జాతీయభావం పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-08-10T05:23:07+05:30 IST

ప్రతీ ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఇంటింటా పండుగ వాతావరణం నెలకొనాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

జాతీయభావం పెంపొందించాలి
కలెక్టరేట్‌లో జాతీయ పతాకాలను విడుదల చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, కలెక్టర్‌

- వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ

గద్వాల క్రైం, ఆగస్టు 9 : ప్రతీ ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఇంటింటా పండుగ వాతావరణం నెలకొనాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్షతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతీ ఇంటికి జాతీయ జెండాలు చేరేలా చూడాలని సంబంధిత అఽధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. గ్రామ స్ధాయిలో పంచాయతీ కార్యదర్శి, మునిసిపాలిటీ పరిధిలో వార్డు అధికారులతో జెండాలను పంపిణీ చేయాలని చెప్పారు. అనంతరం 31వ వార్డు నల్లకుంటలో ఇంటింటికి వెళ్లి జెండాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో విద్యార్థుల కోసం గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న శ్రీనివాస్‌ థియేటర్‌కు ఎమ్మెల్యే, కలెక్టర్‌ వెళ్లి పరిశీలించారు. సినిమా చూసిన తర్వాత విద్యార్థులను వాహనాల్లో సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


జాతీయ జెండాలు పంపిణీ

గద్వాల : వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను అందించారు. వాటిని గ్రామాల్లో ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు రవీంద్ర, చెన్నయ్య, ఏపీవో శివజ్యోతి, నాయకులు రమేష్‌నాయుడు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం

గద్వాల టౌన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరూ భాగ స్వాములు కావాలన్నారు. పట్టణంలోని 31వ వార్డు లింగంబావి కాలనీలో కలెక్టర్‌ శ్రీహర్ష, ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌లు ఇంటింటికీ తిరిగి జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన గద్వాల జ్యువెలరీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గట్టు ఈశ్వరయ్య వారికి భగవద్గీత పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఎండీ బాబర్‌, కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, మురళి, నాగిరెడ్డి, మహేష్‌, కృష్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయిశ్యాం రెడ్డి పాల్గొన్నారు. 


మానవపాడు : మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో రమణారావు మంగళవారం జాతీయ జెండాలను అందజేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 


అలంపూర్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అలంపూర్‌ పట్టణంలోని మంగళవారం తొమ్మిదవ వార్డులో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, కమిషనర్‌ నిత్యానంద్‌ ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంపై తహసీల్దార్‌ సుభాష్‌నాయుడు, ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీడీవో సూరి, పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ సూరి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సంబంధిత అధికారులు జెండాను ఎగురవేశారు. హరిత టూరిజం హోటల్‌పై మేనేజర్‌ శ్రీనివాస్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో దేవరాజు, లలితమ్మ, రమేశ్‌,  శ్రీనివాసులు, శ్రీను పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-10T05:23:07+05:30 IST