ప్రకృతి సోయగం... గాంధారి ఖిల్లా

ABN , First Publish Date - 2021-02-26T03:56:21+05:30 IST

దట్టమైన అడవి ప్రాంతంలో గుట్టలను తొలచి నిర్మించిన గాంధారిఖిల్లా ఒక అద్భుత కట్టడం. అలనాటి రెడ్డి రాజుల చరిత్రకు, సంస్కృతిక వైభవానికి అద్దం పట్టే కోటలోని శిల్ప సంపద అందర్ని ఆకట్టుకుంటుంది. రాతి ద్వారాలు, సొరంగమార్గాలు, మూడు సముతుల బావి ఇలా ఎన్నో ప్రత్యేకతలు గాంధారిఖిల్లాలో ఉన్నాయి. ఈ ఖిల్లాను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సం దర్శించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి మోక్షం లభించడం లేదు.

ప్రకృతి సోయగం... గాంధారి ఖిల్లా
గాంధారి ఖిల ముఖద్వారం

నేటి నుంచి మైసమ్మ జాతర

ప్రకృతి ఒడిలో అద్భుతమైన కళారూపాలు 

పర్యాటక రంగానికి మోక్షమెప్పుడు  


మందమర్రిటౌన్‌, ఫిబ్రవరి 25: దట్టమైన అడవి ప్రాంతంలో గుట్టలను తొలచి నిర్మించిన గాంధారిఖిల్లా ఒక అద్భుత కట్టడం. అలనాటి రెడ్డి రాజుల చరిత్రకు, సంస్కృతిక వైభవానికి అద్దం పట్టే కోటలోని శిల్ప సంపద అందర్ని ఆకట్టుకుంటుంది. రాతి ద్వారాలు, సొరంగమార్గాలు, మూడు సముతుల బావి ఇలా ఎన్నో ప్రత్యేకతలు గాంధారిఖిల్లాలో ఉన్నాయి. ఈ ఖిల్లాను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సం దర్శించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి  మోక్షం లభించడం లేదు. బొక్కలగుట్ట సమీపంలో రాష్ట్రీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఖిల్లా ఉంది. ఖిల్లాను రెడ్డి రాజులు నిర్మించారని సమీప గ్రామ పెద్దలు చెబుతుంటారు. ఎత్తైన గుట్టపై శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఖిల్లాలో అడుగడుగునా అద్భుతమైన కళాకృతులు దర్శనం ఇస్తుంటాయి. ఆదివాసీ నాయకపోడ్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. ఇటీవల ప్రభుత్వం జాతరకు సంబంధించి రూ.5 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ సారి గుట్ట వరకు మెరు గైన రోడ్డు సౌకర్యం ఏర్పాటుచేశారు. మంచిర్యాల జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ ఖిల్లాను అభివృద్ధి చేయాలని ఆదివాసీ నాయకపోడ్‌ నాయకులు చెబుతున్నారు. జాతర జరిగే మూడు రోజులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం ఖిలాను సందర్శించి వన భోజనాలు చేస్తుంటారు. రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న మైసమ్మను దర్శించుకుని పక్కనే ఉన్న పార్కులో వన భోజనాలు చేస్తుంటారు. పర్యాటక కేంద్రంగా చేస్తే రాష్ట్రానికే ఖిలా తలమానికంగా మారనుంది. జాతరకు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఎంఎల్‌సీ పురాణం సతీష్‌ హాజరు కానున్నారు. 

-గాంధారిఖిలా చరిత్ర..

 రెడ్డి రాజులు ఇక్కడ నివసించేవారని, కాకతీయుల దాడులను తట్టుకోలేక వారు ఇక్కడకు పారిపోయి వచ్చి స్ధావరాలు ఏర్పాటు చేసుకున్నారని పూర్వీకులు చెబుతుంటారు. గుట్టల మధ్య వ్యవసాయం కోసం చెరువులు కూడా ఏర్పాటు చేశారు. వారి విలువైన వస్తువులను భద్రంగా ఉంచేందుకు కొండలను కూడా తొలిచారు. గుట్టపైకి నడిచేం దుకు వీలుగా మెట్లను ఏర్పాటు చేశారు. కొండలపైన ఉన్న బండలకు ఆంజనేయుడు, కాలభైరవుడు, మైసమ్మ తల్లి విగ్రహాలను చెక్కారు. మైసమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించేవారని చెబుతుంటారు. పండించిన పంటలను విక్రయించేందుకు వీలుగా గుట్టల మధ్యనే సంత  ఏర్పాటు చేసుకున్నారు. ఖిలాపై వివిధ ఔషధాల మొక్కలు కూడా ఉన్నాయి. ఖిలాకు రక్షణగా  కాపలా ఉండేందుకు రెడ్డి రాజులు ఏర్పాటు చేసుకున్న స్ధావరాలు ఇంకా ఉన్నాయి. కొండపైన మూడు బావులను నిర్మించగా వీటిని సముతుల బావులని పిలుస్తుంటారు. తాగునీటి కోసం 4 గుంటల స్థలంలో నిర్మించిన బావి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. గుట్ట లోపల 12 శిరస్సుల నాగుపాము విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పట్లోనే బోగం మహిళల కోసం ప్రత్యేకంగా బోగం గుల్లను  ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఇంకెన్నో అద్భుత కళా ఖండాలు దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం గాంధారి మైసమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖిలాకు వెళ్లే దారిలో గాంధారి వనం ఏర్పాటు చేశారు. ఇందులో ఖిలాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక చెరువును తవ్వి బోటింగ్‌, నక్షత్రాల వనం కూడా ఏర్పాటు చేశారు. పాలవాగు ఒడ్డున గతంలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని ఆధునీకరించారు. పిల్లల పార్కులు, జింకల వనం పార్కులను కూడా ఏర్పాటు చేశారు. 800 ఎకరాల స్థలంలో ఈ పార్కు ఉంది. ఈ పార్కు కూడా ఖిలాకు వెళ్లే వారు ఇక్కడ విడిది చేస్తుంటారు. 


Updated Date - 2021-02-26T03:56:21+05:30 IST