నట్టేట ముంచిన నాసిరకం

ABN , First Publish Date - 2021-10-27T04:47:58+05:30 IST

నాసిరకం మిరప విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి.

నట్టేట ముంచిన నాసిరకం
పూత, కాయ లేని పంటను చూపుతున్న కురువ మంజునాథ్‌

  1. పంట ఏపుగా పెరిగినా కనిపించని పూత, కాయ
  2. దిక్కుతోచని స్థితిలో మిరప రైతులు
  3. ఆదుకోవాలని డిమాండ్‌

ఆదోని, అక్టోబరు 26: నాసిరకం మిరప విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. ఈ సారైనా దిగుబడి బాగా వస్తుందని ఆశించిన అన్నదాతల ఆశలను నీరుగార్చాయి. హొళగుంద గ్రామంలో మూడు నెలల క్రితం రైతులు చాగిలి వీరేశ్‌, చాకలి మల్లికార్జున, కురువ మంజునాథ్‌తోపాటు మరికొందరు ఓ కంపెనీకి చెందిన మిరప విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. నర్సరీలో నారు పెంచారు. ఈ ముగ్గురు ఆరు ఎకరాలతోపాటు మరికొందరు రైతులు తమ పంట పొలాల్లో మిరప పంట సాగు చేశారు. ఎరువులు, రసాయనిక మందులకు కలిపి ఎకరాకురూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. మిరప పంట బాగా ఏపుగా రావడం చూసి ఈ సారి అప్పులన్నీ తీరుతాయని ఆశించారు. అయితే సాగు చేసి మూడు నెలలైనా పూత, కాయలేకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారం క్రితం విత్తనాలు ఇచ్చిన షాపు ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. అయితే సంబంధిత షాపు యజమాని ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం ఇస్తామని, అంతకు మించి తాము ఏం చేయలేమని చెప్పాడు. దీంతో రైతన్నలు తమకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. 


రెండు ఎకరాల్లో సాగు చేశాను

రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. విత్తనాలు, మిరప మొక్కల కోసం రూ.40 వేలు ఖర్చు పెట్టాను. ఎప్పుడూ లేని విధంగా పంట పచ్చగా ఉండడం అందుకు ఎరువులు వేసి రసాయనిక మందులు పిచికారి చేశాం. రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినా పూత, కాయలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.

-కురువ మంజునాథ్‌, రైతు, హొళగుంద


Updated Date - 2021-10-27T04:47:58+05:30 IST