శివసేన అంతర్థానమే!

ABN , First Publish Date - 2022-07-01T09:36:47+05:30 IST

శివసేన అంతర్థానమే!

శివసేన అంతర్థానమే!

ఠాక్రేలు మిగిలినా.. పార్టీ మిగలదు!!

అదే దిశగా మోదీ-షా పావులు?


మహారాష్ట్ర రాజకీయ యవనికపై ఇక శివసేన కనిపించదా? దాన్ని కబళించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాష్ట్రంలో రెండు హిందూత్వ పార్టీలు అక్కర్లేదంటూ శివసైనికులందరినీ బీజేపీ తనలో చేర్చుకుంటుందా? తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేకు సీఎం పీఠం కట్టబెట్టడంలో కాషాయ పార్టీ లక్ష్యం ఇదేనా? ప్రధాని మోదీ-కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీరు తెలిసిన రాజకీయ విశ్లేషకులు ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు. 2019 అసెం బ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పోటీచేసి విజయం సాధిం చినా.. సీఎం పదవి కోసం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తమతో 30 ఏళ్ల బంధాన్ని తెంచుకుని, రాజకీయ శత్రువులైన ఎన్సీపీ, కాంగ్రె్‌సతో చేతులు కలిపి మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సర్కారును ఏర్పాటు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని మోదీ-షా శివసేన ఉనికే లేకుండా చేయాలను కుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే భుజంపై తుపాకీ పెట్టి సగం సాధించారని చెబుతున్నాయి. షిండే వర్గం మద్దతుతో అధికారం చేపట్టే అవకాశం ఉన్నా.. ఆయనకే సీఎం పదవి ఇవ్వడం అందరినీ విస్మయపరచింది. శివసేనలో మిగిలేది మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మాత్రమేనని.. ఆ పార్టీ పూర్తిగా షిండే చేతుల్లోకి వచ్చేలా చేయడం.. బీజేపీలో విలీనం చేసుకోవడమే మోదీ-షా ఎత్తుగడ అని విశ్లేషిస్తున్నాయి.


చీలిస్తే సరిపోదు!

బీజేపీ దేశవ్యాప్త విస్తరణే ఎజెండాగా మోదీ-షా పనిచేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఈశాన్య భారతంలో బీజేపీ సొంతంగా అసోం, త్రిపుర, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అధికారంలోకి రావడం.. మేఘాలయ, నాగాలాండ్‌ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామి కావడం.. సిక్కిం అసెంబ్లీలో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండడం.. పాలక సిక్కిం క్రాంతి మోర్చా ఎన్డీయేలో భాగస్వామి కావడం గమనార్హం. కాంగ్రె్‌సను, ప్రాంతీయ పార్టీలను చీల్చి సొంతగా అధికారంలోకి రావడం.. లేదంటే ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి సం కీర్ణంలో చేరడం వంటి ఎత్తులను కమలనాథులు అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన 1989 నుంచి విశ్వసనీయ మిత్రపక్షాలుగా ఉన్నాయి. బాలాసాహెబ్‌ ఠాక్రే ఉన్నం తవరకు శివసేన ఆధిపత్యమే కొనసాగింది. బీజేపీ రెండో స్థానంలో ఉండేది. బాల్‌ఠాక్రే స్థానంలో వచ్చిన ఉద్ధవ్‌ ఠాక్రేకు రాజకీయ పట్టులేదు. అయినా పార్టీని ఒంటిచేత్తో నడిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి మోదీ ప్రధాని అయ్యాక మహారాష్ట్రలో బీజేపీ బలాన్ని పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీచేశాయి. బీజేపీ 122 స్థానాలు సాధించి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఫడణవీస్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 63 స్థానాలు సంపాదించిన శివసేన అన్యమనస్కంగానే ప్రభుత్వంలో చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. 105 స్థానాలు సాధించి బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది. శివసేన 55 స్థానాలకే పరిమితమైంది. సీఎం పదవిపై పేచీతో బీజేపీకి ఉద్ధవ్‌ దూరమయ్యారు. పవార్‌, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో శివసేన కీల క నేతలపై మోదీ ప్రభుత్వం ఈడీని ప్రయోగించింది. ఎన్సీపీ మంత్రులు అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌ జైలుపాలయ్యా రు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఆయన బంధుమిత్రుల ఆస్తులను ఈడీ జప్తు కూడా చేసింది. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చింది. 40 మంది ఎమ్మెల్యేలతో శివసేన సీనియర్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శంభాజీ షిండే తిరుగుబాటు చేశారు. మూడింట రెం డొంతుల మంది ఆయన వైపు ఉంటే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. సీఎం షిండే బలపరీక్ష సమయంలో విప్‌ జారీ చేస్తే మిగిలిన 15 మంది ఎమ్మెల్యేలూ ఆయనకే మద్దతి వ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కుమారుడు ఆదిత్య తప్ప ఎవరూ ఉద్ధవ్‌తో మిగిలే అవకాశం లేదు. 19 మంది లోక్‌సభ సభ్యుల్లోనూ 14 మంది షిండే వైపే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. శివసేన మొత్తాన్నీ షిండే కైవసం చేసుకుంటే ఉద్ధవ్‌ ఏం చేస్తారు? కొత్త పార్టీ పెట్టి దాన్ని సంస్థాగతంగా నిర్మించుకోవడం ఆయనకు సాధ్యం కాదని సేన నేతలే అంటున్నారు. అంటే ఠాక్రేల ప్రాబల్యం పడిపోయినట్లే!      - సెంట్రల్‌ డెస్క్‌


షిండేపై ‘హిందూత్వ’ వల

షిండే శివసేనలో జనాకర్షక నేత. ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. సేన నేత ఆనంద్‌ దిఘే అడుగు జాడల్లో నడిచి, ఆయన మరణానంతరం థానేలో గట్టిప ట్టు సంపాదించారు. బాల్‌ ఠాక్రేను ఛగన్‌ భుజ్‌బల్‌, నారాయణ్‌ రాణే వంటి శక్తిమంతులైన నేతలు ధిక్కరించినా శివసైనికులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఎన్సీపీ, కాంగ్రె ్‌సలతో ఉద్ధవ్‌ కలవడం షిండేకు ఇష్టం లేదు. సేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పసిగట్టిన ఫడణవీస్‌.. మోదీ-షాకు చెప్పారు. వారి నిర్దేశం తోనే షిండేపై వల విసిరారని సేన నేతలు అంటున్నారు. బీజేపీ అనుకున్నట్లుగా పార్టీని చీల్చిన షిండే.. ఫడణవీస్‌ సీఎం అయితే తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అయితే ఆయన షిండేకే ఏకంగా సీఎం పదవి ఇచ్చారు. బాల్‌ఠాక్రే పెట్టిన పార్టీని తాము చీల్చలేదని, హిందూత్వకు దూరమైన ఉద్ధవ్‌ను శివసైనికులే వదిలించుకున్నారని ప్రజలకు చాటేందుకే మోదీ-షా ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షిండేతో శివసేనను బీజేపీలో విలీనం చేయిస్తారని భావిస్తున్నారు.


ధిక్కారమున్‌ సైతుమా..!

మోదీ-షాను ధిక్కరిస్తే అణచివేతతో సరిపెట్టరని పార్టీలు/నేతల ఉనికే లేకుండా చేస్తారని శివసేన విషయంలో మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు. గురువైన ఆడ్వాణీనే మోదీ వదల్లేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీలోని పాతతరం నాయకులను వదలించుకునేందుకు 75 ఏళ్లకు పైబడినవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారు. మిత్రపక్షాలను సైతం చీల్చి ఆయా రాష్ట్రాల్లో సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు చేశారు. హరియాణాలో మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ కుమారుడు ఓంప్రకాశ్‌ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీని భూస్థాపితం చేశారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ చీలికలోనూ మోదీ హస్తం ఉంది. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని జనతాదళ్‌ (యు)ను మట్టి కరిపించేందుకు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ఉపయోగించుకున్నారు. ఎన్డీయే నుంచి ఎల్జేపీ వైదొలగి జేడీయూ పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లోనే బరిలోకి దిగడంతో ఆ పార్టీకి బాగా నష్టం జరిగింది. సీఎం పదవిని నితీశ్‌కే ఇచ్చినా ఆయన్ను నియంత్రిస్తున్నారు. చిరాగ్‌ చిన్నాన్న పశుపతి పరస్‌ ద్వారా ఎల్జేపీని చీల్చారు.

Updated Date - 2022-07-01T09:36:47+05:30 IST