నవ వేదాంతి – నవ సంస్కర్త

ABN , First Publish Date - 2021-01-12T06:27:51+05:30 IST

నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది’, ‘మేలుకో.. విజయం సాధించేవరకు విశ్రమించకు’ అనే...

నవ వేదాంతి – నవ సంస్కర్త

సందేశంతో వందేళ్లుగా యువతరంలో ఉత్సాహం రగిలిస్తున్న చైతన్యమూర్తి స్వామి వివేకానంద. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశ ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయన. చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామీజీ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగం చేయలేదు. భారతదేశంలో వర్థిల్లుతున్న మతస్వేచ్ఛ గురించి సకల మానవాళికి ఆయన వివరించారు. ఆధ్యాత్మికవేత్తగా, లౌకికవాదిగా వివేకానందుడు అనుసరించిన బాట నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. 


దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరంలో వచ్చిన వివేకానందుడి జయంతి సందర్భంగా ఆ ఇద్దరుమహనీయుల మధ్య భావ సారూప్యాన్ని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. దేశం భిన్న సంస్కృతుల సమ్మేళనమని, అన్ని మతాల మనోభావాల్ని అర్థం చేసుకుని సకల జనులు సమైక్యతతో జీవనం సాగించాలని పీవీ బలంగా విశ్వసించారు. వివేకానందుడి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన బోధనల నుంచి తాను అర్థం చేసుకున్న అంశాల్ని సందర్భోచితంగా యువతకు, దేశ ప్రజానీకానికి వివరించారు. రాజకీయాల్లో, తన ఆధ్యాత్మిక జీవనంలో పీవీ అనుసరించిన మార్గాన్ని గమనిస్తే, వివేకానందుడి బోధనలు పీవీని ఎంతగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. 


కులమతాలకు అతీతంగా దేశమంతా ఒక్కటే అనే సందేశాన్ని స్వామీజీ చాటి చెప్పారు. దేశంలోని విభిన్న మతాల్ని, సర్వధర్మ సమభావనతో చూడటమే వివేకానందుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. ఆయన బోధనలు, సందేశం పీవీకి శిరోధార్యమైనవి. స్వమత ఆచరణ, పరమత సహనం, లౌకికవాదం, ఉదారవాదంలో వివేకానందుడిని పీవీ స్ఫూర్తిగా తీసుకున్నారు. దేశానికి వెన్నెముక వంటి యువత స్వామీజీ సందేశాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆయన చెప్పేవారు. ‘వివేకానందను మతవాదిగా చిత్రీకరించడం దురదృష్టకరం. ఆయన దేనిని వ్యతిరేకించారో, దానికే ప్రతీకగా ఆయన్ని కొందరు చిత్రీకరించడం దురదృష్టకరం’ అని 1994 జనవరి 7న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద విగ్రహావిష్కరణ సందర్భంగా పీవీ అన్నారు.  ‘వివేకానందుడు నిజమైన ఉదారవాది. సత్యాన్వేషణ ద్వారా ప్రపంచానికి బోధనలు చేశారు. ధ్యానంలోనే కాకుండా మానవ సేవలోనూ దైవత్వాన్ని కనుగొనవచ్చని ఆయన నిరూపించారు’ అని పేర్కొన్నారు. 


‘భారతీయ సంస్కృతిలోని విభిన్నతే భారతీయులకు నిజమైన గురువు. విభిన్న సంస్కృతుల నిలయమైన భారతీయ సమాజం నుంచే ఎంతో నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోకుండా ఒకే చోట ఉండిపోయేవాళ్లు కూపస్థ మండూకాలే’ అని పీవీ అనేవారు. సన్యాసం స్వీకరించిన వాళ్లు ఎప్పుడూ ఒకేచోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లో సంచరించేందుకు కారణం కూడా సమాజాన్ని అధ్యయనం చేయడం కోసమే అని ఆయన వివరించేవారు. మనిషి మనిషిలోనూ భిన్నత్వం ఉంటుంది. ప్రపంచంలో ఏ మనిషీ అచ్చంగా ఇంకో మనిషిలా ఉండడు. గొంతూ ఒకేలా ఉండదు. ఇది దేవుడి సృష్టి. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేమా...? పిల్లలకు చిన్నప్పటి నుంచే మతం పట్ల దురభిమానం నేర్పించడం మానుకుని, భారతీయ సంప్రదాయమైన సహనశీలతను బోధించాల్సిన అవసరముంది. అన్ని మతాలూ సత్యమే అని స్వామీజీ ప్రవచించారు. అన్ని మతాలు సత్యమే అయినప్పుడు కలహాలు ఎందుకు? మతం అనేది జీవన విధానంలో చాలా ముఖ్య విషయమని, ఇలాంటి అంశంపై విభేధాలు సృష్టించడం సరికాదని పీవీ నిక్కచ్చిగా చెప్పారు. మతాల మధ్య గోడలు ఎందుకు కడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాలు చెప్పని అంశాల్ని మతాల పేరు మీద ఎందుకు బోధిస్తున్నారని పీవీ నిలదీశారు. 


‘గుడి, మసీదు, చర్చి, బౌద్ధ క్షేత్రం, గురుద్వారా– ఎక్కడికయినా వెళ్లొచ్చు. వెళ్లి మనం పొందిన స్ఫూర్తి ఏమిటన్నదే ముఖ్యం. సర్వధర్మ సమభావన కలిగి ఉండాలి. దీనినే మనం ప్రస్తుతం లౌకికవాదం అని అంటున్నాం. అన్ని మతాల్ని సమాన గౌరవంతో చూడాలి. యువత ఆదర్శపూర్వకంగా, శక్తిమంతంగా ఉండాలి. యువతగా ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యువకుడిగానే స్వామీ వివేకానందుడు చికాగో సదస్సులో పాల్గొన్నారు. ఒకవేళ వయసు పైబడిన వ్యక్తిగా స్వామీజీ ఆ సదస్సులో పాల్గొని ఉంటే ఆయన ప్రసంగం అంత స్ఫూర్తిదాయకంగా ఉండేది కాదు. చికాగోలో స్వామీజీ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగం చేయలేదు. భారతీయ మత స్వేచ్ఛ గురించి చాటిచెప్పారని పీవీ పేర్కొన్నారు. 


భిన్న సంస్కృతులు గల భారత సమాజంలో యువతపై ముఖ్యమైన బాధ్యత ఉంది. ‘సాంస్కృతిక, వారసత్వ విధానాల్ని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉంది. సామాజిక సుస్థిరత, అభివృద్ధి, మార్పులో యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరముంది. అందుకే ఓటుహక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. సామాజిక సామరస్యం, ఆనందం, ప్రగతి అంశాలపై యువత కృషి చేయాలి’ అని పీవీ పేర్కొన్నారు. వివేకానందుడిని పీవీ అర్థం చేసుకున్న తీరు విశిష్టమైనది, విలక్షణమైనది. వివేకానందుడి స్ఫూర్తిని యువత అందుకోవాల్సిన ఆవశ్యకతను అనేక వేదికలపై పీవీ వివరించారు. భిన్నత్వంలో ఏకత్వమే మనిషి జీవన విధానం కావాలని బోధించిన వివేకానందుడు, అదే బాటను అనుసరించిన పీవీ మనకు మార్గదర్శకులు.

పి.వి. ప్రభాకర్ రావు 

(వ్యాసకర్త పీవీ తనయుడు)

(నేడు వివేకానందుని 158వ జయంతి)

Updated Date - 2021-01-12T06:27:51+05:30 IST