జాతీయ భద్రత నయా దేశభక్తులు

ABN , First Publish Date - 2021-03-05T06:32:16+05:30 IST

ఒకవినూత్న దేశభక్తి ఇప్పుడు ఈ దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ‘నేను దేశ భక్తుడిని’అని బిగ్గరగా చాటి చెప్పడానికి మాత్రమే...

జాతీయ భద్రత నయా దేశభక్తులు

ఒకవినూత్న దేశభక్తి ఇప్పుడు ఈ దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ‘నేను దేశ భక్తుడిని’అని బిగ్గరగా చాటి చెప్పడానికి మాత్రమే అది పరిమితం కావడం లేదు. ఇతరుల దేశ భక్తికి సర్టిఫికెట్లు కూడా ఇస్తోంది! దానితో పాటు ‘జాతి-వ్యతిరేకులు’అనే ముద్ర ఇతరులపై వేసే హక్కును కూడా తనకుతానే ఇచ్చుకొంటోంది. ‘జాతి-వ్యతిరేకి’కి ఈ దేశ భక్తులు ఇచ్చిన నిర్వచనం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి పూర్తిగా వర్తిస్తుంది. ఈ దేశభక్తి సృష్టిస్తున్న కొత్త పదాలు, పదబంధాలు నిఘంటువులలోకి కూడా ఎక్కుతున్నాయి సుమా! ‘తుక్డే తుక్డే గ్యాంగ్’, ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’, ‘లూట్యెన్స్ లాబీ’, అర్బన్ నక్సల్’, ఆందోళన్ జీవి’ మొదలైనవి ఆ కొత్త పదాలలో కొన్ని మాత్రమే. చూస్తుంటే ఒక వర్గం వారు దేశభక్తిని స్వాయత్తం చేసుకొని గుత్తాధిపత్యం వహిస్తున్నట్టుగా ఉంది. 


ఈ కొత్త దేశభక్తి నిర్వచనం ప్రకారం నేను దేశభక్తుడిని కాను. మరి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తుండే నేను దేశభక్తుడిని ఎలా అవుతాను? అవును, నేను దేశభక్తుడిని కాను, ఒప్పుకొంటున్నాను. అలాగే నేను ‘తుక్డే తుక్డే గ్యాంగ్’, ఇంకా ఇతర దేశభక్తి ఎంత మాత్రం లని బృందాలకు చెందిన వాడినని కూడా ఒప్పుకుంటున్నాను. ఇక నేను చెప్పదలుచుకున్న విషయాలను చెబుతాను. వాటిలో అత్యంత సున్నితమైన అంశంతో ప్రారంభిస్తాను. పుల్వామా ఘాతుకం (2019, ఫిబ్రవరి 14) చోటు చేసుకుని రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ విషాద ఘటనను గుర్తు చేసుకున్నాం. ఆ కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించాం. రెండు సంవత్సరాల క్రితం సంభవించిన ఆ ఉగ్రదాడి దేశ ప్రజలను కలచివేసింది. ప్రతీకారంతో రగిలిపోయింది. పాకిస్థాన్ లోతట్టు ప్రాంతంలోని బాలాకోట్‌లో గల ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై మన వాయుసేన వీరోచిత, సాహసోపేత దాడితో పలువురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో, పుల్వామాపై మన ప్రతీకారం తీరింది. జాతి సంతృప్తి చెందింది. దేశ ప్రజలు కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మళ్ళీ పాలనా పగ్గాలు అప్పగించారు. 


బ్రహ్మరహస్యమూ ప్రశ్నకు అతీతం కాదు కదా? అసలు పుల్వామా దాడి సంభవించేందుకు ఎలా అనుమతించారన్న సందేహం ఎంతో మందికి కలిగింది. వారంతా తమ సందేహాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. అయితే ఇది జాతి-వ్యతిరేకుల బాధ్యతా రాహిత్యమని ఆ సహేతుక ప్రశ్నను కొట్టి వేశారు. గూఢచార వర్గాల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం అన్న ఆరోపణలో నిజం లేదని పలువురు వాదించారు. ఈ వాదనతో ఏకీ భవిస్తున్నవారు ఎంతో మంది లేరు. బాలాకోట్ వైమానిక దాడులు దేశ ప్రజలను దేశ భక్తి ప్రపూరిత భావో ద్వేగాలకు లోను చేశాయి. నిజానిజాలను ప్రశ్నించడాన్ని జాతి మరచిపోయిందనే చెప్పాలి. ఆ దురదృష్టకర ఉగ్రవాద దాడికి సంబంధించిన కొన్ని వాస్తవాలను ఇటీవల ‘ఫ్రంట్ లైన్’ మ్యాగజైన్ విలేఖరి ఆనందో భక్తో బహిర్గత పరిచారు. పుల్వామా దాడి నిజానిజాలను తెలుసుకునేందుకు ఆయన ఏడాది పాటు కశ్మీర్‌లో గడిపారు. నిశిత శోధనతో వాస్తవాలను కనుగొన్నారు. ఆనందో భక్తో వెల్లడించిన వాస్తవాలు మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. 


‘పుల్వామా’ లాంటి ఉగ్రదాడి సంభవించే అవకాశాలున్నాయని గూఢచార వర్గాలు కనీసం 11 సార్లు హెచ్చరించాయి. ఆ 11 ఇంటెలిజెన్స్ నివేదికలూ ‘చర్యతీసుకోదగిన’ (యాక్షనబుల్) నివేదికలే కావడం గమనార్హం. ‘చర్య తీసుకోదగిన’ నివేదిక అంటే నిర్దిష్టమైన నివేదిక. దానిపై చర్య తప్పనిసరిగా తీసుకోవలసివుంటుంది. మరి ఈ నివేదికలపై చర్య తీసుకోవడాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 


పుల్వామా ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన ఆరోపణ గుర్తుందా? ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలావాడు ఒక దొంగ) అని రాహుల్ అన్నారు. ఈ ఆరోపణను మోదీ ఎలా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారో చూడండి. ‘అవును, నేను చౌకీదార్ నే’ అని ఆయన ఒప్పుకున్నారు. ‘అయితే ఈ జాతికి నేను కాపలా వాడిని సుమా. పుల్వామా పై ప్రతీకార దాడులకు ఆదేశించడం ద్వారా జాతి ప్రయోజనాలను ఎలా రక్షిస్తున్నానో మీరు గమనించలేదా?’ అని నరేంద్రమోదీ చతురంగా ప్రశ్నించారు. మోదీ తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ‘చౌకీదార్’అనే పదాన్ని 106 సార్లు; ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని 24 సార్లు ఉపయోగించారని, ‘పాకిస్థాన్’ను 16 సార్లు ప్రస్తావించారని, అయితే ఆ ప్రసంగాలలో ‘అభివృద్ధి’ అనే మాటను కేవలం 31 సార్లు మాత్రమే ఉపయోగించారని ఆనందో భక్తో వెల్లడించారు. పుల్వామా ఘటనను ఎన్నికల ప్రయోజనాలకు మోదీ ఎంతగా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకున్నారు. 


ఈ విషయాలు దిగ్ర్భాంతి పరుస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా కలవరపరుస్తున్నాయి. వీటిపై ప్రజల్లోనూ, పార్లమెంటులోనూ చర్చ జరిగి తీరాలి. ఎన్నికల ప్రయోజనాలకు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ఉపయోగించుకోవడం దేశభక్తి ప్రపూరితమే అయినప్పుడు, జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై సందేహాలు వ్యక్తం చేయడం దేశ ద్రోహ కార్యకలాపం ఎలా అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు వేసేవారిపై ‘గోడి మీడియా’ (ఈ హిందీ పదానికి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలతతో వ్యవహరించే మీడియా అని అర్థం చెప్పవచ్చు) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుందనడంలో సందేహం లేదు. 


2020 జూన్ 15న గల్వాన్ లోయలో మన భూభాగాలను సంరక్షించడంలో చైనీస్ సైనికులతో జరిగిన బాహా బాహీలో ఒక కమాండింగ్ ఆఫీసర్‌తో సహా ఇరవై మంది వీర జవానులు మరణించారు. ఆసేతు హిమాచలం ఆగ్రహంతో ఊగిపోయింది. అయితే నరేంద్ర మోదీ ప్రశాంతంగా ఉండిపోయారు! ఆయన తానే స్వయంగా ప్రవచించిన ‘ఘర్ మే ఘస్ కార్ మరేంగే’ (శత్రువును అతని భూభాగంలోనే దెబ్బ తీయడం) అనే సూత్రాన్ని మరచిపోయారు. గల్వాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు బీజింగ్ పాలకులతో ఎంతో ఓర్పుగా దశల వారీగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎన్ని విడతల చర్చల జరిగినా చాలా పరిమితమైన ఫలితాలు మాత్రమే సిద్ధించాయి. గల్వాన్ లోయలో వాస్తవంగా ఏమి జరిగిందన్న విషయమై దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం నిజాలు చెప్పడం లేదు. చైనా సైన్యం మన గల్వాన్ లోయలో పలు ప్రాంతాలను ఆక్రమించుకుని అక్కడే తిష్ఠ వేసిందదని విశ్వసనీయమైన వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మరి ‘శత్రువును అతని భూ భాగంలోనే దెబ్బతీయడమనే’ మోదీ సూత్రం ఏమయింది? చైనా విషయంలో ఆయన దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టలేదు? బలహీనులనేకానీ, శక్తిమంతులను డీ కొనడంలో ఆ సూత్రాన్ని వర్తింప చేయరా? లేక ఆ సూత్రాన్ని ఆచరించడమనేది సార్వత్రక ఎన్నికల సందర్భంలో మటుకే జరుగుతుందా?


పుల్వామా ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసినందుకు ఆనందో భక్తో అభినందనీయుడు. ఈ దేశ ప్రజల కృతజ్ఞతకు ఆయన పాత్రుడు. ఇప్పటికీ సమయం మించి పోలేదు, పుల్వామా దాడిపై స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించడం మంచిది. పుల్వామా ఘాతుకం చోటు చేసుకునేందుకు ఎందుకు అను మతించారనే విషయాన్ని తెలుసుకునే భారత ప్రజలకు ఉన్నది. గల్వాన్‌లో మన భూభాగాలు ఇంకా ఏమేరకు చైనా ఆక్రమణలో ఉన్నాయో ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి.

యశ్వంత్ సిన్హా

మాజీ కేంద్ర మంత్రి

(‘ఎన్‌డిటీవీ.కామ్‌’ సౌజన్యం)

Updated Date - 2021-03-05T06:32:16+05:30 IST