మహారాష్ట్ర సీఎంగా షిండే

Published: Fri, 01 Jul 2022 04:09:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహారాష్ట్ర సీఎంగా షిండే

ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌

ప్రమాణ స్వీకారాలు చేయించిన గవర్నర్‌

ఆ వెంటనే కేబినెట్‌ భేటీ.. 2 నుంచి అసెంబ్లీ

తొలిరోజు స్పీకర్‌ ఎన్నిక, బలపరీక్ష

తొలుత ప్రభుత్వంలో ఉండబోనన్న ఫడణవీస్‌

బీజేపీ అధిష్ఠానం సూచనతో డిప్యూటీగా ఓకే

షిండే, ఫడణవీస్‌లకు మోదీ, పవార్‌ అభినందనలు


ముంబై, జూన్‌ 30: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పది రోజులుగా క్షణక్షణం మారుతున్న పరిణామాలతో ఉత్కంఠను రేపిన రాజకీయ కల్లోలం గురువారం ఓ కొలిక్కి వచ్చింది. శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ శంబాజీ షిండే ముఖ్యమంత్రిగా.. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే సీఎం హోదాలో షిండే తొలి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జూలై 2, 3 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని తీర్మానించారు. తొలిరోజు సభలో స్పీకర్‌ ఎన్నిక, బలపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్‌ గత ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్‌ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడణవీ్‌సలను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, తాజా మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా షిండే, ఫడణవీ్‌సలకు అభినందనలు తెలియజేశారు.


అనూహ్యంగా పదవులు తారుమారు?

షిండే తన వర్గంతో కలిసి శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు ప్రకటించినప్పటి నుంచి.. బీజేపీ సహకారంతో రెబెల్స్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా ఊహించారు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా.. దేవేంద్ర ఫడణవీస్‌ సీఎం అవుతారని, షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్‌.. శివసేన తిరుగుబాటు నేత షిండేకు బీజేపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఆయనకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని వివరించారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన దేవేంద్ర ఫడణవీస్‌.. అనూహ్యంగా మహారాష్ట్ర తదుపరి సీఎం ఏక్‌నాథ్‌ షిండే అని ప్రకటన చేశారు. ‘‘2019లో ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి పట్టం కట్టాలని భావించారు. కానీ, శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే జీవితకాలం వ్యతిరేకించిన పార్టీల(కాంగ్రెస్‌, ఎన్‌సీపీ)తో ఉద్ధవ్‌ ఠాక్రే జతకట్టారు. మేము చేసిన పోరాటం అధికారం కోసం కాదు..! హిందూత్వ సిద్ధాంతాల పరిరక్షణకే..! మహారాష్ట్ర పరిస్థితులు మధ్యంతర ఎన్నికలకు దారితీసేలా ఉండడం.. అదే జరిగితే పడే భారాన్ని తప్పించేందుకే.. షిండే వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతిస్తున్నాం. మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) హయాంలో అవినీతి పేట్రేగింది. ఆ సర్కారులో పనిచేసిన ఇద్దరు మంత్రులు ఈడీ, అవినీతి కేసుల్లో జైలులో ఉండడమే అందుకు నిదర్శనం. షిండే ప్రభుత్వంలో నా పాత్ర ఏమీ ఉండదు. నేను ప్రభుత్వంలో భాగంగా ఉండబోను’’ అని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫడణవీస్‌కు ఫోన్‌ చేసి.. ఆయనను ప్రభుత్వంలో ఉండాల్సిందేనని సూచించారు. దీంతో ఫడణవీస్‌ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు. ఇదే విలేకరుల సమావేశంలో షిండే మాట్లాడుతూ.. సీఎం పదవిని కాదనుకుని, తనకు ఆ అవకాశం కల్పించిన ఫడణవీ్‌సకు.. సహకరించిన బీజేపీ అధిష్ఠానం, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసినట్లు వివరించారు. తనను సీఎంగా ప్రకటించిన వెంటనే గోవాలో ఉన్న తనవర్గం ఎమ్మెల్యేలకు షిండే వీడియో కాల్‌ చేశారు. ఈ విషయాన్ని న్యూస్‌ చానళ్ల ద్వారా తెలుసుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనంద నృత్యాలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఉద్ధవ్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

బుధవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాస గృహం మాతోశ్రీలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కలిశారు. వీరిలో మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్‌, సీనియర్‌ నేతలు నితిన్‌ రౌత్‌, పృథ్విరాజ్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ ఠోరాట్‌, అమిత్‌ దేశ్‌ముఖ్‌, సునీల్‌ కేదార్‌, యశోమతి ఠాకూర్‌ ఉన్నారు. తమ ప్రభుత్వం పడిపోయినా.. కలిసికట్టుగా ఉంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోరాడుతామని కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా.. షిండే సర్కారు ఏర్పాటు చేయడంపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ స్పందించారు. అది వారి వ్యక్తిగతమని.. వారంతా శివసేనలో కష్టపడి పనిచేసేవారని వ్యాఖ్యానించారు. శుక్రవారం తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరవుతానని చెప్పారు.


బీజేపీ చరిత్రే అంత: జైరాం రమేశ్‌

మహారాష్ట్రలో అధికార మార్పిడిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి.. అడ్డదారిలో అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం బీజేపీ చరిత్ర అని విమర్శించారు. ఇందుకోసం కాషాదళం గవర్నర్‌ వ్యవస్థతోపాటు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే హార్స్‌-ట్రేడింగ్‌(ఎమ్మెల్యేల కొనుగోళ్లను సాధారణంగా హార్స్‌-ట్రేడింగ్‌ అంటారు)పై కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ విధిస్తామని ప్రకటించారంటూ మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లలో బీజేపీ ప్రభుత్వాలను కూలదోసి గద్దెనెక్కిన వివరాల టైమ్‌లైన్‌ను విడుదల చేశారు. 


సతారా నుంచి సీఎం స్థాయికి నలుగురు

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నలుగురు నేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. యశ్వంతరావు చవాన్‌ ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి. ఆ తర్వాత బాబాసాహెబ్‌ భోంస్లే, పృథ్విరాజ్‌ చవాన్‌లు సీఎంగా పనిచేశారు. తాజాగా గురువారం ఈ జిల్లాకు చెందిన ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.


ఉద్ధవ్‌ది స్వయంకృతాపరాధమే!

అదృష్టాన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి. ఎవరూ అధికారం అనే తాపత్రయంతో రారు. ఇది నీకు కూడా వర్తిస్తుంది ఉద్ధవ్‌.     

- రాజ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి చీఫ్‌


రెండేళ్ల క్రితమే చెప్పాను. సీఎం పీఠాన్ని ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తే.. అది పడిపోక తప్పదని..! 1975లో జేపీ నారాయణ్‌ అదే చేశారు. అధికార అహంకారంతో ఎవరైతే విశ్వాసాన్ని వమ్ముచేస్తారో.. వారు ఏదో ఒకరోజు ఆ అధికారానికి దూరం కావాల్సిందే.     

- కంగనా రనౌత్‌, బాలీవుడ్‌ నటి


ఐటీ శాఖ నుంచి లవ్‌లెటర్‌ వచ్చింది: శరద్‌ పవార్‌

ఆదాయపన్ను(ఐటీ) శాఖ నుంచి తనకు లవ్‌లెటర్‌(నోటీసు) అందినట్లు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ వెల్లడించారు. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సందర్భంగా తాను ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులకు సంబంధించి ఆ నోటీసు జారీ అయినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్ర సంస్థల తాఖీదులు, దాడులకు ఆయన వ్యంగ్యంగా పేర్లు పెట్టడం సాధారణమే. గతంలో ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేకు ఐటీ శాఖ నోటీసులు పం పడంపైనా ఆయన ‘‘ఆదాయపన్ను శాఖ తమకు ప్రియమైన వారికి ప్రేమలేఖలు పంపు తుంది’’ అని వ్యాఖ్యానించారు. 2021లో తన సోదరుడి కుమారుడు, మాజీ ఉప ముఖ్య మంత్రి అజిత్‌పవార్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల సోదాలు జరిగిన ప్పుడు ‘‘అజిత్‌ ఇంటికి కొందరు ప్రభుత్వ అతిథులు వచ్చారు. ఆ విషయంపై నాకు ఎలాంటి చింత లేదు’’ అన్నారు. ఓ సందర్భంలో తనకు కూడా ఈడీ నోటీసులు అందాయని.. అయితే వారు పేర్కొన్న బ్యాంకుతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పారు. కాగా.. శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసుల పట్ల ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన రోజునే నోటీసులు రావడం కాకతాళీయమా? ఉద్దేశపూర్వకమా? అని ప్రశ్నించారు.


నేను ఆటోవాణ్ని.. బాలాసాహెబ్‌ రూటు వాణ్ని..!

ఏక్‌నాథ్‌ శంబాజీ షిండే..! ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. మహారాష్ట్రలో మూడు చక్రాల(శివసేన, కాంగ్రెస్‌, టీఎంసీ) మహా వికాస్‌ ఆఘాడీ సర్కారును పడగొట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒకప్పుడు బతుకుదెరువు కోసం ఆ మూడు చక్రాల ఆటోరిక్షా నడిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ అంచెంలంచెలుగా ఎదిగారు. ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్రలోని సతారాలో 1964 ఫిబ్రవరి 9న ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. షిండే చదువు కోసం ఆ కుటుంబం 1980లో థానేకు మారింది. 11వ తరగతి వరకు చదివిన షిండే థానేలో ఆటోరిక్షా తోలుతూనే ప్రజాసమస్యలపై గళమెత్తారు. శివసేన ఉద్యమాల్లో ముందుండేవారు. బెళగావి ఆందోళనలో పాల్గొని 40 రోజుల జైలు శిక్ష అనుభవించారు. 1997లో థానే మునిసిపల్‌ కార్పొరేషన్‌(టీఎంసీ) కార్పొరేటర్‌గా గెలిచారు. థానే ఎమ్మెల్యేగా షిండే వరుసగా నాలుగుసార్లు(2004, 2009, 2014, 2019) గెలిచారు. మంత్రి గానూ పనిచేశారు. హిందూత్వ అజెండా ఉండే పార్టీ.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. షిండే భార్య లతా షిండే గృహిణి. ఆయన కుమారుడు, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండే కల్యాణ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.