కోటికిపైగా జాతీయ పతాకాలను ఆవిష్కరింపదలిచారు. ఇదంతా ఒక భాగమైతే 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన అరుదైన జాతీయ పతాకం ఒకటి విజయపుర(Vijayapura) జిల్లా నాలతవాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబీకుల వద్ద పదిలంగా ఉంది. కుటుంబీకులు దీన్ని ఎంతో భద్రంగా, గౌరవప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నారు. 91 ఏళ్ల గంగాధర నరసింగరావ్‌ కులకర్ణి నివాసంలో 75 ఏళ్లనాటి అరుదైన జాతీయ పతాకం చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది. ఈ జాతీయ పతాకం తనకు ఎలా లభించిందో స్మరించుకుంటూ గంగాధర పులకిస్తున్నారు. తాను నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు అప్పటి గురువు ఆదప్ప ఎరగుంటి వద్ద అప్పట్లో నాలుగు అణాలు (పావలా) చెల్లించి జాతీయ పతాకాన్ని పొందానన్నారు. ఆగస్టు 14న అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని ఓ సంచిలో ఉంచుకుని ఇంటికి చేరుకున్నానన్నారు. తన తల్లికి ఈ జెండాను కానుకగా ఇచ్చానన్నారు. ప్రతి పంద్రాగస్టు వేళ ఇదే పతాకాన్ని తమ ఇంటిపైన ఆవిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. తమ మాతృమూర్తి 60 ఏళ్లపాటు ఈ పతాకాన్ని ఆవిష్కరించగా ఆపై దీన్ని ఓ యజ్ఞంలా కొనసాగించుకుంటూ వచ్చానన్నారు. ఈసారి మాత్రం గంగాధర వద్ద ఉన్న జాతీయ పతాకాన్ని వారి ఇంటికి బదులు సమీపంలోని పాఠశాలలో ఆవిష్కరించబోతుండడం మరో విశేషం. 


బ్యాంకు లాకర్‌లో భద్రం

సహజంగా బ్యాంకు లాకర్లలో బంగారం ఆభరణాలు, నగదు, విలువైన పత్రాలు దాచుకోవడం ఆనవాయితీ. అయితే జాతీయ పతాకం భద్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పదేళ్లుగా ధారవాడ బ్యాంకులోని లాకర్‌(Locker)లో ఉంచుతూ వచ్చారు. ఏటా పంద్రాగస్టుకు ఒక రోజు ముందే లాకర్‌ నుంచి పతాకాన్ని తీసుకుని ఊరేగింపుగా ఇంటికి రావడం, ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలకు తోడు 75 ఏళ్ల చరిత్రకల్గిన జాతీయ పతాకావిష్కరణ విజయపుర జిల్లాలో ఓ మధురఘట్టంగా మిగిలిపోనుంది. 

Updated Date - 2022-08-13T17:18:29+05:30 IST