జాతీయ సంఘీభావం

ABN , First Publish Date - 2020-12-08T06:30:27+05:30 IST

పన్నెండు రోజులుగా దేశరాజధాని నగరాన్ని ముంచెత్తి, సడలని దీక్షతో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా మంగళవారం నాడు భారత్ బంద్ జరగనున్నది...

జాతీయ సంఘీభావం

పన్నెండు రోజులుగా దేశరాజధాని నగరాన్ని ముంచెత్తి, సడలని దీక్షతో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా మంగళవారం నాడు భారత్ బంద్ జరగనున్నది. దాదాపు జాతీయ ప్రతిపక్షాలన్నీ బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రసమితి రైతాంగ ఉద్యమానికి సంఘీభావం చెప్పడమే కాక, బంద్‌లో క్రియాశీలంగా పాలుపంచుకుంటామని ప్రకటించింది. పార్లమెంటు ఇటీవలే ఆమోదించిన చట్టాల ఉపసంహరణ కోసం రైతులు ఆందోళన చేయడం, దానికి ఇంతగా ప్రజల మద్దతు, రాజకీయ పక్షాల మద్దతు సమకూరడం ఇటీవలి కాలంలో చెప్పకోదగిన విశేషాలు. చట్టాల రద్దుకు ససేమిరా అంటున్నప్పటికీ, కేంద్రప్రభుత్వం రైతుసంఘాల నాయకులతో దఫదఫాలుగా చర్చిస్తున్నది. రైతులకు భరోసా ఇవ్వడానికి కావలసిన విధంగా చట్టాలలో కొన్ని సవరణలు చేయడానికి, అందుకు వెంటనే పార్లమెంటును సమావేశపరచడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవడం తప్ప తమకేదీ సమ్మతం కాదని రైతులు కరాఖండీగా చెబుతున్నారు.


దేశమంతటికీ వర్తించే చట్టాలకు కేవలం కొన్ని ప్రాంతాల నుంచే వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతున్నదన్న ప్రశ్న రావడం సహజం. నిజానికి, ఈ చట్టాల గురించిన ముందస్తు చర్చ ఏదీ దేశంలో జరగలేదు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ యంత్రాంగాలు ఒకేరకంగా లేవు. రైతుల ఆత్మవిశ్వాసం, ఉద్యమ సన్నద్ధతలు కూడా ఏకరూపంలో లేవు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త చట్టాలలోని నిబంధనలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కొన్ని చోట్ల మద్దతు ధరలు, ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలపై ఇప్పటికే నిస్పృహతో ఉండి ఉండవచ్చు. ఇంత పెద్ద వ్యవసాయ దేశంలో స్పందనలు ఒకే రకంగా ఉంటాయని ఆశించలేము. నిర్దిష్ట పరిస్థితులలో చట్టాలలోని అంశాల వర్తింపు ఎట్లా ఉన్నప్పటికీ, చట్టాల సారాంశం మాత్రం యావత్ వ్యవసాయరంగానికి వివాదాస్పదమైన భవితవ్యాన్ని అందించేదే. కొన్ని రాష్ట్రాలలో ఆరు శాతం మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వ మార్కెట్‌యార్డ్‌ల ద్వారా అమ్ముడుపోతూ ఉండవచ్చు. పంజాబ్‌లో మాత్రం అక్కడి మండీవ్యవస్థ ద్వారానే 90–-95 శాతం పంట విక్రయాలు జరుగుతాయి. మద్దతు ధర అక్కడ కీలకం. రైతులు తమ ఫలసాయాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చునంటున్న చట్టం, రైతును వ్యాపారిని సమాన స్థాయిలో నిలిపే హామీ ఏమీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం భరోసా ఇచ్చే వ్యవస్థ పోయి, మార్కెట్‌శక్తులకే ధరల నిర్ణయాన్ని వదిలేస్తే, అది అంతిమంగా రైతునే నష్టపరుస్తుంది. ఇప్పటికే నష్టపోతున్న వ్యవసాయదారుడు మరింత అధికంగా నష్టపోతాడు. ఇంత చిన్న అంశం ప్రభుత్వానికి అర్థం కావడం లేదేమిటని రైతులు విస్తుపోతున్నారు.


ఇటువంటి చట్టాలు చేయడానికి కావలసిన పార్లమెంటరీ బలం జాతీయ అధికారపార్టీకి ఉన్నది. సకల ప్రతిపక్షాలు నీరసపడి ఉన్నాయి. న్యాయస్థానాలలో కూడా వెనువెంటనే దిద్దుబాట్లు జరుగుతాయన్న నమ్మకం ఉండడం లేదు. పాలక చర్యలకు మౌనం, సమ్మతి విస్తృతంగా లభించే సమాజం ఉన్నప్పుడు ప్రభుత్వాలకు ఏ చట్టం తేవడానికైనా పెద్దగా సంకోచాలు ఉండవు. చట్టాలకు వ్యక్తమవుతున్న అసమ్మతి క్రమంగా అణగారిపోతుంది లెమ్మని ప్రభుత్వం భావించింది. మిత్రపక్షం వైదొలగినా, పెద్దగా ఖాతరు చేయలేదు. కానీ, నాలుగు నెలల నుంచి పంజాబ్, హర్యానా రైతులు వ్యక్తం చేస్తున్న నిరసనలు, చివరకు రాజధానిలో పరాకాష్ఠకు చేరాయి. లాఠీలు ఝళిపించినా, నీటి ఫిరంగులు మోగినా సంకల్పం సడలలేదు. సమస్య తేలేవరకు ఢిల్లీ వదిలివెళ్లబోమని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దారుణమైన చలి. వీధి నివాసం, దారులపైనే వంటలు. 


రైతులు తమ ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చుకోగలరో తెలియదు కానీ, మన్నుతిన్న పాముల వలె ఉన్న ప్రతిపక్షాలకు కొంత చలనాన్ని అందించాయి. హథ్రాస్ సంఘటనకు కూడా మందకొడి స్పందనే ఇచ్చిన అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు రోడ్డెక్కారు. విజయానికి దగ్గరగా వెళ్లి ప్రతిపక్ష స్థానంతోనే సరిపుచ్చుకున్న తేజస్వి యాదవ్ అప్పుడే ఉద్యమశంఖం పూరించారు. బిహార్‌లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో సంస్కరణలు ఎప్పుడో తెచ్చాము, మా రాష్ట్రాన్ని చూస్తే కేంద్రచట్టాల వల్ల నష్టమేమీ లేదని తెలుస్తుంది- అని వాదిస్తున్న ముఖ్యమంత్రికి కొత్త సవాల్ ఎదురవుతున్నది. బిహార్ చట్టాన్నే ప్రశ్నించడం మొదలయింది. ఇక బెంగాల్లో తృణమూల్, కశ్మీర్‌లో గుప్కార్ కూటమి, తమిళనాడులో డిఎంకె, తమ ఉనికి ఉన్న అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. మద్దతు ఇస్తాను, బంద్ చేయను అని మమతా బెనర్జీ, నాలుగు గంటల పాటే బంద్ పాటిస్తామని కెసిఆర్, పరిపాలకులుగా తమ పరిమితులను చాటుకున్నారు. 

వ్యవసాయ చట్టాలపై తమ వ్యతిరేకతను తెలంగాణ రాష్ట్రసమితి మునుపే వ్యక్తం చేసినప్పటికీ, క్రియాశీల ఆందోళనలకు దిగడానికి తాజాగా హైదరాబాద్ ఎన్నికలలో ఎదురైన ఫలితాలు కారణం ప్రభుత్వం ఆందోళనకారులతో సంప్రదింపుల మార్గాన్నే అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ, ప్రభుత్వానికి సమర్థకులుగా భావించేవారు కొందరు ఆందోళనకారుల మీద సామాజిక మాధ్యమాలలో తీవ్రమైన దుష్ర్పచారం చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ ఐటి సెల్ నిర్వాహకుడు ఉద్యమంపై దురభిప్రాయం కలిగేలా పెట్టిన దృశ్య సందేశాన్ని ఆ సామాజిక మాధ్యమమే తప్పు పట్టిన సంగతి తెలిసిందే. రైతులలో ఎక్కువ మంది తలపాగాలు ధరించి ఉన్నందున వారిని ఖలిస్థాన్ తీవ్రవాదులని, మారువేషాల్లో ఉన్న ముస్లిములని, అకారణంగా ఆందోళన చేస్తున్నారని నిందిస్తూ అనేక పోస్టులను గుప్పిస్తున్నారు. ప్రతి ప్రజా ఉద్యమానికి మసి పూసే ధోరణి ఈ మధ్య పెరుగుతున్నది. దీన్ని ఎంత మాత్రం అనుమతించకూడదు.

Updated Date - 2020-12-08T06:30:27+05:30 IST