Hosapeta: దేశంలోనే ఎత్తయిన జెండా స్థూపం

ABN , First Publish Date - 2022-08-14T17:06:34+05:30 IST

దేశ భక్తిని చాటే దిశలో అత్యంత ఎత్తయిన జెండా స్థూపం సిద్ధమవుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బృహత్‌ జాతీయ

Hosapeta: దేశంలోనే ఎత్తయిన జెండా స్థూపం

- హొసపేటలో 405 అడుగుల ఎత్తులో ఏర్పాటు

- రేపు ఆవిష్కరణ


బళ్లారి గాంధీనగర్‌(బెంగళూరు), ఆగస్టు 13: దేశ భక్తిని చాటే దిశలో అత్యంత ఎత్తయిన జెండా స్థూపం సిద్ధమవుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బృహత్‌ జాతీయ పతాకావిష్కరణకు ఏర్పాటైన ఎత్తయిన స్థూపాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయనగర(Vijayanagara) జిల్లా కేంద్రమైన హొసపేట నగరంలో దేశంలోనే అత్యంత ఎత్తయిన స్థూపం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఆవిష్కరించనున్నారు. ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దు అటారి ప్రాంతంలో 360 అడుగుల ఎత్తులో జాతీయ పతాక స్థూపం ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని బెళగామ్‌ నగరంలో 361 అడుగులు, పూణెలోని భక్తి శక్తి ప్రాంతంలో 351 అడుగుల ఎత్తులో జాతీయ పతాక స్థూపాలను నిర్మించారు. గుహవాటిలో 319.5 అడుగులు, కొల్లాపూర్‌లో 303 అడుగులు, రాంచిలో 293 అడుగులు, హైదరాబాద్‌లో 291 అడుగులు, రాయ్‌పూర్‌(Raipur)లో 269 అడుగులు, ఫారిదాబాద్‌లో 250 అడుగులు, పూణెలో 237 అడుగులు, భోపాల్‌లో 253 అడుగులు, ముంబయ్‌ నేవి ఎన్‌ఎంఎంసీలో 222 అడుగులు, కటక్‌లో 215 అడుగులు, న్యూఢిల్లీలో 215 అడుగులు, లఖ్‌నవూలో 207 అడుగులు, జైపూర్‌లో 206 అడుగులు ఉండగా, బళ్లారి నగరం హెచ్‌ఆర్‌జీ సర్కిల్లో 150 అడుగుల ఎత్తయిన స్థూపాలు ఉన్నాయి. విజయనగర జిల్లా కేంద్రమైన హొసపేట పట్టణంలోని మున్సిపల్‌ మైదానంలో నిర్మిస్తున్న 405 అడుగుల ఎత్తు గల జెండా స్థూపానికి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం శరవేగంగా పనులు చేపట్టింది. రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి రూ. 6 కోట్లు నిధులు మంజూరైన తరువాత స్థూపం నిర్మాణానికి  పూణెకు చెందిన బజాజ్‌ కంపెనీకి తయారీ బాధ్యతలను జిల్లా యంత్రాంగం అప్పగించింది. ఒకవైపు స్థూపం విడిభాగాలు తయారవుతుండగా, మరోవైపు నిర్మాణానికి పునాది ఏర్పాట్లు చకా చకా జరిగిపోయాయి. దీని ఏర్పాటు కోసం సుమారు 400 చదరపు అడుగుల మేర పునాది తవ్వి కాంక్రీట్‌ బెడ్‌ వేయడానికి  నెల రోజులు పట్టింది. పునాధి సిద్దమైన వెంటనే ఐదు భారీ లారీల ద్వారా స్థూపం విడి భాగాలను హొసపేట నగరానికి తీసుకొచ్చారు. మొత్తం 13 విడి భాగాలతో కూడిన స్థూపానికి గత నాలుగైదు రోజులుగా నిర్వరామంగా పనులు జరుగుతున్నాయి. దేశంలో ఎత్తయిన వాటిలో రాష్ట్రంలోని బెళగావి(Belagavi) నగరంలో ఉన్న 361 అడుగుల స్థూపం ఇప్పటి వరకు ఉండగా, హొసపేట పట్టణంలో నిర్మిస్తున్న 405 అడుగుల ఎత్తయిన స్థూపం దేశంలోనే ఎత్తయినదిగా నిలవనుంది. ఈ స్థూపంపై 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు గల జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం చేశారు. దీని నిర్మాణానికి  మొత్తం రూ. 5.25 కోట్లు, పునాది వేయడానికి రూ. 75 లక్షలు వ్యయం చేస్తున్నారు. జాతీయ పతాక స్థూపం ఏర్పాటుకు ప్రకృతి సహకరించడం లేదు. వారం రోజులుగా పనులు నిర్విరామంగా సాగుతుండగా గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షాలతో ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం 350 అడుగుల మేర స్థూపం పనులు పూర్తయ్యాయి. భారీ క్రేన్ల సహాయంతో నిపుణుల ఆధ్వర్యంలో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు.

Updated Date - 2022-08-14T17:06:34+05:30 IST