Advertisement

చొక్కా తొడుక్కోడు.. చెప్పులు వేసుకోడు...

Jan 24 2021 @ 11:00AM

తంగేడు పొదల మధ్య సన్నని కాలిబాటలో నడుస్తుంటే, దూరంగా ఆకుపచ్చని అభయారణ్యం మధ్య ఎర్ర పెంకుల ఇండ్లు అక్కడక్కడా మోదుగ పూలగుత్తుల్లా మెరుస్తుంటాయి. వాటి చుట్టూ వెదురు కర్రలతో ఫెన్సింగ్‌, వాటికి అల్లుకొని కాకర చిక్కుడు తీగలు, పక్కనే వేప, ఇప్ప చెట్లు. రాళ్ల నేలలో పలుగు, పారతో మొలకు చిన్న గుడ్డ చుట్టుకొని నిటారుగా నడుస్తుంటాడు నల్ల తుమ్మ చెట్టులాంటి ‘సోడి గంగ’. 


సోడి గంగ జీవితం గిరిజన గూడేలకు వచ్చే వైద్యులకు ఆసక్తి కలిగిస్తోంది. వాళ్లు ఆయన్ని పిలిపించుకుని... తినే తిండి, నిద్ర, జీవనశైలి, వ్యాపకాలు.. అన్నీ అడిగి మరీ తెలుసుకుంటుంటారు. గంగ జీవితాన్ని, ఆయన బతికే తీరును చూస్తే ఎవరైనా ఆనందపడాల్సిందే.. 


తెలంగాణలో కొత్తగూడెం నుండి 70 కిలో మీటర్లు వెళ్లి, మోకాళ్ల లోతు వాగు దాటితే లక్ష్మీదేవిపల్లి మండలంలో క్రాంతినగర్‌ తండా కనిపిస్తుంది. అక్కడ సుమారు వంద గడప లుంటాయి. ఈ ప్రాంతం అభయారణ్యం లోపల ఉండటంతో విద్య, వైద్యం, విద్యుత్‌ వంటి కనీస అవసరాలు అందుబాటులో ఉండవు. మూడు దశాబ్దాల క్రితం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ అడవులను ఆసరా చేసుకొని స్ధిర పడిపోయారు. వారికి తెలుగు, గోండు, కోయ భాషలు తెలుసు. 


ఎలా ఉంటాయో తెలీదు 

క్రాంతినగర్‌ తండా వాసి, సోడి గంగ వయస్సు 70 ఏళ్లకు పైమాటే. అయినా ఉత్సాహంగా రోజూ ఆరు కిలో మీటర్లుకు పైగా నడుస్తాడు. ఉదయం తన రెండు ఎకరాల పొలంలోకి వెళ్లి రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి చేరు కుంటాడు. అడవుల్లో తేనె, తునికిపండ్ల కోసం మైళ్ల దూరం నడుస్తుంటాడు కానీ, ఎంత ఎండ ఉన్నా చెప్పులు వేసుకోడు. ‘‘పొలం పనిలో పాదాలకు రాళ్లు గుచ్చుకుంటాయని ఒకసారి చెప్పుల జత తెచ్చినా ఇంత వరకు వాటి వైపు చూడలేదు... ఇప్పటి వరకు బస్సు ఎక్క లేదు.’’ అంటాడు గంగ బంధువు లక్ష్మణ్‌ . 


అతడికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు ఆడ పిల్లలు. ఎవరూ చదువుకోలేదు, అందరూ వ్యవసాయ పనులు, అటవీ ఫలసాయం మీద  ఆధారపడి బతుకుతుంటారు. 


కొండా కోనల్లో నడిచీ, నడిచీ అతడి అరి పాదాలు కింది భాగం అట్టలు కట్టి, చిన్న ముళ్లు కూడా గుచ్చుకోనంత దృఢంగా మారాయి. వర్షం వస్తే తడుస్తాడు తప్ప గొడుగు కూడా వేసుకోడు. శీతాకాలపు చలిలో చలిమంటల పక్కన తన కుటుంబంతో కాసేపు గడుపుతాడు తప్ప వంటి మీద చొక్కా వేసుకోడు. గొంగలి కప్పుకోడు. ఎందుకిలా అంటే? అలా ఉండటం అల వాటయి పోయిందని నవ్వుతాడు గోండు భాషలో. 


గంగ ఎర్రబియ్యం పండించుకొని తింటాడు. వరి విత్తనాలు సొరకాయ బుర్రల్లో దాచుకొని పంటలు పండిస్తాడు. నారు కాకుండా విత్తనాలు వెదజల్లి సాగు చేస్తాడు. రసాయన ఎరువులు వాడడు. సహజ ఎరువులే ఉపయోగిస్తాడు. పశులు, గొర్రెల వ్యర్థాలను పొలంలో చల్లుతాడు. చీడ పీడలకు వేప కషాయాలు వాడతాడు. వర్షాధార పంటలు కాబట్టి పెద్దగా దిగుబడి రాదు. కూరగాయలు పండించుకుంటాడు. 


గోంగూర పులుసు, చీమల పచ్చడి... 

ఇక్కడ ప్రతీ ఇంటి చుట్టూ చింత, వేప, ఇప్ప చెట్లు ఉంటాయి. గంగ ఆహారపు అలవాట్లు ఆసక్తిగా ఉంటాయి. వేడి అన్నంలో, తాళింపు లేకుండా చింతపండు పులుసు పిసికి కలుపుకొని తింటాడు. వారానికి నాలుగు సార్లయినా గోంగూరను ఉడకబెట్టుకొని కొద్దిగా కారం చల్లుకొని అన్నంతో భుజిస్తాడు. ఈ కూరల్లో వంట నూనె అసలు వాడడు. వానాకాలంలో ఎర్ర చీమలను పచ్చడిలా నూరుకొని తినడం అలవాటు. ఈ ప్రాంతంలో చాలా మంది గిరిజనుల సంప్రదాయ ఆహారం అది. 


వైద్యులేమంటారు? 

‘‘సోడి గంగకు ఇప్పటికీ బీపీ, షుగర్‌ లేవు. పొలంపనుల్లో చిన్న గాయాలు తగిలితే, మా దగ్గరకు వస్తుంటాడు... అవే గాయాలు తగ్గాలంటే నగర జీవులకు రెండు వారాలు పడుతుంది. ఇతడికి నాలుగు రోజుల్లోనే బాగవుతాయి. కాలిన గాయాలు కూడా చాలా త్వరగా మానిపోతాయి. ఇతడిలో రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇక్కడ కోవిడ్‌ సమస్యలు కూడా పెద్దగా లేవు. దానికి కారణం వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు...’’ అంటారు డాక్టర్‌ కపిల్‌ శర్మ. ‘ఇండిజీనస్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ తరపున కపిల్‌తో పాటు డా.నరేందర్‌, డా.అర్చన, డా. స్వాతి ఇక్కడ విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. సోడి గంగను ‘‘చొక్కా వేసుకోవు, చెప్పులు తొడుక్కోవు.. నువ్వింత ఆరోగ్యంగా ఎలా వున్నావు’’ అనడిగితే...


‘‘నన ఇంకే వెరీ గోలి, సూది యెత్మకి. బాస్కెగిర్‌ యడకి వాతేకి వుంది రెండ్‌ దీయన్‌ కమిఅంత...’’ (ఇంత వరకు మందు గోలి కానీ, ఇంజక్షన్‌ కానీ తీసుకోలేదు. ఎన్నడూ జ్వరం కూడా ఎరగను...) అని గోండు భాషలో నవ్వుతూ చెబుతాడు గంగ. 

ప్రకృతిలో బతికితే ప్రతిమనిషీ ఇలా ఆరోగ్యంతో బతుకుతాడనేందుకు గంగ నిదర్శనం. 

- శ్యాంమోహన్‌, 

94405 95858


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.