నత్తనడకన మన ఊరు-మన బడి

ABN , First Publish Date - 2022-08-17T05:24:02+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకొచ్చిన మన ఊరు- మనబడి పథకం పనులు మెదక్‌ జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి

నత్తనడకన మన ఊరు-మన బడి
అధ్వానంగా కౌడిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలోని కిచెన్‌ షెడ్డు

మెదక్‌ జిల్లాలో వేధిస్తున్న నిధుల సమస్య

అనేక పాఠశాలల్లో మొదలు కాని పనులు !!


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, ఆగస్టు16: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకొచ్చిన మన ఊరు- మనబడి పథకం పనులు మెదక్‌ జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా నాణ్యమైన విద్యా, విద్యార్థుల సంఖ్య పెంపు, హాజరుశాతం పెంపు వంటి అంశాలతో పాటు కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. ఇక అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. దశల వారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని అమలు చేయాలి. తద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థాన్ని పెంచాలి. ఇవన్నీ జరగాలంటే విద్యార్థులు చదువుకోవడానికి వసతి, సౌకర్యాలతో పాటు అనువైన వాతావరణం ఉండాలి. వీటన్నింటి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఆ పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్లలో కరెంట్‌ పనులు నడుస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లలో ఈజీఎస్‌ ద్వారా పనులు నడుస్తున్నాయి. ఇంకా కొన్ని స్కూళ్లకు నయా పైసా రాకపోవడంతో పనులు మొదలు పెట్టలేదు. మంజూరైన నిధుల విడుదల కోసం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. 


మెదక్‌ జిల్లాలో మొదటి విడత 313 స్కూళ్ల ఎంపిక 

మెదక్‌ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలకు నిధులు విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. ఆయా చోట్ల పనులు జరుగుతున్నాయని ఢంకా భజాయిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మెజార్టీ స్కూళ్లలో పనులు మొదలు కాలేదు. చాలా స్కూళ్లలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. మెదక్‌ జిల్లాలోని 21 మండలాల్లో 624 ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 148 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా వీటిలో మొదటి విడత 313 పాఠశాలలను మన ఊరు- మన బడి పథకం కింద ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, కిచెన్‌ షెడ్లు, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, తాగునీటి వసతి, కరెంట్‌ సౌకర్యం పనులు కల్పించేందుకు మొత్తం రూ.53 కోట్లతో అంచనాలు రూపొందించి పంపించారు. 


విడుదల కాని నిధులు 

పాఠశాలల్లో చేపట్టే పనులను రెండు రకాలుగా విభజించారు. రూ.30 లక్షల లోపు విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. రూ.30లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టాలి. విద్యుదీకరణ, తాగునీటి వసతి కల్పన, కిచెన్‌ షెడ్ల నిర్మాణం వంటి రూ.30 లక్షల లోపు  విలువైన పనులు 250 స్కూళ్లలో ఉండగా, వాటిలో 190 పనులు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి అన్ని చోట్ల పనులు జరగడం లేదు. కొన్ని చోట్ల పనులు మొదలైనా..నత్తనడకన నడుస్తున్నాయి. ఇక 50 స్కూళ్లలో రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు చేపట్టాల్సి ఉండగా అవి ఇంకా మొదలు కాలేదు. రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రాథమిక పాఠశాలలో కాంపౌండ్‌ వాల్‌, సంపు, టాయిలెట్స్‌, ఎలక్ర్టికల్‌ వర్క్‌ చేసేందుకు రూ.7 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు కాలేదు. నిధుల కోసం ఎదురుచూస్తున్నామని, నిధులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ప్రతి రోజు బ్యాంకు వెళ్లి వస్తున్నామని పలు పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. నిజాంపేట ప్రాథమిక పాఠశాలలో వివిధ పనులు చేపట్టేందుకు రూ.86 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ పనులు జరగడం లేదు. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో 4 అదనపు తరగతి గదులు, కిచెన్‌, తాగునీరు. ఎలక్ర్టికల్‌ పనుల కోసం రూ.21.45 లక్షలు మంజూరయ్యాయి. కానీ నిధులు విడుదల కాక పనులు మొదలు కాలేదు. 


రూ.2 కోట్ల నిధులను విడుదల చేశాం  

- రమేష్‌, డీఈవో, మెదక్‌

మన ఊరు-మన బడి పథకం కింద జిల్లాకు రూ.2 కోట్లు నిధులు వచ్చాయి. వాటిని ఆయా పాఠశాలలకు విడుదల చేశాం. ఒక స్కూల్‌కు రూ.10 లక్షలు మంజూరు అయితే అందులో 5 లేదా 10 శాతం నిధులకు విడుదల చేస్తాం. మొత్తం నిధులను ఒకే సారి విడుదల చేయలేము. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో సర్పంచులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్లు బిజీ కావడం, వర్షాల వలన పనులలో కొంత జాప్యం జరగొచ్చు. పనులలో వేగం పెంచుతాం. పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని స్కూళ్లలో ఈజీఎస్‌ ద్వారా కూడా పనులు జరుగుతున్నాయి. 






Updated Date - 2022-08-17T05:24:02+05:30 IST